సాక్షి, ఒంగోలు: దండగమారి వ్యవసాయం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. గత ఎన్నికల ప్రచారంలో రైతు పక్షపాతినంటూ నమ్మబలికి..గద్దెనెక్కిన బాబు నిజరూపం మరోమారు బయటపడింది. పంట రుణాల మాఫీ అమలుపై ఇన్నాళ్లూ కొనసాగిన సర్కారు దోబూచులాట..బుధవారం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌తో వీడిపోతుందని రైతులు భావించారు.
రైతు కుటుంబానికి రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తున్నామంటూ ..
ఇటీవల ప్రభుత్వ జీవో సైతం విడుదల చేసిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తాజా బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే తీసుకురాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఐదు లక్షల మంది రైతులు జాతీయబ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకున్నారు.
కిందటేడాది జిల్లాలోని రైతులకు రూ.5800 కోట్ల పంట రుణాల్ని పంపిణీ చేస్తే.. ఈఏడాది రూ.4100 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఇంత వరకు ఒక్క రూపాయి అందివ్వలేదు. బ్యాంకుల్లో మొత్తం రూ.6,900 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి. తీరాచూస్తే.. బడ్జెట్‌లో రుణాలమాఫీ అంశమే లేకపోవడంతో జిల్లాలోని లబ్ధిదారులు డీలాపడిపోయారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టనున్న ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌లో ఉండొచ్చని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నప్పటికీ.. రైతుల్లో అంతగా నమ్మకం కలగడం లేదు.
సర్కారు మెలికలు..
రుణమాఫీ కావాలంటే ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకంతో టైటిల్‌డీడ్ ఉండాలంటూ తదితర కొర్రీలు పెట్టినా రైతులు వాటన్నింటినీ అంగీకరించారు. తాజాగా, దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 174ను జారీచేసింది. దీనివలన చిన్నసన్నకారు రైతులకు ఏమాత్రం లబ్ధి చేకూరదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గత డిసెంబర్ 31వ తేదీకి ముందు రుణం తీసుకుని గత మార్చి 31 వరకు రుణగ్రస్తులైన రైతులకే రుణమాఫీ వర్తిస్తుందని జీవో సారాంశం.
డిసెంబర్ 31లోపు రుణాలు తీసుకున్న రైతులకే అన్న నిబంధన సహకార బ్యాంకుల్లో బకాయి పడిన మెజార్టీ రైతులను నట్టేటముంచింది. ఈ విషయంపై రెండ్రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన ఆప్‌కాబ్ సమావేశంలో చర్చించారు. ఈ జీవో కారణంగా సకాలంలో పంటరుణాలు చెల్లించిన వారికి రుణమాఫీ పథకం వర్తించదని బ్యాంకర్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది రైతులు రూ.500 కోట్లమేర లబ్ధిని కోల్పోతారని తేలింది. 2014 మార్చి 31 నాటికి ఔట్‌స్టాండింగ్‌గా ఉన్న రుణాలు 2013 డిసెంబర్ 31లోపు తీసుకుని ఉండాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు.
నష్టపోతున్న సన్నచిన్నకారు రైతులు:
సహకార సంఘాల్లోని రైతులు పీసీసీబీ నిబంధనల మేరకు ఏటా రెండు పర్యాయాలు అంటే 0 శాతం వడ్డీరాయితీ, పావలావడ్డీ పథకాలు ఉపయోగించుకునేందుకు మార్చి 31లోపు ఒక పర్యాయం, ఖరీఫ్‌లో పంటలబీమా పథకం పొందేందుకు జూన్ 30లోపు మరోపర్యాయం రుణాలు చెల్లిస్తుంటారు. అదీ చాలా వరకు బుక్‌అడ్జస్ట్‌మెంట్ చేసి మళ్లీ తీసుకోవడం పరిపాటి.
జీవోనంబర్ 174 ప్రకారం సకాలంలో రుణాలు కట్టిన రైతులకు రుణమాఫీ పథకం వర్తించనట్లే.. 2013 డిసెంబర్ 31 నాటికి జిల్లాలో చాలామంది రైతులు రుణాలను తిరిగి చెల్లించారు. ఈవిధంగా సుమారు రూ.500 కోట్లు చెల్లింపులు జరిగాయని.. సర్కారు జీవో నంబర్‌ను సవరించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
ఆశ..నిరాశే..!
Published Thu, Aug 21 2014 3:29 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement