Pregnant woman in Israel was found to be infected with ‘florona’: ఓ వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్‌లో మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపుతోంది. అక్కడ తొలి ‘ఫ్లొరోనా’ కేసు నమోదయ్యినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం మీడియాకు వెల్లడించింది. ఓ గర్భిణీ స్త్రీలో మొదటి కేసు వెలుగు చూసినట్లు తెలిపింది. ఐతే ఆమె ఇంతవరకూ వ్యాక్సిన్ వేయించుకోలేదని స్పష్టం చేసింది.
ఇది కొత్త రకం వెరియంట్ కాదని, ఒకే సమయంలో ఫ్లూ, కోవిడ్‌లకు చెందిన రెండు రకాల వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించడం వల్ల రోగనిరోధకత వ్యవస్థ విచ్ఛిన్నమై ఫొరోనా సోకి ఉండవచ్చని ఇజ్రాయెల్ వైద్యులు తెలిపారు. అంతేకాకుండా గత కొన్ని వారాలుగా దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో అది ఉద్భవించి ఉండవచ్చని పేర్కొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కొత్త వ్యాధి వ్యాప్తి కట్టడికి పూనుకుంది.
ఇమ్యునిటీ వ్యవస్థను బలపరిచేందుకు శుక్రవారం నుంచే కోవిడ్ 19 నాలుగో డోస్ వ్యాక్సిన్లు వేయడం ప్రారంభించింది. అలాగే అనారోగ్యంతో ఉన్న వృద్ధులకు కూడా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతించింది. ఇక మూడో డోస్ వేసి 4 నెలలు గడుస్తున్న కారణంగా రోగనిరోధకత తగ్గిన వ్యక్తుల కోసం బూస్టర్ డోస్‌లు వేసున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ నాచ్‌మన్ యాష్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్ దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అక్కడి వైద్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఒక్క గురువారం నాడే 5000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏమిటీ ఫ్లొరోనా?
ఫ్లొరోనా అనేది కోవిడ్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లు ఒకే సమయంలో శరీరంలో ప్రవేశించడం వల్ల ఏర్పడిన డబుల్ ఇన్ఫెక్షన్.
ఫ్లొరోనా వ్యాధి లక్షణాలివే..
ఫ్లొరోనా వ్యాధి తాలూకు లక్షణాలు కొంత ప్రమాదకరస్థాయిలో ఉన్నట్లు డేటా తెలుపుతోంది. ఐతే కోవిడ్-19 లక్షణాలతోపాటు గుండె కండరాలలో నొప్పి/మంట వంటి అదనపు లక్షణాలు కనిపిస్తాయి. అలాగే న్యుమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలతోపాటు, మయోకార్డిటిస్‌కు కూడా దారితీయవచ్చు. సరైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోకపోతే రోగి మృతి చెందే ప్రమాదం కూడా ఉంది.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
వ్యాధి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌తో పాటు ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ సిఫార్సు చేస్తోంది.
ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో రోగనిరోధకత పాత్ర ఏమిటి?
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటే ఫ్లొరోనా ఇన్ఫెక్షన్ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇమ్యునిటీని పెంపొందించుకునేందుకు బూస్టర్ డోసులు వేసుకోవడంతోపాటు, ఇతర జాగ్రత్తలు కూడా విధిగా పాటించాలని సూచిస్తున్నారు.
చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’
Comments
Please login to add a commentAdd a comment