అంత్యక్రియలకు గ్యాస్ వినియోగించాలని నిర్ణయం
సగం ఖర్చుతో కార్యక్రమం పూర్తి
పైపులైన్లకు దగ్గరగా ఉన్న శ్మశాన వాటికలకు అనుసంధానం
ఆర్థిక బడ్జెట్‌లో నిధులు మంజూరు
సాక్షి, ముంబై: శ్మశాన వాటికలో అంత్యక్రియలకు గ్యాస్ ద్వారా నిర్వహించాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయం తీసుకుంది. విడతలవారీగా అన్ని హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేయాలని, అందుకు ఆర్థిక బడ్జెట్‌లో నిధులు కూడా మంజూరు చేసింది. కట్టెల ద్వారా దహనకాండ చేయడంవల్ల పర్యావరణానికి హాని, కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో గ్యాస్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ముంబైలో దాదాపు 35 శ్మశాన వాటికలు ఉన్నాయి. సాధారణంగా ఒక్కో శవానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే సుమారు 300 కేజీల కట్టెలు అవసరమవుతాయి. అందుకు బీఎంసీ శ్మశాన వాటికలో రూ.1,890 ఖర్చవుతాయి. అదే ప్రైవేటు శ్మశాన వాటిలో రూ.2,090 చెల్లించాల్సి ఉంటుంది.
కాగా శవం తాలూకు కుటుంబం ఆర్థిక పరిస్థితిని బట్టి ఇందులో కొంత శాతం రుసుం వారి నుంచి వసూలు చేస్తారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పేదలకు మాత్రం ఉచితంగానే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ భారాన్ని బీఎంసీ స్వయంగా భరిస్తోంది. అదేవిధంగా ఒక్కో శవానికి విద్యుత్ ద్వారా దహనకాండకు రూ.700 ఖర్చుకాగా సీఎన్‌జీ ద్వారా రూ.630 ఖర్చవుతోంది. కట్టెలతో పోలిస్తే గ్యాస్ ద్వారా దహన క్రియలు పూర్తిచేయడం బీఎంసీకి ఎంతో గిట్టుబాటు అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ద్వారా అంత్యక్రియలు పూర్తిచేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో మహానగర్ గ్యాస్ పైపులైన్లు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయో ఆ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధానించాలని యోచిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ పైపులైన్లకు వంద మీటర్ల లోపు ఉన్న తొమ్మిది, వంద మీటర్ల తర్వాత ఉన్న 11 శ్మశాన వాటికలను గ్యాస్‌తో అనుసంధించాలని బీఎంసీ పరిపాలన విభాగం నిర్ణయించింది.
సీఎన్‌జీకి బీఎంసీ ఓకే..
Published Mon, Feb 17 2014 11:05 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement
Advertisement