
గత మూడు నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఐవోఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్..గత 8 రోజులుగా మరింత జోరందుకుంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థకు షేర్ల కేటాయించిన తదుపరి ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో గత 8 సెషన్లలో 32 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఐవోఎల్ కెమికల్స్ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 474కు చేరువైంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం వృద్ధితో రూ. 468 వద్ద ట్రేడవుతోంది. గత 3 రోజుల్లోనే ఈ కౌంటర్ 20 శాతం లాభపడటం గమనార్హం. ఈ నెల 17న ప్రమోటర్ సంస్థ ఎన్‌సీవీఐ ఎంటర్‌ప్రైజెస్‌కు షేరుకి రూ. 205 ధరలో 7.18 లక్షల షేర్లను కంపెనీ కేటాయించింది. వీటికి మూడేళ్ల లాకిన్ అమలుకానుంది. యాంటీడయాబెటిస్, కొలెస్ట్రాల్, యాంటీకన్వల్‌సెంట్స్ తదితర తయారీ ఐవోఎల్ కెమ్ గత నెలలో వాణిజ్య శాఖ నుంచి త్రీస్టార్ ఎక్స్‌పోర్ట్ హౌస్‌ను పొందింది. ఈ షేరు గత మూడు నెలల్లో 180 శాతం దూసుకెళ్లడం విశేషం!
బ్యాంక్ ఆఫ్ ఇండియా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 3571 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 252 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్‌లో అధిక ప్రొవిజన్లు, పన్నుల రైట్‌బ్యాక్ లాభాలను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 3793 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 2.9 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రెట్టింపై రూ. 8142 కోట్లను తాకాయి. ఆరు ఎన్‌పీఏ ఖాతాలకుగాను అదనంగా రూ. 3941 కోట్లను కేటాయించినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8.3 శాతం పతనమై రూ. 50.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 48 వరకూ బలహీనపడింది.