స్త్రీ శక్తికి కరోనా సలామ్‌..! | Major differences found in immune systems of men and women in Covid response | Sakshi
Sakshi News home page

స్త్రీ శక్తికి కరోనా సలామ్‌..!

Published Mon, Jul 12 2021 5:03 AM | Last Updated on Mon, Jul 12 2021 5:03 AM

Major differences found in immune systems of men and women in Covid response - Sakshi

స్త్రీ శక్తి స్వరూపిణి.. ఆడది అబల కాదు సబల.. అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటలను నిజం చేస్తున్నాయి తాజా   పరిశోధనలు. రోగాల బారిన పడిన సందర్భాల్లో మగవారి కన్నా ఆడవారిలో అధిక రోగ నిరోధకత కనిపిస్తుందని పలు అధ్యయనాలు ప్రకటించాయి. తాజాగా కరోనా సైతం మహిళల్లో ఎక్కువ ప్రభావం చూపలేదని, మగవారిపై మాత్రం విరుచుకుపడుతోందని అమెరికాలోని యేల్‌ యూనివర్సిటీ
ఆధ్వర్యంలో జరిగిన పరిశోధన చెబుతోంది. ఈ వివరాలను సైన్స్‌ సిగ్నలింగ్‌ జర్నల్‌లో ప్రచురించారు.

లండన్‌:  కరోనా వైరస్‌ సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు ఆడవారిలో, మగవారిలో వేర్వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా సోకిన ఆడవారి కన్నా మగవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, చనిపోయే అవకాశం కూడా మగవారిలో అధికమని అధ్యయనం వెల్లడించింది. ఇమ్యూన్‌ రెస్పాన్స్‌కు సంబంధించిన ఒక మెటబాలిక్‌ పాత్‌వే మగవారిలో మాత్రమే కనిపించిందని తెలిపింది. కోవిడ్‌ పేషెంట్లలో ఆడవారితో పోలిస్తే మగవారిలో కైనూరెనిక్‌ యాసిడ్‌ స్థాయిలు అధికంగా ఉన్నట్లు పరిశోధన పేర్కొంది. ఈ యాసిడ్‌ ఎల్‌– ట్రిప్టోపాన్‌ అనే అమైనో ఆమ్ల జీవక్రియ(మెటబాలిజం)లో ఉత్పత్తి అయ్యే ఒక మెటబొలైట్‌(మెటబాలిజంలో ఉత్పన్నమయ్యే పదార్థం). నియాసిన్‌ అనే న్యూట్రియంట్‌ తయారవడంలో ఈ యాసిడ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ యాసిడ్‌ స్థాయిలు అధికంగా ఉంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు.   ‘‘ఒక వ్యాధి సోకినప్పుడు శరీరంలో జరిగే బయోకెమికల్‌ మార్పులను అవగాహన చేసుకోవడం అవసరం. అప్పుడే సదరు వ్యాధికి కచ్చితమైన ఔషధాన్ని తయారు చేయగల మార్గాన్ని చేరగలం’’ అని పరిశోధకుల్లో ఒకరైన నికోలస్‌ రాట్రే చెప్పారు. తమ పరిశోధనను మరింత విస్తృతీకరించడం ద్వారా ఒక్కో మనిషి ఇమ్యూన్‌ వ్యవస్థను అర్ధవంతంగా విశ్లేషించవచ్చన్నారు. ఈ అధ్యయనం కోసం 22 మంది ఆడ, 17మంది మగ కోవిడ్‌ బాధితుల నుంచి రక్త నమూనాలు తీసుకున్నారు. అనంతరం 20 మంది వ్యాధి సోకనివారి నమూనాలతో వీటిని పోల్చి అధ్యయనం చేశారు. సుమారు 75 మెటబొలైట్స్‌ను సైంటిస్టులు ఈ పరిశోధనలో గమనించారు. వీటిలో 17 మెటబొలైట్స్‌ కరోనా వ్యాధితో సంబంధం కలిగిఉన్నట్లు, వీటిలో కైనూరెనిక్‌ యాసిడ్‌ స్థాయిలు మగ పేషెంట్లలో అధికంగా ఉండటాన్ని గుర్తించారు.

ఆడవారిలోనే టీ సెల్స్‌ అధికం
కోవిడ్‌ వచ్చిన మగ పేషెంట్లతో పోలిస్తే ఆడ పేషంట్లలో టీ సెల్‌ యాక్టివేషన్‌ అధికమని యేల్‌ యూనివర్సిటీ పరిశోధన నిరూపించింది. మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఈ టీసెల్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. బీ సెల్స్‌ లాగా ఇవి యాంటీబాడీలను ఉత్పత్తి చేయవు కానీ, నేరుగా హోస్ట్‌ కణాలను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో ఇతర ఇమ్యూనిటీ కణాలను యాక్టివేట్‌ చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ మగ కోవిడ్‌ పేషంట్లలో ఈ టీసెల్‌ రెస్పాన్స్‌ క్షీణిస్తోందని, కానీ ఆడ పేషెంట్లలో వయసుతో సంబంధం లేకుండా టీసెల్‌ యాక్టివిటీ ఉందని అధ్యయనం తెలిపింది.

పరిశోధన కోసం 98 మంది ఆడ, మగ పేషెంట్ల నుంచి శాంపిల్స్‌ సేకరించారు. వ్యాధి ముదిరేకొద్దీ సైటోకైన్స్‌ పెరగడంతో సైటోకైన్‌ స్ట్రోమ్‌ అనే అవలక్షణం మగ పేషెంట్లలో మొదలైందని,దీంతో ఊపిరితిత్తుల్లో ద్రవాలు పెరగడం, ఆక్సీజన్‌ స్థాయిలు తగ్గడం, అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చాయన్నారు. ఆడ పేషెంట్లలో అధికంగా టీసెల్స్‌ పెరిగాయన్నారు. మగవారిలో టీసెల్స్‌ తక్కువగా విడుదల కావడంతో వారిలో వ్యాధి మరింత ముదిరిందని, ఆడవారిలో టీసెల్స్‌ యాక్టివిటీ పెరగడంతో వ్యాధి ముదరడం మందగించిందని గుర్తించారు.

ఇమ్యూనిటీ రెస్పాన్స్‌ ఎక్కువ
మానవ ఆవిర్భావం నుంచి పురుషుల్లో కన్నా మహిళల్లో వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులను ఎదుర్కొనే ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ ఎక్కువని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇందుకు కారణం ఎక్స్‌ క్రోమోజోములని గుర్తించారు. స్త్రీలలో ఎక్స్‌ ఎక్స్‌ అని రెండు క్రోమోజోములంటాయని, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్‌ ఉంటుందని తెలిసిందే! ఆడవారిలో ఉండే డబుల్‌ ఎక్స్‌ క్రోమోజోమ్‌ వారిలో బలమైన ఇమ్యూన్‌ రెస్పాన్స్‌కు కారణమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

దీనికితోడు ఆడవారిలో విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్‌ అనే హార్మోన్లు ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ప్రోత్సహిస్తాయని గమనించారు. ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఫ్లూ వైరస్‌కు గురైన మహిళల్లో మగవారి కన్నా రెండింతల యాంటీబాడీలు విడుదలవడం సైతం గుర్తించారు. మహిళల్లో రోగనిరోధకత అధికంగా ఉండడం మంచిదే కానీ కొన్ని కేసుల్లో ఈ ఓవర్‌ ఇమ్యూనిటీ వల్ల కొందరు ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల బారిన పడే ప్రమాదాలున్నాయని సైంటిస్టులు వివరించారు. అందువల్లే ప్రపంచంలో మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా ఇలాంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధుల బారిన పడుతుంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement