సాక్షి, హైదరాబాద్: మనిషికి వచ్చే అనేక రకాల వ్యాధులను మందులతో కాకుండా.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయంతోనే చికిత్స చేసే కాలం దగ్గర్లోనే ఉందంటున్నారు డాక్టర్ కార్ల్ జూన్. కేన్సర్ చికిత్స ఇమ్యూనోథెరపీకి ఆద్యుడు.. రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలను కేన్సర్ వ్యాధిపై పోరాటానికి సిద్ధం చేసిన వ్యక్తి కార్ల్ జూన్.. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న ఆయ నను ‘సాక్షి’ మంగళవారం పలకరించింది. కార్–టి కణచికిత్స ఆలోచనకు దారితీన పరిస్థితులు, పురోగతి.. తదితర అంశాలపై ఆయనతో జరిగిన సంభాషణ ఇలా ఉంది..
ప్రశ్న: రోగ నిరోధక వ్యవస్థ కణాలనే కేన్సర్‌కు వ్యతిరేకంగా వాడొచ్చన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది?
జవాబు: రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలను కేన్సర్‌కు వ్యతిరేకంగా వాడటమే తొలి కణాధారిత చికిత్స కాదు. ఎముక మజ్జను మార్పిడి చేయడం కూడా ఆ కోవకు చెందిన చికిత్సే. 1980లలో నేను ఈ రంగంలో పనిచేసే వాడిని. రోగికి సంబంధం లేని వ్యక్తి ఎముక మజ్జను వాడినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించాం. దీనికి కారణమేంటన్నది అన్వేషించినప్పుడు టి–కణాల గురించి తెలి సింది. ఆ పరిశోధనల ఆధారంగా కార్–టి సెల్ థెరపీకి సంబంధించిన ఆలోచన వచ్చింది. టి– కణాల్లో మార్పుల ద్వారా మజ్జ మార్పిడి ప్రక్రియ లేకుండానే కేన్సర్‌కు చికిత్స అందించొచ్చన్న ఆలోచనతో దీన్ని మొదలుపెట్టాం.
ప్ర: వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌లను చంపేయడమే ఇప్పటివరకు పలు వ్యాధుల చికిత్సకు వాడుతున్న పద్ధతి. ఇలా కాకుండా శరీర వ్యవస్థలను బలోపేతం చేయడం వ్యాధులను నియంత్రించడం సాధ్యమేనా?
జ: రోగ నిరోధక వ్యవస్థలో రకరకాల కణాలు ఉన్నాయి. కొన్ని బ్యాక్టీరియాలను నాశనం చేసేందుకు ఉపయోగపడితే టి–కణాల్లాంటివి వైరస్‌లను మట్టుబెట్టేందుకే పరిణమించాయి. బీ–కణాలు తయారుచేసే యాంటీబాడీలు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు అతుక్కుపోవడం ద్వారా అవి నాశనమయ్యేందుకు తోడ్పడతాయి. ఈ ప్రాథమిక ధర్మాల ఆధారంగా భవిష్యత్తులో ఎయిడ్స్ లాంటి వ్యాధులకూ చికిత్స చేయొచ్చు. మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల చికిత్సకూ కణాధారిత చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.
ప్ర: కరోనా వైరస్‌కు విరుగుడుగా టీ– కణాలను వాడొచ్చా?
జ: వాడొచ్చు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణకు ఒక వ్యాక్సిన్ పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్–టి వంటి కణాధారిత చికిత్సల అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటికే కోవిడ్–19 బారిన పడి స్వస్థత చేకూరిన వారి రక్తంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మెండుగా ఉంటాయి. ఇలాంటి వారి నుంచి సేకరించిన సీరమ్‌ను ఎక్కించడం ద్వారా ఇతరులకు సోకకుండా చేయొచ్చు.
ప్ర: ప్రస్తుతం మీరు ఏ అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు?
జ: కార్–టి చికిత్స విధానానికి జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్‌ను జోడించేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఇది కేన్సర్ కణితులపై మంచి ఫలితం చూపిస్తుందని అంచనా.
ప్ర: కార్–టి పద్ధతి అన్ని విధాలుగా మెరుగైన కేన్సర్ చికిత్సేనా?
జ: అమెరికాలో ఈ పద్ధతి ఇప్పటికే చాలా మంది ల్యూకేమియా, లింఫోమా రోగులకు చికిత్స కల్పించింది. త్వరలోనే ఎముక మజ్జకు వచ్చే మైలోమా రకం కేన్సర్‌కు కూడా ఎఫ్‌డీఏ అనుమతులు రానున్నాయి. మైలోమా చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీని వల్ల రెండు మూడేళ్లు మాత్రమే బతుకుతారనే వారు పదేళ్ల వరకూ మనుగడ సాగించవచ్చు. కేన్సర్ చికిత్సకు మరికొన్ని మార్గాలున్నాయి. కణాల మధ్య సమాచార ప్రసారానికి ఉపయోగపడే ఎగ్జోజోమ్స్. వీటిని ఎలా తయారు చేస్తారన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. వేర్వేరు రకాల చికిత్స పద్ధతులను కార్–టి చికిత్స విధానంతో కలిపి వాడే అవకాశాలున్నాయి.
ప్ర: కార్–టి కణాల చికిత్సను భారత్‌లో విస్తృతంగా ఉపయోగించాలంటే ఏం చేయాలి?
జ: కార్–టి కణాల తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటివరకు టి–కణాలను పరిశోధన సంస్థల్లోనే తయారు చేస్తున్నారు. నోవర్టిస్ లాంటి సంస్థ వాణిజ్య స్థాయి ఉత్పత్తి మొదలుపెట్టినా అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది.
ప్ర: భారత ప్రభుత్వంతో కలసి పనిచేసే అవకాశం ఉందా?
జ: కచ్చితంగా.. కార్–టి చికిత్స విధానంపై ప్రభుత్వం తయారు చేసిన మార్గదర్శకాలను పరిశీలించి తగిన సలహా సూచనలు ఇవ్వాలన్నది ఆలోచన. బయోకాన్ కంపెనీతో పాటు, కేన్సర్ నిపుణులు సిద్ధార్థ ముఖర్జీ వంటి వారితో కలసి కంపెనీ పెట్టే ఆలోచన కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment