DNA And COVID-19: Research Says Covid Symptoms May Effects On DNA, Check Details - Sakshi
Sakshi News home page

Research: కోవిడ్‌ తీవ్రతకు ఆ డీఎన్‌ఏకు లంకె!

Published Sat, Jun 12 2021 6:59 AM | Last Updated on Sat, Jun 12 2021 4:10 PM

Scientific Research Journal Says Covid Symptoms May Effects On DNA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా బారినపడిన కొందరిలో తీవ్రమైన లక్షణాలు కన్పిస్తున్నాయి ఎందుకు? ఈ ప్రశ్నకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సమాధానం కనుగొంది. యూరోపియన్లపై జరిగిన ఓ పరిశోధనలో డీఎన్‌ఏలోని ఒక భాగానికి, కోవిడ్‌ తీవ్రతకు, ఆస్పత్రిలో గడిపే అవసరానికి సంబంధం ఉందని తేలింది. ఈ డీఎన్‌ఏ భాగం 50 శాతం మంది దక్షిణాసియావాసుల్లో ఉండగా.. 16 శాతం మంది యూరోపియన్లలో ఉంది.

ఈ డీఎన్‌ఏ భాగం కోవిడ్‌–19 బాధితులపై చూపుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌ డాక్టర్‌ తంగరాజ్, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబేతో కూడిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు నిర్వహించింది. యూరోపియన్లలో తీవ్రస్థాయి లక్షణాలకు కారణమవుతున్న కోవిడ్‌–19 రూపాంతరితాల ప్రభావం దక్షిణాసియావాసులపై పెద్దగా లేనట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ‘యూరోపియన్లు, దక్షిణాసియా జన్యు సమాచారం ఆధారంగా ఇరువర్గాల్లోని ఇన్‌ఫెక్షన్, మరణాల రేటును పోల్చి చూశాం. కరోనా ప్రబలిన కాలంలో మూడుసార్లు ఈ పరిశీలన జరిగింది. భారత్, బంగ్లాదేశ్‌లోని వారిపై ఎక్కువగా దృష్టి సారించాం’అని డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు.

దక్షిణాసియా ప్రజల జన్యుమూలాలు ప్రత్యేకమైనవని ఈ అధ్యయనం మరోసారి రుజువు చేసిందని, దక్షిణాసియా జనాభా మొత్తానికి, కోవిడ్‌కు ఉన్న లింకులపై జన్యుక్రమం స్థాయిలో విస్తృత పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనానికి తొలి రచయితగా ఉన్న ప్రజీవల్‌ ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. 

బంగ్లాదేశ్‌లో భిన్న ప్రభావాలు.. 
బంగ్లాదేశ్‌లో కరోనా వైరస్‌ గిరిజన తెగలపై ఒక రకమైన ప్రభావం చూపితే కొన్ని కులాల ప్రజలపై ఇంకో రకమైన ప్రభావం చూపిందని తమ అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జార్జ్‌ వాన్‌ డ్రీమ్‌ తెలిపారు. జన్యుక్రమం మొదలుకొని రోగ నిరోధక వ్యవస్థ, జీవనశైలి వంటి అనేక అంశాలు కరోనా బారినపడే అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు ఇటీవల సేకరించిన సమాచారం చెబుతోందని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ నందికూరి వినయ్‌ తెలిపారు.
చదవండి: అమెరికాకు వచ్చే విద్యార్థులకు కరోనా నెగెటివ్‌ రిపోర్ట్‌ మస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement