కరోనాకు ‘కత్తెర’ పడినట్టే!.. సరికొత్త చికిత్స అందుబాటులోకి | Scientists Use Gene Editing Technology To Block COVID-19 Transmission | Sakshi
Sakshi News home page

కరోనాకు ‘కత్తెర’ పడినట్టే!.. సరికొత్త చికిత్స అందుబాటులోకి

Published Sun, Jul 18 2021 4:22 AM | Last Updated on Sun, Jul 18 2021 8:07 AM

Scientists Use Gene Editing Technology To Block COVID-19 Transmission - Sakshi

ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిని గడగడలాడిస్తున్న కరోనాకు ‘కత్తెర’ పడే టైం వచ్చేస్తోంది. కరోనా ఎన్ని కొత్త రూపాంతరాలు మార్చుకున్నా.. ఎన్నిమార్పులు చేసుకున్నా దొరకబుచ్చుకుని అంతం చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి రానుంది. అత్యంత ఆధునికమైన జన్యు ఎడిటింగ్‌ టెక్నాలజీతో కోవిడ్‌కు చెక్‌పెట్టే దిశగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్క కరోనా అనే గాకుండా చాలా రకాల వైరస్‌లను ఈ విధానంలో నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఈ పరిశోధన వివరాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

రూపు మార్చుకుంటూ.. భయపెడుతూ.. 
కరోనా వ్యాప్తి మొదలై ఏడాదిన్నర దాటింది. ఇప్పటికే రెండు వేవ్‌లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఇబ్బందిపెట్టి.. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటూ పంజా విసురుతోంది. శాస్త్రవేత్తలు పగలూరాత్రీ కష్టపడి వ్యాక్సిన్లను అభివృద్ధి చేసినా.. వాటి ప్రభావం నుంచి, మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా కేసులు,మరణాలు పెరుగుతుండటంతో అలజడి మొదలైంది.కరోనాను పూర్తిస్థాయిలో ని ర్మూలించే చికిత్సలపై అందరిదృష్టిపడింది.ఈ క్ర మంలోనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ యూనివర్సి టీ ఇన్‌ఫెక్షన్‌ అండ్‌ ఇమ్యూనిటీ ఇన్‌స్టిట్యూట్, పీటర్‌ మెకల్లమ్‌ కేన్సర్‌సెంటర్‌ శాస్త్రవేత్తలు ‘క్రిస్పర్‌ క్యాస్‌’ సాంకేతికతతో కోవిడ్‌కు చెక్‌పెట్టే పరిశోధన చేపట్టారు. 

కరోనా మూలంపైనే టార్గెట్‌.. 
కోవిడ్‌ వైరస్‌లో అంతర్గతంగా జన్యు పదార్థం ఉండి.. దానిచుట్టూ కొన్ని ప్రొటీన్లు, ఆపై కొవ్వు పదార్థంతో కూడిన పొర, దానిపై స్పైక్‌ ప్రొటీన్లు ఉంటాయి. కరోనా వ్యాక్సిన్లుగానీ, ప్రస్తుతం చికిత్సలో వాడుతున్న యాంటీవైరల్‌ మందులుగానీ.. వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్, మరికొన్ని ఇతర ప్రొటీన్లను టార్గెట్‌ చేస్తాయి. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ కూడా వీటినే లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే కరోనా వైరస్‌.. ఈ ప్రొటీన్లలో మార్పులు చేసుకుని, కొత్త వేరియంట్లుగా మారుతుండటంతో.. వ్యాక్సిన్లకు, మందులకు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే వైరస్‌లో మార్పు చెందకుండా ఉండే జన్యు పదార్థంపై నేరుగా దాడి చేసే చికిత్సపై మెల్‌బోర్న్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.

ఏమిటీ ‘క్రిస్పర్‌ క్యాస్‌’?
భూమ్మీద జీవులన్నింటికీ మూలాధారం జన్యువులే. ఒక రకంగా చెప్పాలంటే.. మనకు మెదడు ఎలాంటిదో, ప్రతి కణానికి డీఎన్‌ఏ పదార్థం అలాంటిది. ఆ కణం ఏమిటి? దాని విధులు ఏమిటి? కణంలోని భాగాలు ఏయే పనులు చేయాలి? ఏం ఉత్పత్తి చేయాలి? ఎలా వ్యవహరించాలి అన్నది జన్యువులే చూసుకుంటాయి. బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవులు మొదలుకుని చెట్లు, జంతువులు, మనుషులు సహా అన్నిజీవుల కణాల్లో ఈ డీఎన్‌ఏ ఉంటుంది. ఇలాంటి జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేయడం ద్వారా కణాల విధులు, లక్షణాల్లో మార్పులు తేవొచ్చు. ఇందుకు తోడ్పడే అత్యాధునిక సాంకేతికతనే ‘క్రిస్పర్‌ క్యాస్‌’. ఇందులో క్రిస్పర్‌ అనే వ్యవస్థ ద్వారా ‘క్యాస్‌–9’ అనే ఎంజైమ్‌ ఎంజైమ్‌ను ఉపయోగించి.. డీఎన్‌ఏను కత్తిరించడం, అందులోని ఏదైనా భాగాన్ని తొలగించడం, మరేదైనా భాగాన్ని కలపడం చేస్తారు. ఈ ‘క్రిస్పర్‌ క్యాస్‌9’ విధానాన్ని అభివృద్ధి చేసిన ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు.. మ్యాక్స్‌ప్లాంక్‌ యూనిట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన ఎమ్మాన్యుయెల్‌ చార్పింటర్, కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్‌ జెన్నిఫర్‌ దౌడ్నాలకు 2020 రసాయన శాస్త్ర నోబెల్‌ రావడం గమనార్హం. 

కరోనా జన్యు పదార్థాన్ని ముక్కలు చేసేలా..
జీవుల్లో జన్యుపదార్థం ‘డీఎన్‌ఏ’ రూపంలో ఉంటుంది. వైరస్‌లు పూర్తిస్థాయి జీవులు కాదు. వాటిలో ‘ఆర్‌ఎన్‌ఏ’ రూపంలో ఉంటుంది. క్యాస్‌9 ఎంజైమ్‌లు డీఎన్‌ఏను మాత్రమే కత్తిరిస్తాయి. దీంతో మెల్‌బోర్న్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆర్‌ఎన్‌ఏను కత్తిరించగలిగే.. ‘క్యాస్‌13బీ’ ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లో కరోనాపై ప్రయోగించి చూశారు. 
‘‘ఈ ప్రయోగంలో కరోనా వైరస్‌ను గుర్తించిన ‘క్యాస్‌13బీ’ ఎంజైమ్‌.. దాని ఆర్‌ఎన్‌ఏకు అతుక్కుని, వైరస్‌ పునరుత్పత్తికి తోడ్పడే భాగాలను కత్తిరించేసింది. వేర్వేరు కరోనా వేరియంట్లపైనా ప్రభావవంతంగా పనిచేసింది’’ అని పరిశోధనకు నేతృ త్వం వహించిన శాస్త్రవేత్త షరోన్‌ లెవిన్‌ తెలిపారు.  

వ్యాక్సిన్‌ కాదు.. చికిత్స.. 
కరోనాకు మ్యూటేషన్‌ చెందే సామర్థ్యం ఎక్కువని, భవిష్యత్తులో వ్యాక్సిన్ల ప్రభావం తగ్గిపోతుందని షరోన్‌ లెవిన్‌ అభిప్రాయపడ్డారు. అందువల్ల కరో నా సోకిన తర్వాత అందించే చికిత్స కీలకమన్నారు. ప్రస్తుతం తాము రూపొందించినది ఒక రకంగా యాంటీ వైరల్‌ చికిత్స అని తెలిపారు. దీన్ని జంతువులపై ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. తర్వాత మానవ ప్రయోగాలు చేపడతామన్నారు. 
క్రిస్పర్‌ క్యాస్‌ విధానం ద్వారా ఒక్క కరోనా మా త్రమేగాకుండా చాలా రకాల వైరస్‌లకు చెక్‌పెట్టవచ్చని షరోన్‌ తెలిపారు. ఇప్పటికే కేన్సర్, హెచ్‌ఐవీలను ఈ విధానంలో నియంత్రించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయని వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement