Metabolism
-
మీ డైట్లో ఇవి చేర్చుకుంటే నాజుగ్గా కనిపించొచ్చు
బరువు పెరగడం అనేది చాలా సాధారణ విషయం. మారుతున్న జీవనశైలిలో బరువు తగ్గడం అనేది సవాలుగా మారింది. చాలామంది మహిళలు 35-40 దాటాక వేగంగా బరువు పెరుగుతారని పలు పరిశోధనల్లో వెల్లడైంది.దీనికి అనేక కారణాలు ఉంటాయి. మరి బరువును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఫిట్‌గా, నాజుగ్గా కనిపించాలంటే ఎలాంటి డైట్ పాటించాలన్నది ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలంటే ముఖ్యంగా తినే తిండిపై దృష్టి పెట్టాలి. అనారోగ్యమైన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినిడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. దీంతో పాటు జీవక్రియ రేటు కూడా మందగిస్తుంది.అందుకే మీ డైట్లో కొన్ని ఆహారాలు చేర్చుకోగలిగితే 40లోనూ పాతికేళ్ల అమ్మాయిలా కనిపించొచ్చు. దీనికోసం ప్రతిరోజూ మీ ఆహారంలో ఆకుకూరలు, సాల్మన్ చేపలు, బెర్రీలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలని న్యూట్రీషనిస్ట్ కేథరీన్ గెర్వాసియో తెలిపారు. చాలామంది మహిళలు పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక సమస్యల కారణంగా బరువు పెరుగుతారు. హార్మోన్ల అసమతుల్యత కూడా ఇందుకు కారణం. ఓ అధ్యయనం ప్రకారం.. 44 ఏళ్లు దాటాక ప్రతి మహిళ ఏడాదికి అరకిలో బరవు పెరుగుతుందట. అందుకే మోనోపాజ్ దాటాక పక్కా డైట్ ప్లాన్ పాటించాలి. ఆకుకూరలు బరువు తగ్గాలనుకునేవారికి ఆకుకూరలు బెస్ట్ ఛాయిస్. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ అంటారు. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అవడంతో పాటు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఆకుకూరల్లో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్స్, కాల్షియం, విటమిన్-కె మెండుగా ఉండటంతో పాటు కాలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే ప్రతిరోజూ మీ డైట్లో ఆకుకూరలను చేర్చుకోవాలి. అంతేకాకుండా ఎముకల దృడత్వానికి అవసరమైన విటమిన్-కె కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. బెర్రీలు బెర్రీలు చూడటానికి చిన్నగా కనిపించినా ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. ఇందులో బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్, రాస్ బెర్రీస్ వంటి పలు రకాలు ఉంటాయి. బెర్రీల్లో గ్లూకోజ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. చేపలు సాల్మన్ చేపల్లో ప్రొటీన్, కొవ్వు, విటమిన్ బి12, బి6, సెలీనియం, నైసిన్, ఫాస్పరస్, థైయామిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు సాల్మన్ చేపల్లో ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. వ్యాయామం బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేయడం మంచిది. చాలామంది కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసి తర్వాత మానేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మరింత బరువు కంట్రోల్లో ఉండదు. అలాగని అతిగా వ్యాయామం చేసినా మొదటికే మోసం వస్తుంది. అందుకే శరీరానికి ఎంత అవసరమో, అంత మేరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. -
బద్దకం వదలండి.. కేన్సర్‌నూ చంపేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: మీరు తరచూ వ్యాయామం చేస్తే జీర్ణ సమస్యలతో పాటు గుండె జబ్బులు దరి చేరవని మనకు తెలుసు. అయితే ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాలు.. ఇంతకంటే సూక్ష్మస్థాయిలో శరీరంలో జరిగే మార్పులను, వాటి ప్రభావాన్ని అంచనా వేశాయి. వీటన్నింటి ఆధారంగా వ్యా యామం చాలా రకాలుగా మేలు అని చెప్పొచ్చు. బుద్ధి కుశలత.. రోజులు, నెలలు కాదు.. కనీసం ఒక్కరోజు వ్యాయామం చేసినా సరే.. ఒక రకమైన జన్యువు ఉత్తేజితం అవుతుందని, తద్వారా మెదడులోని నాడీ కణాల మధ్య సినాప్టిక్ సంబంధాలు మెరుగవుతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. జాగింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుందన్న భావనకు మూలం కూడా ఇదే. ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ ఈ అంశంపై పరిశోధనలు చేసింది. బాస్కెట్ బాల్ వంటి ఆటను ఎలుకలతో ఆడించి, గంట తర్వాత పరిశీలిస్తే వాటి మెదడులో జ్ఞాపకాలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడే మెదడులోని హిప్పోకాంపస్ భాగంలో సినాప్టిక్ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు తేలింది. అంటే దీన్నిబట్టి పరీక్షలున్న రోజు కాసింత వ్యాయామం చేసి వెళ్తే మరిన్ని ఎక్కువ మార్కులు కొట్టేయొచ్చు. మెదడులో పలు మార్పులు.. రెండు రకాల వ్యాయామాలు మన మెదడు పనితీరును మార్చేస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మారుతున్న పరిస్థితులకు మెరుగ్గా అలవాటు పడే లక్షణం (బ్రెయిన్ ఎలాస్టిసిటీ) మాత్రమే కాకుండా.. మతిమరుపును దూరం చేసుకునేందుకు, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాయామం ఉపయోగపడుతుంది. హై ఇంటెన్సిసిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హిట్) రకం వ్యాయామం (నిమిషం, 2 నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేసి.. కొంత విరామం ఇవ్వడం.. ఆ తర్వాత మళ్లీ తీవ్రస్థాయి వ్యాయామం చేయడం) వల్ల న్యూరాన్ల మధ్య బంధాలు బలపడతాయని సౌత్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనలు చెబుతున్నాయి. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సటర్ 2019లో సుమారు 2 లక్షల మందిపై నిర్వహించిన పరిశోధన ద్వారా మతిమరుపు, అల్జీమర్స్‌ను దూరం చేసుకునేందుకు వ్యాయామం, జీవనశైలి మార్పులు దోహదపడతాయని గుర్తించింది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో కనీసం 32 శాతం మంది మతిమరుపును నివారించగలిగారు. చిన్నతనంలో మంచిఆహారం తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ చేయడం వల్ల పెరిగి పెద్దయ్యాక మెదడు సైజు ఇతరుల కంటే ఎక్కువగా ఉండటంతో పాటు మానసిక ఒత్తిడిని మెరుగ్గా ఎదుర్కోగలరని కూడా తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దృష్టి లోపాల నివారణకూ.. వయసుతో పాటు కళ్ల సంబంధిత సమస్యలను వ్యాయామం ద్వారా కొంత నిరోధించొచ్చు. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలిపిన విషయం ఇది. రెండు గుంపుల ఎలుకలపై ప్రయోగాలు జరిపారు. ఒక గుంపు వ్యాయా మం చేయలేదు. రెండోదాన్ని వేగంగా తిరిగే చక్రాల్లో బంధించి అవి చక్రం వెంబడి పరిగెత్తేలా చేశారు. 4 వారాల తర్వాత రెండు గుంపుల ఎలుకల కళ్లపై లేజర్ కిరణాలు ప్రసరించపజేశారు. దీంతో వ్యాయామం చేసే గుం పులోని ఎలుకల కళ్లకు 45 శాతం వరకు తక్కువగా నష్టం జరిగిందని గుర్తించారు. దీన్నిబట్టి మనుషుల్లోనూ రోజూ కొద్దిపాటి వ్యాయామం చేయడం ద్వారా వయసుతో వచ్చే దృష్టి లోపాలను కొంతవరకు నివారించొచ్చని తేలింది. కేన్సర్‌ను చంపేయొచ్చు.. కొన్ని రకాల కేన్సర్లకు చెక్ పెట్టేందుకు వ్యాయామం ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. వ్యాయామం చేసే క్రమంలో కండరాలు రక్తంలోకి కొన్ని రకాల జీవ రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి కాస్తా రోగ నిరోధక వ్యవస్థలో కేన్సర్ కణాలను చంపేసే ‘టీ సెల్స్’పనితీరును మెరుగుపరుస్తాయని గతేడాది కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ (స్వీడన్) నిర్వహించిన ఈ పరిశోధనలో తేలింది. వ్యాయామం చేస్తున్న ఎలుకల నుంచి ఈ జీవ రసాయనాలను తీసి కేన్సర్ కణితులు ఉన్న ఎలుకలకు అందించినప్పుడు వాటి పరిమాణం తగ్గిందని తేలింది. -
స్త్రీ శక్తికి కరోనా సలామ్..!
స్త్రీ శక్తి స్వరూపిణి.. ఆడది అబల కాదు సబల.. అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాటలను నిజం చేస్తున్నాయి తాజా పరిశోధనలు. రోగాల బారిన పడిన సందర్భాల్లో మగవారి కన్నా ఆడవారిలో అధిక రోగ నిరోధకత కనిపిస్తుందని పలు అధ్యయనాలు ప్రకటించాయి. తాజాగా కరోనా సైతం మహిళల్లో ఎక్కువ ప్రభావం చూపలేదని, మగవారిపై మాత్రం విరుచుకుపడుతోందని అమెరికాలోని యేల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశోధన చెబుతోంది. ఈ వివరాలను సైన్స్ సిగ్నలింగ్ జర్నల్‌లో ప్రచురించారు. లండన్: కరోనా వైరస్ సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ స్పందించే తీరు ఆడవారిలో, మగవారిలో వేర్వేరుగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కరోనా సోకిన ఆడవారి కన్నా మగవారిలో లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, చనిపోయే అవకాశం కూడా మగవారిలో అధికమని అధ్యయనం వెల్లడించింది. ఇమ్యూన్ రెస్పాన్స్‌కు సంబంధించిన ఒక మెటబాలిక్ పాత్వే మగవారిలో మాత్రమే కనిపించిందని తెలిపింది. కోవిడ్ పేషెంట్లలో ఆడవారితో పోలిస్తే మగవారిలో కైనూరెనిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్నట్లు పరిశోధన పేర్కొంది. ఈ యాసిడ్ ఎల్– ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్ల జీవక్రియ(మెటబాలిజం)లో ఉత్పత్తి అయ్యే ఒక మెటబొలైట్(మెటబాలిజంలో ఉత్పన్నమయ్యే పదార్థం). నియాసిన్ అనే న్యూట్రియంట్ తయారవడంలో ఈ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారు. ‘‘ఒక వ్యాధి సోకినప్పుడు శరీరంలో జరిగే బయోకెమికల్ మార్పులను అవగాహన చేసుకోవడం అవసరం. అప్పుడే సదరు వ్యాధికి కచ్చితమైన ఔషధాన్ని తయారు చేయగల మార్గాన్ని చేరగలం’’ అని పరిశోధకుల్లో ఒకరైన నికోలస్ రాట్రే చెప్పారు. తమ పరిశోధనను మరింత విస్తృతీకరించడం ద్వారా ఒక్కో మనిషి ఇమ్యూన్ వ్యవస్థను అర్ధవంతంగా విశ్లేషించవచ్చన్నారు. ఈ అధ్యయనం కోసం 22 మంది ఆడ, 17మంది మగ కోవిడ్ బాధితుల నుంచి రక్త నమూనాలు తీసుకున్నారు. అనంతరం 20 మంది వ్యాధి సోకనివారి నమూనాలతో వీటిని పోల్చి అధ్యయనం చేశారు. సుమారు 75 మెటబొలైట్స్‌ను సైంటిస్టులు ఈ పరిశోధనలో గమనించారు. వీటిలో 17 మెటబొలైట్స్ కరోనా వ్యాధితో సంబంధం కలిగిఉన్నట్లు, వీటిలో కైనూరెనిక్ యాసిడ్ స్థాయిలు మగ పేషెంట్లలో అధికంగా ఉండటాన్ని గుర్తించారు. ఆడవారిలోనే టీ సెల్స్ అధికం కోవిడ్ వచ్చిన మగ పేషెంట్లతో పోలిస్తే ఆడ పేషంట్లలో టీ సెల్ యాక్టివేషన్ అధికమని యేల్ యూనివర్సిటీ పరిశోధన నిరూపించింది. మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఈ టీసెల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. బీ సెల్స్ లాగా ఇవి యాంటీబాడీలను ఉత్పత్తి చేయవు కానీ, నేరుగా హోస్ట్ కణాలను నాశనం చేస్తాయి. ఇదే సమయంలో ఇతర ఇమ్యూనిటీ కణాలను యాక్టివేట్ చేస్తాయి. వయసు పెరిగే కొద్దీ మగ కోవిడ్ పేషంట్లలో ఈ టీసెల్ రెస్పాన్స్ క్షీణిస్తోందని, కానీ ఆడ పేషెంట్లలో వయసుతో సంబంధం లేకుండా టీసెల్ యాక్టివిటీ ఉందని అధ్యయనం తెలిపింది. పరిశోధన కోసం 98 మంది ఆడ, మగ పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించారు. వ్యాధి ముదిరేకొద్దీ సైటోకైన్స్ పెరగడంతో సైటోకైన్ స్ట్రోమ్ అనే అవలక్షణం మగ పేషెంట్లలో మొదలైందని,దీంతో ఊపిరితిత్తుల్లో ద్రవాలు పెరగడం, ఆక్సీజన్ స్థాయిలు తగ్గడం, అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వచ్చాయన్నారు. ఆడ పేషెంట్లలో అధికంగా టీసెల్స్ పెరిగాయన్నారు. మగవారిలో టీసెల్స్ తక్కువగా విడుదల కావడంతో వారిలో వ్యాధి మరింత ముదిరిందని, ఆడవారిలో టీసెల్స్ యాక్టివిటీ పెరగడంతో వ్యాధి ముదరడం మందగించిందని గుర్తించారు. ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఎక్కువ మానవ ఆవిర్భావం నుంచి పురుషుల్లో కన్నా మహిళల్లో వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధులను ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువని అధ్యయనాలు వివరిస్తున్నాయి. ఇందుకు కారణం ఎక్స్ క్రోమోజోములని గుర్తించారు. స్త్రీలలో ఎక్స్ ఎక్స్ అని రెండు క్రోమోజోములంటాయని, మగవారిలో ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోమ్ ఉంటుందని తెలిసిందే! ఆడవారిలో ఉండే డబుల్ ఎక్స్ క్రోమోజోమ్ వారిలో బలమైన ఇమ్యూన్ రెస్పాన్స్‌కు కారణమని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఆడవారిలో విడుదలయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లు ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రోత్సహిస్తాయని గమనించారు. ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత ఫ్లూ వైరస్‌కు గురైన మహిళల్లో మగవారి కన్నా రెండింతల యాంటీబాడీలు విడుదలవడం సైతం గుర్తించారు. మహిళల్లో రోగనిరోధకత అధికంగా ఉండడం మంచిదే కానీ కొన్ని కేసుల్లో ఈ ఓవర్ ఇమ్యూనిటీ వల్ల కొందరు ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడే ప్రమాదాలున్నాయని సైంటిస్టులు వివరించారు. అందువల్లే ప్రపంచంలో మగవారి కన్నా ఆడవారు ఎక్కువగా ఇలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల బారిన పడుతుంటారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
సోరియాసిస్‌కు చికిత్స ఉందా?
నా వయసు 42 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ సమస్య. ఇది చర్మసమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది.సోరియాసిస్ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్ ఆర్థరైటిస్’ అంటారు. కారణాలు : ►వంశపారంపర్యం మానసిక ఒత్తిడి, ఆందోళన ►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత ►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం. లక్షణాలు: ►చర్మం ఎర్రబారడం ►తీవ్రమైన దురద ►జుట్టు రాలిపోవడం ►కీళ్లనొప్పులు ►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది. నిర్ధారణ పరీక్షలు: స్కిన్ బయాప్సీ, ఈఎస్ఆర్, సీబీపీ, ఎక్స్–రే పరీక్షలు. చికిత్స: సోరియాసిస్ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 45 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: ►సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ►ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ►అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు : ►తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ►చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ►మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ►ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మలవిసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతోపాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడిప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు: – దీర్ఘకాలిక మలబద్ధకం – ఎక్కువకాలం విరేచనాలు – వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం – ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం – మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట – చురుకుగా ఉండలేరు – చిరాకు, కోపం – విరేచనంలో రక్తం పడుతుంటుంది – కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచిచికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
చిన్న వ్యాయామం.. రోజుల ప్రయోజనం..
వ్యాయామంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మనం చాలాకాలంగా వింటున్నాం. కానీ ఎంత వ్యాయామానికి ఎంత? ఎలాంటి ప్రయోజనం జరుగుతుందన్నది మాత్రం సౌత్‌వెస్ట్‌ర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధన ద్వారా లెక్కకట్టారు. దీని ప్రకారం కేవలం ఒక్కసారి వ్యాయామం చేసినా జీవక్రియలపై దాని ప్రయోజనం కొన్ని రోజులపాటు కొనసాగుతుంది. కచ్చితంగా చెప్పాలంటే మెదడులోని న్యూరాన్లను ప్రభావితం చేయడం ద్వారా ఒక్క వ్యాయామం రెండు రోజుల పాటు జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయని అంటున్నారు కెవిన్ విలియమ్స్ అనే శాస్త్రవేత్త. ఎలుకలపై ప్రయోగాలు చేయడం ద్వారా తాము వ్యాయామం చేసిననప్పుడు పీఎంఓసీ, ఏజీఆర్పీ అనే రెండు న్యూరాన్లు ఎక్కువ విడుదలవుతున్నట్లు ఇవి రెండూ కలిసి మెలనోకార్టిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తున్నట్లు స్పష్టమైందని కెవిన్ చెప్పారు. ఈ మెలనోకార్టిన్స్ మనం ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తూంటుందని చెప్పారు. అరవై నిమిషాలపాటు ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తే పీఎంఓసీ న్యూరాన్ కారణంగా ఆకలి మందగించినట్లు తాము గుర్తించామని, అదేసమయంలో రక్తంలో చక్కెర మోతాదులు కూడా తగ్గాయని కెవిన్ వివరించారు. దీన్ని బట్టి నాలుగు రోజులకు ఒకసారైన ఓ మోస్తరు తీవ్రతతో వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలుస్తున్నట్లు చెప్పారు. -
కండ కలిగితే కొవ్వు ఉండదోయ్
బరువుకు కరువు ఏర్పడాలంటే ఒళ్లు వొంచక తప్పదు. తినే ఆహారం, చేసే శ్రమ... ఇవే మన శరీరాన్ని అదుపులోనూ ఆరోగ్యంగానూ ఉంచుతాయి. అంతేకాదు మన మెటబాలిజం (జీవక్రియలు) కూడా చురుగ్గా ఉండాలి. వయసు పెరిగే కొద్ది మెటబాలిజం మందకొడిగా మారుతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదం వస్తుంది. వ్యాయామం ద్వారా జీవక్రియలను కూడా చురుగ్గా ఉంచి బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... జీవక్రియలు జరగాలంటే ఆహారంతో అందే శక్తి కావాలి. రెస్టింగ్ మెటబాలిజమ్ అంటే... మనం ఏ పనీ చేయకుండా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు కూడా శరీరంలో జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఒంట్లోని కొవ్వులు దహించుకుపోతుంటాయి. దాన్నే రెస్టింగ్ మెటబాలిజమ్ అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ విశ్రాంతిగా ఉన్నప్పుడు దహించుకుపోయే కొవ్వులు తగ్గుతుంటాయి. అందుకే ఓ వయసు తర్వాత బరువు పెరగడం మొదలవుతుంది. వ్యాయామంతో రెస్టింగ్ మెటబాలిజమ్‌లో చురుకుదనం పెరుగుతుంది. వయసుతో పాటు తగ్గాల్సిన రెస్టింగ్ మెటబాలిజమ్‌ను వ్యాయామం అలా స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఫలితంగా కొవ్వుల దహనమూ కొనసాగుతుంది. ఫలితంగా ఒంట్లో కొవ్వు పేరుకోవడం, కొవ్వులు పెరగడం జరగదు. దాంతో బరువు పెరగకపోవడంతో పాటు ఆరోగ్యమూ సమకూరుతుంది.ఇలా వ్యాయామాలు బరువును తగ్గించడానికి, అదుపులో ఉంచడానికి దోహదపడతాయన్నమాట. ఇన్ని రకాల వ్యాయామాలు ఎందుకు? ఇష్టం కదా అంటూ ఆహారంలో వరుసగా మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు లేదా ఏ పిండిపదార్థాలు తీసుకుంటూ ఉంటే బరువు పెరగడం ఖాయం. ఆహారాన్ని ఎలాగైతే భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే ప్రయోజనమో వ్యాయామాన్ని కూడా భిన్నంగా ఎంచుకుంటూ ఉంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకున్నట్టే వ్యాయామాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. కలిగించే ప్రధాన ప్రయోజనాల ఆధారంగా వ్యాయామాలను రకరకాలుగా వర్గీకరించవచ్చు. ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, ఏరోబిక్ వ్యాయామాలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, కోర్ ఎక్సర్సైజెస్... ఇవన్నీ ఉన్నాయి. వీటిని మార్చి మార్చి చేస్తూ ఉంటే వ్యాయామాల్లోనూ సమతౌల్యత సాధించవచ్చు. ఎప్పటికీ బరువు పెరగకుండా ఒకేలా ఆరోగ్యంగా, ఫిట్‌గా, చురుగ్గా, ఆకర్షణీయంగా ఉండవచ్చు. ఇన్ని రీతులూ... ఎలా చేయాలి? వ్యాయామాలను గరిష్ట ప్రయోజనం కోసం మార్చి మార్చి చేయడాన్ని ‘ట్రైనింగ్ రెజీమ్’గా చెప్పవచ్చు. మొదట ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలను కనీసం 10, 15 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత డైనమిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, స్టాటిక్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేయాలి. స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్లోనే మధ్య మధ్య ఏరోబిక్ ప్రక్రియల్లో ముఖ్యమైన జాగింగ్‌ను కొనసాగించాలి. ఇలా చేయడం ద్వారా మీ వ్యాయామం సెషన్లో మీ గుండె వేగాన్ని పెంచడం సాధ్యమవుతుంది. సాధారణంగా 72 సార్లు స్పందించే గుండె వేగాన్ని కనీసం 150 సార్లకు పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. గుండె సామర్థ్యం, ఆరోగ్యం పెరుగుతాయి. (అయితే ఇందుకోసం క్రమంగా వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవాలి. గుండెకు కూడా ఇది మంచిది). కాస్త స్ట్రెచింగ్, ఆ తర్వాత ఏరోబిక్ చేసి, స్ట్రెంగ్త్ వ్యాయామాలు చేస్తూనే మధ్య మధ్య ఏరోబిక్ వ్యాయామంగా జాగింగ్ లేదా ఇతర వ్యాయామాలను కొద్ది నిమిషాలు కొనసాగిస్తూ... దాన్నే విశ్రాంతిగా పరిగణిస్తూ మీ మొత్తం అవిశ్రాంత వ్యాయామాన్ని కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు చేయాలి. తొలుత 30 నిమిషాలు చేస్తూ ఆ సమయాన్ని క్రమంగా 60 నిమిషాలకు పెంచవచ్చు. ఇలా అన్ని రకాల వ్యాయామాలను పూర్తిచేసేలా ఒంటికి వ్యాయామాన్ని అందించడాన్ని సర్క్యూట్ ట్రైనింగ్ అంటారు. మీరు జిమ్‌లోనే చేస్తున్నప్పుడు స్థలాభావం వంటివి ఉంటే స్ట్రెంగ్త్ వ్యాయామ రీతుల మధ్యన ప్రతిసారీ ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు ఉన్నచోటే పరుగు పెట్టవచ్చు. సర్క్యూట్ ట్రైనింగ్‌కు డబ్బు ఖర్చవుతుందా? ఖర్చు : జిమ్‌లో చేరడం లేదా ఉపకరణాలు కొనుక్కోవడానికి డబ్బు ఖర్చు అవుతుంది. అంతగా ఖర్చు చేయలేమని అనుకున్నప్పుడు మీ సొంత శరీర బరువును ఉపయోగించి చేసే పుష్–అప్స్, సిటప్స్, పుల్–అప్స్తోనూ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు చేయవచ్చు. పరుగెత్తడానికి ఎలాంటి ఖర్చూ అవసరం లేదు కదా. సర్క్యుట్ ట్రైనింగ్ ఎలా మీకు అనువైన, సంతృప్తికరమైన రీతిలో ఉండే సర్క్యూట్‌ను మీరే రూపొందించుకోవచ్చు. కాస్త అనుభవం తర్వాత దేని తర్వాత ఏది చేస్తే మీకు సంతృప్తి కలుగుతుందో మీరే నిర్ణయించుకొని దాన్ని కొనసాగించుకోవచ్చు. ఔట్డోర్స్లోమీకు జిమ్‌కు వెళ్లే అవకాశం లేదా స్తోమత లేకపోతే ఏదైనా స్కూల్ గ్రౌండ్ లేదా కాలేజీ గ్రౌండ్ లేదా స్థలం ఉంటే మీ ఇంటి పెరట్లోనూ మీరు వ్యాయామాలు చేయవచ్చు.వ్యాయామం చేయాలనే మనసుండాలేగానీ మార్గం ఉంటుంది. బరువూ తగ్గుతుంది. మెడికల్ ఖర్చులకు, మందులకు అయ్యే ఖర్చూ తగ్గుతుంది. కావాల్సిందల్లా కొంచెం సమయాన్ని మాత్రం ఖర్చు చేయడం. (మరికొన్ని వ్యాయామాలు వచ్చే వారం) ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు వీటినే స్ట్రెచింగ్ వ్యాయామాలు అని కూడా అంటారు. యోగాలోని ప్రాథమిక ఆసనాలన్నీ శరీరాన్ని స్ట్రెచ్ చేసే వ్యాయామంగా ఉపయోగపడతాయి. కాళ్లు చేతులు వేగంగా కదలడానికి, చేతులు చురుగ్గా ఉండటానికి స్ట్రెచింగ్ వ్యాయామాలు దోహదపడతాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచి అవి వేగంగా ప్రతిస్పందించేలా చేస్తాయి. శరీరాన్ని స్ట్రెచ్ చేయకుండా అంటే సాగదీయకుండా అదేపనిగా బరువులెత్తే వ్యాయామాలు చేస్తే శరీరాకృతి కొంత ఆకర్షణీయం అవుతుందేమో కాని చురుకుదనం కలగకపోవచ్చు. తగినంత చురుకుదనంతో ఏ పనినైనా తేలిగ్గా, సులువుగా చేయగలిగితేనే కదా మనం చేసే ఆ పనికి విలువ. అందుకే ఫ్లెక్సిబిలిటీ పెంచే ఈ వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రధాన వ్యాయామాలకు ముందు కనీసం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం తప్పనిసరి. వ్యాయామం సెషన్ పూర్తయ్యాక కూడా ఇవే వ్యాయామాలు కామ్డౌట్ వ్యాయామాలుగా చేయడం మరింత మంచిది. యోగా ప్రక్రియలు ఈ స్ట్రెచింగ్ వ్యాయామాలుగా ఎంతగానో ఉపకరిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే స్ట్రెచింగ్ వ్యాయామాలు ఒంట్లో ఒత్తిడినీ, ఉద్విగ్నతనూ (స్ట్రెస్ అండ్ టెన్షన్‌ను) దూరం చేస్తాయి. అయితే కొంతమంది వీటిపై అంతగా దృష్టి పెట్టరు. పైగా చిన్నచూపు చూస్తారు. బ్యాలెన్స్ ట్రైనింగ్ వ్యాయామాలు సరిగ్గా సాగాలంటే శరీరం బ్యాలెన్స్‌లో ఉండాలి. కనుక శరీరాన్ని బ్యాలెన్స్ చేసే వ్యాయామాలు కూడా ముఖ్యం. ఒక కాలు ముడిచి ఒకే కాలిపై నిలబడటం, ఒంటి కాలిపై చేసే యోగాభ్యాసాలు, ఆసనాలు ఇందుకు ఉపకరిస్తాయి. ఇక ఒంటిని నియమబద్ధంగా ఒంచుతూ చేసే ‘టాయ్ చీ’ కూడా శరీరం బ్యాలెన్స్ తప్పకుండా చేస్తుంది. ఏరోబిక్ ఫిట్నెస్ వీటినే కార్డియో వ్యాయామాలు అనీ, ఎండ్యూరెన్స్ వ్యాయామాలు అని అంటారు. వీటిలో మనం శ్వాస తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో నిండే గాలి పెరుగుతుంది. శరీరం తీసుకునే ఆక్సిజన్ పెరుగుతుంది. గుండె వేగం పెరిగి కణకణానికీ ఆక్సిజన్ అంది మనిషి స్టామినా పెరుగుతుంది. కాబట్టి చాలాసేపు పనిచేసినా అలసట రాని తత్వం అలవడుతుంది. సామర్థ్యం ఉంటేనే కదా ఏదైనా సాధించగలిగేది. సాధారణ వ్యాయామంతో మీరు 50 కిలోల బరువును ఎత్తగలరు. కానీ ఆ బరువును అలా ఎత్తి, ఇలా వదిలేస్తే లాభం ఏముంది? దానిని అరగంట పాటైనా మోసుకుంటూ రాగల సామర్థ్యాలు ఈ వ్యాయామాలతోనే సమకూరతాయి. కాళ్లూ చేతులు వేగంగా కదిలిస్తూ డ్యాన్స్లాగా, డ్రిల్ తరహాలో చేయదగిన ఉత్సాహవంతమైన వ్యాయామాలు ఇవి. వేగంగా నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, వాటర్ ఏరోబిక్స్ అన్నీ ఏరోబిక్ ప్రక్రియలే. కోర్ ఎక్సర్సైజెస్ నడుము ప్రాంతంలో అంటే పొట్ట, వీపు కింది భాగం (లోయర్బ్యాక్)లో ఉండే కండరాలకు వ్యాయామాన్ని ఇచ్చే రీతులను కోర్ ఎక్సర్సైజెస్ అంటారు. శరీరం పై భాగానికీ, కింది భాగానికీ మధ్య అనుసంధానంగా ఉండే భాగాలలోని ఉండే కండరాలను బలంగా చేసే వ్యాయామాలు ఇవి. ఈ కోర్ వ్యాయామాలను బ్రిడ్జెస్, ప్లాంక్స్, ఫిట్నెస్బాల్ వంటి ఉపకరణాలతో మరింత తేలిగ్గా చేయవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ రెజీమ్‌లో అందరికీ ఆసక్తి ఉండి, అందరూ చేయాలనుకునే ప్రధాన వ్యాయామ రీతులు ఇవే అని చెప్పవచ్చు. వీటి వల్ల మన ప్రధాన కండరాలు అయిన వీపు భాగంలోని ట్రెపీజ్, లాటిసిమస్ డార్సీ, ఛాతీ భాగంలో బలానికి సూచనగా కనిపించే పెక్టోరాలిస్ మేజర్, చేతుల కండలను చూపించే బైసెప్స్, సిక్స్‌ప్యాక్‌లో కనిపించే రెక్టస్ అబ్డామినిస్, తొడల్లో బలంగా కనిపించే క్వాడ్రసెప్స్, హ్యామ్‌స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్... ఇవన్నీ శక్తిమంతం అయ్యి మంచి షేప్‌లో కనిపిస్తాయి. దాంతో మనిషి ఆకర్షణీయంగా ఆరోగ్యంగా అనిపిస్తాడు. బరువు తగ్గించడంతో పాటు మనిషిని అందమైన సౌష్టవానికి తెచ్చే వ్యాయామలు ఇవి. ఈ వ్యాయామాల్లో బరువులు, ఉపకరణాలు ఉపయోగిస్తారు. నియమబద్ధంగా, నిర్ణీతంగా చేస్తుంటారు. మరికొందరు జిమ్‌లో చేరి చేస్తారు. ఇంకొందరు పిచ్చిగా ఆకర్షితమై వీటికే కట్టుబడతారు. ఒంటి బరువునే ఆధారంగా చేసుకొని పుషప్స్, పులప్స్, అబ్డామినల్ క్రంచెస్, లెగ్ స్క్వాట్స్ వంటి వ్యాయామ రీతులతోనూ వీటిని చేయవచ్చు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ మీ సందేహాలను ఈ కింది ఈమెయిల్‌కి పంపి, నిపుణులచే సరైన సమాధానాలు తెలుసుకోవచ్చు.oobacolumn@gmail.com -
తగినంత వాడితే విటమిన్లతో లాభమే...
జీవక్రియలు సక్రమంగా సాగేందుకు ఉపకరించే విటమిన్లు, ఖనిజాలను తగినంత మోతాదులో వాడితే వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలను వాయిదా వేయవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆసుపత్రిలో పదేళ్లపాటు జరిపిన పరిశోధనల ఆధారంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బ్రూస్ ఏమ్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మొత్తం 30 విటమిన్లతో పాటు ఇప్పటివరకూ విటమిన్లుగా గుర్తించని 11 ఇతర పదార్థాలను... దీర్ఘాయుష్షును అందించేవిగా గుర్తించాలని ఏమ్స్ అంటున్నారు. విటమిన్లు, ఖనిజాలు మన శరీరంలో జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడే ఎంజైమ్‌లలో కీలకమైన భాగాలని, దురదృష్టవశాత్తూ చాలామందికి ఇవి తగుమోతాదులో అందడం లేదని చెప్పారు. చాలామంది కొద్దిపాటి విటమిన్ లోపాలను పట్టించుకోరని, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ఇది కూడా ప్రభావం చూపుతుందని వివరించారు. కణాల్లోని వందలాది ఎంజైమ్‌లకు ఈ విటమిన్లు, ఖనిజాలు అత్యవసరమన్న అంశాన్ని పోషకాహార నిపుణులు విస్మరించినందుకు ఫలితంగా శరీరం అందుబాటులో ఉన్నవాటిని రోజువారీ పనులకు ఉపయోగిస్తుందని, దీంతో డీఎన్ఏ మరమ్మతులకు, వయో సంబంధిత సమస్యల నివారణకు విటమిన్లు, ఖనిజాలు దొరక్కుండా పోతున్నాయని వివరించారు. -
జీవక్రియలను ప్రభావితం చేసే మైక్రోబయోమ్!
మన కడుపు, పేగుల్లో ఉండే సూక్ష్మజీవుల ప్రపంచం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఇటీవలి కాలంలో జరిగిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎలా జరుగుతోందన్న విషయం మాత్రం అంతగా తెలియలేదు. బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్స్ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ లోటు కూడా భర్తీ అయింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం ద్వారా పేగుల్లోని మంచి బ్యాక్టీరియా జీవక్రియలు జరిగే పద్ధతిలో మార్పులు చేయగలదని పౌలా వాట్నిక్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఈగలపై తాము పరిశోధనలు చేశామని, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థకు ఇంకో ముఖ్యమైన పని కూడా ఉన్నట్లు ఇందులో తెలిసిందని పౌలా అంటున్నారు. పేగుల్లోని కణాలు ఈ వ్యవస్థ సాయంతో జీవక్రియల్లో మార్పులు చేయడం ద్వారా మంచి బ్యాక్టీరియాను కాపాడుకుంటాయని వివరించారు. పేగుల్లో బ్యాక్టీరియా లేకపోయినా, జీవక్రియల్లో మార్పులు జరక్కపోయినా ఈగల్లో కొన్ని కొవ్వు కణాలు ఏర్పడటం చూశామని చెప్పారు. ఇది మానవుల్లో కనిపించే ఫ్యాటీలివర్ వ్యాధికి సమానమని అన్నారు. -
వేళకింత తినడం, నిద్ర... చాలా మంచిది!
రాత్రంతా మేలుకుని, పగలు నిద్రపోయే వారు తమ ఆరోగ్యంపై మరికొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందని హెచ్చరిస్తున్నారు కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కొన్ని రోజులపాటు ఈ రకంగా చేసినా. వారి రక్తంలో ఉండే వంద రకాల ప్రొటీన్లలో మార్పులు చోటు చేసుకుంటాయని కెన్నెత్ రైట్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. ఇలా మార్పు చెందే ప్రొటీన్లలో రక్తంలో చక్కెర శాతాన్ని, జీవక్రియను, రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయగలవి ఉండటం గమనార్హం. ఈ కారణంగానే విమాన ప్రయాణం తరువాత లేదంటే నైట్ షిఫ్ట్‌లు చేసే వారిలో నిస్సత్తువ, నీరసం వంటివి కనిపిస్తాయని, రాత్రిళ్లు పని.. పగలు నిద్రలను దీర్ఘకాలంపాటు కొనసాగిస్తే.. ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం ఎక్కువ అవుతుందని వివరించారు . రక్తంలో ఉన్న దాదాపు 30 ప్రొటీన్లు నేరుగా శరీరంలోని గడియారంపై ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం ద్వారా తెలిసిందని అంచనా. గ్లూకగాన్ ప్రొటీన్నే తీసుకుంటే ఇది రక్తంలోకి మరింత ఎక్కువ చక్కెర చేరేలా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర తక్కువైన సందర్భంలో ఇది ఎక్కువైంది. సాధారణంగా ఈ మార్పు పగటిపూట జరిగేది. రాత్రిషిఫ్ట్‌లలో పనిచేసే వారి ఆరోగ్య పరిరక్షణకు కొత్త చికిత్సమార్గాలను వెతికేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని కెన్నెత్ రైట్ తెలిపారు. -
నిద్రలేమితో ఆయుఃక్షీణం!
రాత్రిళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఉదయాన్నే లేవడానికి బద్దకించి పొద్దు ఎక్కేదాకా ముసుగేసి పడుకుంటున్నారా? అయితే కొంచెం జాగ్రత్త ఈ రెండు పనులూ చేయని వారితో పోలిస్తే మీరు తొందరగా తనువు చాలించేందుకు అవకాశాలు ఎక్కువ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొనే వారికి వ్యాధుల సమస్యలూ అధికంగానే ఉంటాయని తాము తొలిసారి అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు సర్రే విశ్వవిద్యాలయం, నార్æ్తవెస్టర్న్ మెడిసిన్ల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 5 లక్షల మంది వివరాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని క్రిస్టన్ నట్సన్ చెప్పారు. గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు జీవక్రియలకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి పెడితే తాము మరణ ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశామని వివరించారు. రాగల జబ్బులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా రాత్రిళ్లు మెలకువగా ఉండే వారు ఇతరులతో పోలిస్తే మరణించేందుకు ఉన్న అవకాశాలు పదిశాతం ఎక్కువని అర్థమైందని నట్సన్ చెప్పారు. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ దీనిపై దృష్టి పెట్టాలని.. కొందరు ఉద్యోగుల కోసం ఆఫీసు పనివేళలను మార్చే ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. అయితే రాత్రిళ్లు మేలుకునే వారు తమ అలవాట్లను మార్చుకునేందుకు ప్రయత్నించడమూ అవసరమేనని వీలైనంత ఉదయాన్నే వెలుతురు అందేలా ఏర్పాట్లు చేసుకోవడం ఇందుకు ఒక మార్గమని తెలిపారు. -
ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు19 వేలే!
లండన్: మన శరీరంలో కణాలకు, జీవక్రియలకు అత్యవసరమైన ప్రొటీన్ల ఉత్పత్తికి ఆదేశాలిచ్చే జన్యువులు 19 వేలు మాత్రమే ఉన్నాయట. గతంలో ఇవి సుమారు లక్ష వరకూ ఉండొచ్చని భావించేవారు. కానీ మానవ జన్యుపటం(జీనోమ్)లో ప్రొటీన్ ఉత్పత్తి జన్యువులు 20,700 వరకూ మాత్రమే ఉండొచ్చని రెండేళ్ల క్రితం తేలింది. అయితే వాటిలో మరో 1,700 జన్యువులకు కూడా ప్రొటీన్ల ఉత్పత్తితో సంబంధం లేదని తాజాగా స్పానిష్ నేషనల్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ జన్యువులన్నీ కూడా సుమారు 5 కోట్ల ఏళ్లనాటి ప్రైమేట్ల నుంచే వారసత్వంగా వచ్చాయని, అప్పటి ప్రైమేట్లకు, ప్రస్తుత మానవులకు మధ్య జన్యుపరమైన తేడాలు చాలా స్వల్పమేనని కూడా వారు కనుగొన్నారు. కీలకమైన జన్యువుల సంఖ్య తగ్గేకొద్దీ వాటిపై మరింత విస్తృత పరిశోధనలు చేసేందుకు మార్గం సుగమం కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీరి పరిశోధన వివరాలు ‘హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.