ఆర్థిక ప్రణాళికలకు ధరల స్పీడ్ గుర్తించాలి...
భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికల విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ద్రవ్యోల్బణం. చాలా మంది ఈ ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పట్టించుకోరు. వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం రేటు కంటే మీ అంచనాలు కనీసం 1–2 శాతం తక్కువ ఉన్నా కానీ, లక్ష్యాలకు విఘాతం ఏర్పడినట్టే. అందుకే ఆర్థిక ప్రణాళికల్లో ద్రవ్యోల్బణం విషయంలో అంచనాలు కచ్చితంగా ఉండడం ఎంతో అవసరం అవుతుంది.
నివసించే ప్రాంతం కూడా...
మీరు పట్టణాల్లో ఉంటున్నారా లేక గ్రామీణ ప్రాంతాల్లోనా అన్నది కూడా మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణ రేటు, అధికారిక ద్రవ్యోల్బణ రేటు మధ్య వ్యత్యాసానికి కారణమవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్ వరకు చూసుకుంటే, పట్టణాల్లో నివసించే వారు 4.2 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని చవిచూడగా, ఇదే కాలంలో గ్రామీణ ప్రజలు ఎదుర్కొన్న రేటు 1.8 శాతంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో సీపీఐ ద్రవ్యోల్బణం 1–2 శాతం మధ్య నమోదు కాగా, కేరళలో ఇది 5 శాతం స్థాయిలో ఉంది.
అందుకనే పట్టణాల్లో ఉండేవారు, దక్షిణాది రాష్ట్రాల్లో నివాసం ఉండే వారు తమ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల రచనకు అధికారిక ద్రవ్యోల్బణ రేటు కంటే అదనంగా మరో 2 శాతాన్ని కలిపి పరిగణనలోకి తీసుకోవాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇక మీ వ్యక్తిగత ద్రవ్యోల్బణం ఎంతన్నది కచ్చితంగా తెలుసుకునేందుకు, మీ నెలవారీ ఇంటి ఖర్చులను జాగ్రత్తగా పరిశీలించుకోవడం మరో మార్గం. దాంతో మీ పరిస్థితులకు తగ్గ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈ విషయంలో మీరు పెద్దగా శ్రమ పడాల్సిన పని లేకుండా ఆ పనిచేసి పెట్టే మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి. సంబంధిత యాప్స్ పెరిగే ఖర్చులతోపాటు, మీ జీవనశైలి మార్పులను ట్రాక్ చేస్తాయి.
లక్ష్యాలకు అనుగుణంగా అంచనాలు
రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక ప్రణాళికలకు సంబంధించి పెట్టుబడులకు పైన చెప్పుకున్న విధానాలు అక్కరకు వస్తాయి. అయితే, మీ పిల్లల విద్య లేదా ఇంటి కొనుగోలు లేదా మీ ఆరోగ్య సంరక్షణ వంటి ప్రత్యేక లక్ష్యాల కోసం నిధిని సమకూర్చుకోదలిచిన వారు, ఆయా విభాగాల్లో పెరిగే రేట్లకు అనుగుణంగా ద్రవ్యోల్బణ అంచనాలు వేసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత విద్యనే తీసుకోండి. చాలా వరకు ఫైనాన్షియల్ కాలిక్యులేటర్లు విద్యా ద్రవ్యోల్బణ రేటును 7–8 శాతం మధ్య అంచనాగా చూపిస్తుంటాయి.
అయితే, ప్రతిష్టాత్మక, పేరున్న విద్యా సంస్థల్లో చదివించాలన్న లక్ష్యంతో ఉన్న వారు, ఈ రేటుకు అదనంగానే పరిగణనలోకి తీసుకోవాలి. 2012లో ఐఐటీల్లో సాధారణ కేటగిరీలో ఇంజనీరింగ్ విద్య కోసం ఏడాదికి రూ.50వేలు వెచ్చించాల్సి రాగా, ఈ రోజు అదే కేటగిరీ ఫీజు రూ.2 లక్షలకు చేరింది. అంటే అక్షరాలా 22 శాతం ద్రవ్యోల్బణ రేటు. బిట్స్ పిలానీ అయితే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ఫీజులను ఏటా 15 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఐఐఎం అహ్మదాబాద్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఫీజు ఐదేళ్ల క్రితం రూ.16.5 లక్షలు ఉంటే, అదిప్పుడు రూ.23 లక్షలకు పెరిగింది.
ఇక ఇతర ఇంజనీరింగ్ లేదా మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూషన్లలో ఫీజుల పెరుగుదల వీటి కంటే కాస్త తక్కువగా ఉంది. అందుకని విద్యా ద్రవ్యోల్బణం అనేది పిల్లలను ఏ కోర్సుల వైపు పంపిద్దామనుకుంటున్నారనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే, ఒకవేళ మీ పిల్లలను ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలనుకుంటే, కచ్చితంగా డాలర్‌తో రూపాయి తరుగుదల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కోర్సు ఫీజుల పెరుగుదల ప్రభావానికి తోడు, రూపాయి క్షీణతను 4–5 శాతం మధ్య పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణుల సూచన.
ఇల్లు విషయంలో...
ఇక ఇల్లు కొనుగోలు చేయాలన్నది మీ లక్ష్యం అయితే, సాధారణ ద్రవ్యోల్బణ రేటు కాకుండా, ప్రాపర్టీ మార్కెట్లో ధరల పెరుగుదల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పట్టణంలో అయితే మీరు ఎంచుకున్న ప్రాంతం డిమాండ్ ఉన్నదా లేక శివారులోనా లేక మరో చోటా అనే దాని ఆధారంగా ద్రవ్యోల్బణ ప్రభావంలో మార్పు వస్తుంది. ప్రాపర్టీ ధరలను తెలియజేసే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ రెసిడెక్స్ గణాంకాలను పరిశీలిస్తే... ఢిల్లీ, గురుగ్రామ్‌లో 2013–2018 మధ్య ప్రాపర్టీ ధరలు ఫ్లాట్‌గా ఉండగా, హైదరాబాద్ మార్కెట్లో 6.9 శాతం, వైజాగ్, కోచిలో 7 శాతం, బెంగళూరులో 7.4 శాతం, చెన్నైలో 5.3 శాతం చొప్పున ఏటేటా పెరిగినట్టు తెలుస్తోంది.
ఇక ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం ఏర్పాటు చేసుకునే నిధికి 6–7 శాతం ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకుంటే అవసరమైన సందర్భంలో నిధులకు కటకట ఎదురవకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో వైద్య చికిత్సల వ్యయాలు రెండంకెల స్థాయిలో పెరిగిపోవడం గమనార్హం. ఊహించని వైద్య అవసరాల కోసం ఓ నిధిని ఏర్పాటు చేసుకునేట్టు అయితే, 10 శాతం ద్రవ్యోల్బణ రేటును పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ నెలా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. దీన్నే దేశంలో ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన గణాంకాల ఆధారంగా గత ఆరేళ్లలో సగటు ద్రవ్యోల్బణం 4.8 శాతంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కానీ, మీ ఆర్థిక ప్రణాళికలకు ఈ రేటును పరిగణనలోకి తీసుకుంటే అది తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే సీపీఐ ద్రవ్యోల్బణం, మీరు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం కంటే తక్కువే ఉంటుంది. సీపీఐ అన్నది దేశంలో సాధారణ ఆదాయం కలిగిన గృహస్థులపై ఉండే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. భిన్న వస్తు, సేవల ఆధారంగా తక్కువ ఆదాయం కలిగిన ఇంటి ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఉదాహరణకు ఆహారం, పానీయాలకు ఈ సూచీలో 46 శాతం వెయిటేజీ ఉంది. అదే సమయంలో ఇంటి కోసం చేసే అద్దె ఖర్చులకు 10 శాతం, రవాణా, హెల్త్, విద్య, వినోదం అన్నింటికీ కలిపి 25 శాతమే వెయిటేజీ ఉంది.
కానీ, మధ్యస్త ఆదాయం నుంచి అధిక ఆదాయ వర్గాలు ఆహారం, పానీయాలకు కాస్త తక్కువగా, అదే సమయంలో ఇల్లు, సేవలపై ఎక్కువగా వెచ్చిస్తుంటారు. మరి ఆహార ధరలు తగ్గుతుంటే, సేవలు ఖరీదవుతున్నాయి. కనుక సగటు ఇంటిపై ద్రవ్యోల్బణం విషయంలో సీపీఐ రేటు వాస్తవికంగా ఉండదని గమనించాలి. సీపీఐ రేటు ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల గత ఆరేళ్లలో 4 శాతంగానే అని చూపిస్తున్నప్పటికీ... సగటు గృహస్థులు ఎదుర్కొన్న రేటు 7 శాతంగా ఉంది. అదే విద్యా సంబంధిత ద్రవ్యోల్బణం 6.3 శాతం, ఆరోగ్య సంరక్షణ వ్యయాలపై 5.8 శాతం ద్రవ్యోల్బణ ప్రభావం ఉంది. అందుకే సీపీఐ ద్రవ్యోల్బణంలో ఆహారోత్పత్తుల రేటు కంటే కూడా సేవల రంగ రేటును పరిగణనలోకి తీసుకోవడం సమంజసమన్నది నిపుణుల అభిప్రాయం.
మీ ద్రవ్యోల్బణం రేటు ఎంత?
Published Mon, Sep 23 2019 12:06 AM | Last Updated on Mon, Sep 23 2019 12:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment