నిరాశపరిచిన డాక్టర్ రెడ్డీస్
తొలి క్వార్టర్‌లో 53% తగ్గిన నికర లాభం
► రూ.59 కోట్లుగా నమోదు
► 3% పెరిగి రూ.3,316 కోట్లకు చేరిన ఆదాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికంలో నిరాశ పరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ (ఐఎఫ్‌ఆర్‌ఎస్) ప్రకారం కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 53 శాతం తగ్గి రూ.126 కోట్ల నుంచి రూ.59 కోట్లకు పడిపోయింది. తొలి త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినట్లు రెడ్డీస్ సహ ఛైర్మన్ జి.వి.ప్రసాద్ చెప్పారు. ‘యూఎస్‌లో కస్టమర్ల కన్సాలిడేషన్ వల్ల విక్రయ ధరల్లో కోత పడింది.
అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు తగ్గడంతో పాటు భారత్‌లో జీఎస్‌టీ అమలు ఇందుకు కారణం’ అని వెల్లడించారు. ఇక టర్నోవరు 3 శాతం వృద్ధి చెంది రూ.3,316 కోట్లకు చేరింది. ఎబిటా రూ.340 కోట్లుగా నమోదైంది. త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధికి సంస్థ రూ.510 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10–15 కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు.
కలిసొచ్చిన ఎమర్జింగ్ మార్కెట్లు..
గ్లోబల్ జనరిక్స్ విభాగం 3 శాతం వార్షిక వృద్ధితో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ ఇందుకు దోహదం చేశాయి. అలాగే ప్రధాన మార్కెట్లలో కొత్త ఉత్పత్తుల విడుదల కూడా తోడైంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఆదాయం గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 34 శాతం పెరిగి రూ.570 కోట్లకు చేరింది. యూరప్ మార్కెట్ 28 శాతం వృద్ధితో రూ.210 కోట్లు సమకూర్చింది. ఉత్తర అమెరికాలో మాత్రం ఆదాయం 4 శాతం తగ్గి రూ.1,490 కోట్లకు పరిమితమయింది.
భారత మార్కెట్ 10 శాతం తగ్గి రూ.470 కోట్లు నమోదైంది. జీఎస్‌టీ కారణంగా విక్రేతలు కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో భారత్ నుంచి ఆదాయం తగ్గింది. జూన్‌లో కొనుగోళ్లు భారీగా పడిపోయాయని, అధిక డిస్కౌంట్లు ఇవ్వాల్సి వచ్చిందని, ఇది లాభాలపై కూడా ప్రభావం చూపించిందని సీవోవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. కాగా, జూన్ నాటికి యూఎస్‌ఎఫ్‌డీఏ వద్ద 99 జనరిక్ ఫైలింగ్స్ పెండింగులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
సీహెచ్‌డీతో ఒప్పందం..
బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సీహెచ్‌డీ బయోసైన్సెస్‌తో డాక్టర్ రెడ్డీస్ గ్లోబల్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. సర్జరీతో ముడిపడి ఉన్న ఇన్‌ఫెక్షన్ల నివారణ కోసం రెడ్డీస్ అభివృద్ధి చేస్తున్న ఔషధం తదుపరి పరీక్షలు, మార్కెటింగ్ బాధ్యతలను సీహెచ్‌డీ చేపడుతుంది. ఒప్పందం ప్రకారం 18 నెలల్లో సీహెచ్‌డీ ద్వారా ఈక్విటీ లేదా నగదు రూపంలో సుమారు రూ.194 కోట్లు రెడ్డీస్‌కు లభిస్తాయి. అలాగే యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఔషధానికి అనుమతి రాగానే మైల్‌స్టోన్ మొత్తం కింద రూ.259 కోట్లతోపాటు అమ్మకాలపై రాయల్టీ సైతం వస్తాయి.