
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ టెక్నాలజీ సర్వీసుల కంపెనీ టాటా ఎలక్సీ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 39 శాతం జంప్‌చేసి రూ. 160 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 31 శాతంపైగా ఎగసి రూ. 682 కోట్లకు చేరింది. గతేడాదికిగాను వాటాదారులకు షేరుకి రూ. 42.5 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 49 శాతం పురోగమించి రూ. 550 కోట్లయ్యింది. 2020–21లో కేవలం రూ. 368 కోట్ల లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 35 శాతం వృద్ధితో రూ. 2,471 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,826 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది.
ఫలితాల నేపథ్యంలో టాటా ఎలక్సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 7,830 వద్ద ముగిసింది.