న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతంపైగా ఎగసి రూ. 16,203 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 13,227 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం జంప్‌చేసి రూ. 2.32 లక్ష కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 8 డివిడెండ్ ప్రకటించింది. వివిధ బిజినెస్‌లలో 2.1 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించింది.
పూర్తి ఏడాదికి...
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్ రూ. 67,705 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7.92 లక్షల కోట్ల(102 బిలియన్ డాలర్లు)కు చేరింది. వెరసి తొలిసారి 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకున్న దేశీ కంపెనీగా చరిత్ర సృష్టించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలను సైతం సాధించింది. విభాగాల వారీగా చూస్తే ఆయిల్ టు కెమికల్ బిజినెస్(ఓటూసీ) 44% వృద్ధితో రూ. 1.45 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 28 శాతం బలపడి రూ. 33,968 కోట్లను తాకింది. ఇక రిటైల్ విభాగం టర్నోవర్ 27% పెరిగి రూ. 1,99,704 కోట్లయ్యింది. పన్నుకు ముందు లాభం 26% పుంజుకుని రూ. 12,381 కోట్లకు చేరింది. క్యూ4లో ఓటూసీ విభాగం 25 శాతం అధికంగా రూ. 14,241 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది.
రిలయన్స్ జియో లాభం జూమ్
రిలయన్స్ జియో స్టాండెలోన్ నికర లాభం గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 4,313 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,360 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ. 20,901 కోట్లకు చేరింది. 21 శాతం అధికంగా రూ. 167.6 ఏఆర్‌పీయూ సాధించింది. అయితే సిమ్ కన్సాలిడేషన్ కారణంగా కస్టమర్ బేస్ 10.9 మిలియన్లు తగ్గింది. నికరంగా 410.2 మిలియన్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 14,854 కోట్లను తాకింది.
సవాళ్లలోనూ జోరు
కరోనా సవాళ్లు, భౌగోళిక రాజకీయ అస్థిరతల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. డిజిటల్ సర్వీసులు, రిటైల్ విభాగాల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించామని చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఇంధన మార్కెట్లలో నమోదైన ఆటుపోట్లను తట్టుకోవడం ద్వారా ఓటూసీ బిజినెస్ నిలకడను చూపింది. అంతేకాకుండా ప్రస్తావించదగ్గ రికవరీని సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్
Comments
Please login to add a commentAdd a comment