సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా పరిచయమైన వర్క్ ఫ్రం హోం పద్ధతి ఇకపై కూడా కొనసాగుతుందని, ఐటీ వంటి నాలెడ్జ్ వర్కర్లతో పాటు ఆరోగ్య రంగంలో పని చేసే వారికీ అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. అయితే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు వారి సంక్షేమానికి సంబంధించి మరిన్ని డిజిటల్ టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ తయారు చేసిన హాలోలెన్స్ వంటి పరికరాలతో వైద్యులు ఇంటి నుంచే రోగులను పరిశీలించి వైద్యం అందించే రోజులు రావాలని ఆకాంక్షించారు.
2రోజుల బయో ఆసియా సదస్సులో భాగంగా మంగళవారం జరిగిన ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సత్య నాదెళ్ల చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ –19 వల్ల భిన్న రంగాలు కలసి పనిచేసే అవకాశం వచ్చిందని కేటీఆర్ అడిగిన ఓ ప్రశ్నకు సత్య నాదెళ్ల సమాధానం ఇచ్చారు. వైద్య రంగంలో కృత్రిమ మేధతో పాటు పలు అత్యాధునిక టెక్నాలజీల వాడకానికి ఉన్న అవరోధాలను తొలగించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించే పద్ధతులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.
స్టార్టప్‌లు కీలకం..
‘కంప్యూటింగ్, బయాలజీ సమన్వయంతో పనిచేయడం మొదలైతే జీవశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయి. భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేసేందుకు ఓ కంపెనీ పనిచేస్తోంది. అపోలో ఆసుపత్రులు టెక్నాలజీ సాయంతో రోజంతా రోగులకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసింది. అతి తక్కువ ఖర్చుతో వైద్య సలహాలను అందించేందుకు మైక్రోసాఫ్ట్ పనిచేస్తోంది. పేషెంట్ కేర్, మందులు కనుగొనడంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి’అని సత్య నాదెళ్ల వివరించారు.
పన్ను రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్
భారత్ సృజనాత్మక శక్తిగా ఎదిగేందుకు కేంద్రం తగిన విధానాలు రూపొందించాల్సిన అవసరముందని కేటీఆర్ పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సులో భాగంగా నిర్వహించిన సీఈవో కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉత్పాదకతకు, పరిశోధనలపై పెట్టిన ఖర్చులకు కేంద్రం లింకు పెట్టడం ద్వారా కొన్ని రకాల పన్ను రాయితీలను తొలగించిందని, దీని ప్రభావం ఆత్మనిర్భర భారత్‌పై పడుతుందని పేర్కొన్నారు. ఫార్మా రంగంలో మందుల తయారీలో కీలకమైన మాలిక్యుల్స్ ఆవిష్కరణలో వెనుకబడిపోయామని పేర్కొన్నారు.
దుర్వినియోగం అవుతున్నందుకే..
కేటీఆర్ అభిప్రాయాలపై నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పందిస్తూ.. పన్ను సబ్సిడీలు దుర్వినియోగమైన కారణంగానే వాటిని ఉత్పాదకతతో ముడిపెట్టాల్సి వచ్చిందని, కేంద్రం ఇప్పటికే తన వంతు కృషి చేసిందని, ఇకపై పరిశోధనలపై పారిశ్రామిక రంగం మరిన్ని నిధులు వెచ్చించాలని సూచించారు. ఫార్మా రంగం నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని బయోకాన్ అధ్యక్షురాలు కిరణ్ మజుందార్ షా సూచించారు. అంతర్జాతీయ పేటెంట్లను పొందేందుకు కంపెనీలు పెడుతున్న ఖర్చును ఆర్ అండ్ డీ ఖర్చులుగా పరిగణించట్లేదని, సృజనాత్మకతను పెంచాలంటే పన్ను రాయితీలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment