సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీవశాస్త్ర, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిని వంద బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఈ స్వప్నం సాకారమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ గతేడాది ఈ రెండు రంగాల్లో దాదాపు రూ.3,700 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో బయో ఆసియా–2021 సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారు కావడం చాలా గర్వకారణమని చెప్పారు. కోవిడ్ కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు సంస్థలు, శాస్త్రవేత్తలు నిరుపమానమైన సేవలు అందించారని, ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు.
కోవాగ్జిన్ తయారీలో భారత్ బయోటెక్ విజయం సాధించగా బయోలాజికల్–ఈ, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ కూడా తమ వంతు పాత్ర పోషించాయని, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ సంస్థలు రష్యా టీకా స్పుత్నిక్–వీ తయారీ చేపట్టి కొరతను నివారించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. అరబిందో ఫార్మా కూడా ఏడాదికి 45 కోట్ల టీకాలు తయారీ సామర్థ్యంతో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన తొలి భారతీయ కేన్సర్ మందు ఉమ్రాలిసిబ్ కూడా హైదరాబాద్‌లోనే తయారైందని గుర్తుచేశారు. జీనోమ్ వ్యాలీలో ఏడాది కాలంలో పలు దేశీ, విదేశీ కంపెనీలు ఏర్పాటు కాగా, కొన్ని తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వివరించారు. ఫార్మాసిటీ ప్రారంభం త్వరలో ఉంటుందని, మెడికల్ డివైజెస్ పార్క్‌లోనూ ఈ ఏడాదిలోపు పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
భారత్ బయోటెక్‌కు అవార్డు
బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఈ ఏడాది భారత్ బయోటెక్‌కు దక్కింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌తో పాటు పలు ఇతర టీకాలను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో 65 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతుండటం గర్వకారణమని కృష్ణ ఎల్లా అన్నారు. అరబిందోతో పాటు పలు ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్ తయారీ రంగంలోకి ప్రవేశించడం వల్ల ఇకపై పోటీ మరింత ఆసక్తికరంగా మారనుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment