ఫెడ్‌ నిర్ణయాలు, క్యూ4 ఫలితాలు కీలకం | US Fed, 5 other factors that will drive market this week | Sakshi
Sakshi News home page

ఫెడ్‌ నిర్ణయాలు, క్యూ4 ఫలితాలు కీలకం

Published Mon, May 1 2023 6:17 AM | Last Updated on Mon, May 1 2023 6:17 AM

US Fed, 5 other factors that will drive market this week - Sakshi

ముంబై: అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు, కార్పొరేట్‌ క్యూ4 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అదానీ గ్రూప్‌ – హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ తాజా పరిణామాలు, దేశీయ అతిపెద్ద ప్రైవేట్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు సమావేశ వివరాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరుగుతుంది. 
 
వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్, ఈసీబీ పాలసీ సమావేశ నిర్ణయాలు రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను నడిపిస్తాయి. ఇక దేశీయ మార్కెట్‌ మూమెంటమ్‌ స్వల్పకాలం పాటు సానుకూలంగా కొనసాగొచ్చు. అయితే కీలక స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్న తరుణంలో పరిమిత శ్రేణిలో  కదలాడొచ్చు. సాంకేతికంగా ఎగువ స్థాయిలో నిఫ్టీ 18,100–18,200 పరిమిత శ్రేణి నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,850 వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ సాంకేతిక నిపుణుడు అజిత్‌ మిశ్రా తెలిపారు.

అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో గతవారంలో సెన్సెక్స్‌ 1,457 పాయింట్లు, నిఫ్టీ 441 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ మినహా ఇతర రంగాల కార్పొరేట్‌ కంపెనీ ప్రోత్సాహకరమైన ఆర్థిక గణాంకాలను వెల్లడించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, క్రూడాయిల్‌ ధరల క్షీణత, వొలటాలిటీ ఇండెక్స్‌ చారిత్రాత్మక కనిష్టాలకు దిగిరావడం, అమెరికా ఐటీ దిగ్గజం మెటా మెరుగైన ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత ఐటీ షేర్ల ర్యాలీ తదితర అంశాలు దలాల్‌ స్ట్రీట్‌లో సెంటిమెంట్‌ను బలపరిచాయి.

ఫెడ్‌ సమావేశ నిర్ణయాలపై దృష్టి  
ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలు మంగవారం(మే 2న) మొదలై.., బుధవారం ముగియను న్నాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఫెడ్‌ 25 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ‘‘ఒక వేళ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించినట్లయితే.., ఆర్థిక వృద్ధి మందగన ఆందోళనల దృష్ట్యా ఆర్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వడ్డీరేట్లను తగ్గించే వీలుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వె స్టర్ల పెట్టుబడులు ఊపందుకోవచ్చు’’అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ సాంకేతిక నిపుణుడు ప్రవేష్‌ గౌర్‌ తెలిపారు.

అదానీ హిండెన్‌బర్గ్‌ తాజా పరిణామాలు
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు కావాలని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) శనివారం సుప్రీంకోర్టును కోరింది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు తాజా వివరాలను, ప్రాథమికంగా గుర్తించిన అంశాలను నిపుణుల కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసి రెండు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఈ మార్చి 2న సెబీ ఆదేశాలు జారీ చేసిన తెలిసిందే.

కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు
కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్‌ కీలక దశకు చేరింది. టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ, హీరోమోటోకార్ప్, కోల్‌ ఇండియా, అంజుజా సిమెంట్స్, టైటాన్, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌తో సహా సుమారు 200కి పైగా కంపెనీలు తమ నాలుగో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాల కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.  ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు.

స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి
దేశీయ ఆటో కంపెనీలు నేడు (సోమవారం) ఏప్రిల్‌ హోల్‌సేల్‌ అమ్మకాల వివరాలను వెల్లడిస్తాయి. ఇదే రోజున ఏప్రిల్‌ దేశీయ తయా రీ రంగ పీఎంఐ డేటా, మూడో తేదీ(బుధవారం)న సేవారంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఆర్‌బీఐ ఏప్రిల్‌ 28 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్‌ నిల్వలు..,  ఏప్రిల్‌ 21వ తేదీతో ముగిసిన బ్యాంక్‌ రుణాలు–డిపాజిట్‌ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు (సోమవారం) అమెరికా ఏప్రిల్‌ తయారీ రంగ, నిర్మాణ వ్యయ వివరాలు వెల్లడి కానున్నాయి. అమెరికా ఫెడ్‌ సమావేశ నిర్ణయాలు, యూరో జోన్‌ నిరుద్యోగ రేటు గణాంకాలు బుధవారం విడుదల అవుతాయి. ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, అమెరికా మార్చి బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ గురువారం వెల్లడి కానున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.   

ఈ ఏడాదిలో అత్యధిక కొనుగోళ్లు
దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏప్రిల్‌లో బుల్లిష్‌ వైఖరి ప్రదర్శించారు. నెల మొత్తంగా ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.11,631 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.4,268 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌సీడీఎల్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఈక్వి టీ, డెట్‌ విభాగాల్లో ఏప్రిల్‌ పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత ఈక్విటీలు అధిక వ్యాల్యూయేషన్ల నుంచి సాధారణ స్థితికి దిగివచ్చాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ కరిగిపోయింది. దీంతో ఎఫ్‌ఐఐలు వరుసగా రెండోనెలా నికర కొనుగోలుదారులుగా నిలిచారు. డ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయం రానున్న రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల తీరును నిర్ణయిస్తుంది’’ అని రైట్‌ రీసెర్చ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ ఫౌండర్‌ సోనమ్‌ శ్రీవాస్తవ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement