న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,585 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2019–20) ఇదే కాలంలో రూ. 9,864 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 63,057 కోట్ల నుంచి రూ. 89,319 కోట్లకు ఎగసింది. ఇదే కాలంలో యూకే అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) 95.2 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు నష్టం(రూ. 9,600 కోట్లు) ప్రకటించింది.
ఇందుకు 1.5 బిలియన్ పౌండ్ల(రూ. 14,994 కోట్లు) అనూహ్య చార్జీలు కారణమయ్యాయి. వీటిలో పెట్టుబడులపై నగదేతర రైటాఫ్‌లు, పునర్వ్యవస్థీకరణ చార్జీలు కలసి ఉన్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. తద్వారా జేఎల్‌ఆర్‌కు సంబంధించి కొత్త గ్లోబల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఆధునిక లగ్జరీ డిజైన్లు, డెలివరీ తదితరాల రీఇమేజిన్‌కు తెరతీసినట్లు తెలియజేసింది. దీంతో 2025–26కల్లా రెండంకెల ఇబిట్ మార్జిన్లు సాధించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది.
స్టాండెలోన్ ఇలా
క్యూ4లో జేఎల్‌ఆర్ ఆదాయం 20 శాతంపైగా ఎగసి 6.5 బిలియన్ పౌండ్లను తాకింది. రిటైల్ అమ్మకాలు 12 శాతం పుంజుకుని 1,23,483 యూనిట్లకు చేరాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ క్యూ4లో టర్న్‌అరౌండ్ ఫలితాలు సాధించింది. దాదాపు రూ. 1,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో రూ. 4,871 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 10,002 కోట్ల నుంచి రూ. 20,306 కోట్లకు జంప్‌చేసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన విక్రయాలు 90 శాతం దూసుకెళ్లి 1,95,859 యూనిట్లకు చేరాయి.
పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జేఎల్‌ఆర్ మొత్తం ఆదాయం 19.7 బిలియన్ పౌండ్లను తాకింది. వాహన అమ్మకాలు దాదాపు 14 శాతం క్షీణించి 4,39,588 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక గతేడాదిలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,395 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో రూ. 11,975 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,64,041 కోట్ల నుంచి రూ. 2,52,438 కోట్లకు వెనకడుగు వేసింది.
క్యూ1 వీక్
ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో పటిష్ట డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాల సమస్యకానున్నాయి. కోవిడ్–19 సెకండ్‌వేవ్ లాక్‌డౌన్, కమోడిటీల పెరుగుదలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఆటో పరిశ్రమను దెబ్బతీసే వీలున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అయితే 2021–22 రెండో త్రైమాసికం నుంచీ పటిష్ట రికవరీ కనిపించగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో జేఎల్‌ఆర్ బిజినెస్‌పై 2.53 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలియజేశారు. దేశీయంగా రూ. 3,000–3,500 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.
టాటా మోటార్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.4% జంప్‌చేసి రూ. 332 వద్ద ముగిసింది.ఇంట్రాడేలో రూ. 337 వరకూ బలపడింది.
సవాళ్లు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నాం..
ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గతేడాది కంపెనీ నిలదొక్కుకోవడంతోపాటు పటిష్ట రికవరీని సాధించింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. బ్రిటిష్ ఐకానిక్ బ్రాండ్లతో కూడిన భవిష్యత్ లగ్జరీ డిజైన్‌ల ద్వారా అమలు చేస్తున్న రీఇమేజిన్ వ్యూహాలు ఇందుకు దోహదపడుతున్నాయి.
– థియరీ బోలోర్, జేఎల్‌ఆర్ సీఈవో
సరఫరాల సమస్యను అధిగమిస్తున్నాం..
కోవిడ్–19 కారణంగా గతేడాది ఆటో పరిశ్రమ భారీగా ప్రభావితమైంది. అయినప్పటికీ వాహనాలకు నిలకడైన వృద్ధి కనిపించింది. లాక్‌డౌన్‌లు తొలగిపోవడం, డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక రికవరీ వంటి అంశాలు ఇందుకు సహకరించాయి. సరఫరా సమస్యలను అధిగమిస్తూ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇదే సమయంలో ఉద్యోగులు, సహచర సిబ్బంది ఆరోగ్యం, రక్షణ తదితరాలకు ప్రాధాన్యమిచ్చాం.
– గాంటర్ బుషక్, టాటా మోటార్స్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment