ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఈ వారంలో అంటే జూలై 23 మంగళవారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రాజకీయ సవాళ్లతో సంబంధం లేకుండా ఈ సంవత్సరం ఎన్నో ఆర్థిక సవాళ్లు ప్రభుత్వం ముందున్నాయి. అభివృద్ధి, ధరల పెరుగుదల, దేశ రక్షణ, సైబర్ సెక్యూరిటీ సమస్యలు ఒక వైపున ఉండగా .. ప్రతి రంగం, ప్రతి పరిశ్రమ, పలు సంస్థలు ఏదో ఒక ఉపశమనం కావాలి.. రావాలి అనుకోవడం మరోవైపున ఉంది. అలాగే, స్త్రీలు, వయోవృద్ధులు, రైతులు, వ్యక్తులు, అందునా వేతన జీవులు కూడా ఎంతో కొంత ఉపశమనం కోరుకుంటున్నారు.
రేపు మధ్యాహ్నం ఒంటిగంటకల్లా మనకి బడ్జెట్లో ఏమి ఉందో, ఏమి లేదో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఉన్నత వర్గాల్లో చర్చలు, సమాలోచనలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు, సగటు వేతన జీవులు కోరుకుంటున్న చిన్ని చిన్ని అంశాలేమిటంటే..
బేసిక్ లిమిట్ పెంపు: ప్రస్తుతం అమల్లో ఉన్న బేసిక్ లిమిట్ రూ. 2,50,000. ఇది చాలా సంవత్సరాల క్రితం నుంచి అమల్లోకి ఉంది. దీన్ని బాగా పెంచమని ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చారు. దీనికి కారణం ధరల పెరుగుదల. ఈ బేసిక్ లిమిట్‌ని రూ. 5,00,000కి పెంచమని ఒత్తిడి ఉంది. అయితే, అంత పెంచకపోయినా కనీసం ఆ పరిమితిని ఒక లక్ష రూపాయలైనా పెంచవచ్చని అంచనా. ఇలా చేయడం వల్ల ఇటు ఉద్యోగస్తులకు, అటు ఇతరులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది.
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు: ప్రస్తుతం రూ. 50,000 వరకే స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తున్నారు. ఇది జీతం, పెన్షన్ మీద కాకుండా ఫ్యామిలీ పెన్షన్ మీద ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని లక్ష రూపాయల వరకు పెంచాలని విన్నపాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయోజనం కేవలం వేతనజీవులకే పరిమితం. ఉద్యోగ సంఘాలు గట్టిగా ఒత్తిడి తెస్తున్నాయి. ఇదొక మార్పు ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.
80సి కింద మినహాయింపు పెంపు: ఈ సెక్షన్‌లో కూడా ఎన్నో అంశాలు ఉన్నాయి. పీఎఫ్, ఎన్‌ఎస్‌సీలు, ఎఫ్‌డీలు, ఇంటి లోన్ చెల్లింపు, స్కూల్ ఫీజులు మొదలైనవి ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ ఏమిటంటే, ఈ లిమిట్‌ని పెంచమని. సేవింగ్స్ ముఖ్యం. ఇంటి లోన్ చెల్లింపు ముఖ్యం. స్కూల్ ఫీజులూ కంపల్సరీ. ఇవి ప్రతి కుటుంబానికి తప్పని పేమెంట్లు. ఈ లిమిట్స్ పెంచడం సమంజసం. ఇదొక అంశం గవర్నమెంటు పరిశీలనలో ఉంది.
మెడిక్లెయిం, మెడికల్ ఖర్చులు, బీమా: ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నామో, అనారోగ్యం పేరిట అన్ని దుఖాలూ అనుభవిస్తున్నాం. రోగాలు పెరుగుతున్నాయి. ఖర్చు కూడా ఊహకందని విధంగా పెరుగుతోంది. అందువల్ల మెడిక్లెయిం, మెడికల్ ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికి పరిమితిని పెంచడం చాలా న్యాయం. ఇది కూడా గవర్నమెంటు వారి పరిశీలనలో ఉంది.
ఇలా చాలా చెప్పవచ్చు. క్యాపిటల్ గెయిన్స్‌లో కొన్ని జటిలమైన అంశాలున్నాయి. వీటి విషయంలోనూ సడలింపులు, హేతుబద్ధమైన చర్యలు చేపట్టాలి. పన్నులు కడుతున్న వారికి ప్రశంసలు, పత్రాలు కాకుండా పన్ను మొత్తంలో ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలి. వేచి చూద్దాం. సీతమ్మగారు శీత కన్ను వేస్తారో .. వెతలు తీరుస్తారో.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment