సోరియాసిస్‌కు చికిత్స ఉందా? | Psoriasis is a long term autoimmune problem | Sakshi
Sakshi News home page

సోరియాసిస్‌కు చికిత్స ఉందా?

Published Fri, May 31 2019 2:49 AM | Last Updated on Fri, May 31 2019 2:49 AM

Psoriasis is a long term autoimmune problem - Sakshi

నా వయసు 42 ఏళ్లు. చాలా రోజుల నుంచి సోరియాసిస్‌తో బాధపడుతున్నాను. ఎన్ని  మందులు వాడినా సమస్య పూర్తిగా తగ్గడం లేదు. మళ్లీ మళ్లీ వస్తోంది. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?

సోరియాసిస్‌ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ సమస్య. ఇది చర్మసమస్యే అయినా ఇది మన రోగనిరోధక శక్తి మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యగా పరిగణించాలి. ఈ వ్యాధి వచ్చిన వారిలో చర్మ కణాలు అత్యంత వేగంగా వృద్ధిచెందడంతో పాటు ఆ కణాలు అనేక పొరలుగా ఏర్పడి, అవి వెండి రంగు పొలుసులుగా రాలిపోతుంటాయి. తర్వాత చర్మంపై రక్తంతో కూడిన చిన్న చిన్న దద్దుర్ల వంటివీ  ఏర్పడతాయి. దురద కూడా ఎక్కువ. చిరాకుగా ఉంటుంది.సోరియాసిస్‌ వ్యాధి ఎక్కువగా మోచేతులు, మోకాళ్లు, తల, వీపు, అరచేతులు, అరికాళ్లు, ఉదరం, మెడ, నుదురు, చెవులు మొదలైన ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. సోరియాసిస్‌తో బాధపడుతున్న 15శాతం మందిలో ఆర్థరైటిస్‌ లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనినే ‘సోరియాటిక్‌ ఆర్థరైటిస్‌’ అంటారు.

కారణాలు :
►వంశపారంపర్యం మానసిక ఒత్తిడి, ఆందోళన

►శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏర్పడే అస్తవ్యస్తత

►దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడటం.

లక్షణాలు: 
►చర్మం ఎర్రబారడం

►తీవ్రమైన దురద

►జుట్టు రాలిపోవడం

►కీళ్లనొప్పులు

►చర్మం పొడిబారినప్పుడు పగుళ్లు ఏర్పడి రక్తస్రావమూ అవుతుంది.

నిర్ధారణ పరీక్షలు: స్కిన్‌ బయాప్సీ, ఈఎస్‌ఆర్, సీబీపీ, ఎక్స్‌–రే పరీక్షలు.

చికిత్స: సోరియాసిస్‌ నివారణ/చికిత్సలకు హోమియోలో సమర్థమైన మార్గాలు ఉన్నాయి. అయితే సోరియాసిస్‌ను వెంటనే దీన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం అవసరం. లక్షణాలను బట్టి ఈ సమస్యనుంచి విముక్తి కోసం సాధారణంగా ఆర్సినికం ఆల్బమ్, సల్ఫర్, కాలీకార్బ్, సొరినమ్, పెట్రోలియం మొదలైన మందులతో చికిత్స చేస్తారు. అయితే ఈ మందులను అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.
డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,
హైదరాబాద్‌

గౌట్‌ సమస్యకు పరిష్కారం ఉందా?  

నా వయసు 45 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. అక్కడ విపరీతమైన సలపరంతో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌గారు గౌట్‌ అని చెప్పారు.  ఎన్ని  మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా?

గౌట్‌ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్‌ యాసిడ్‌’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్‌ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్‌’ అంటారు.

కారణాలు:
►సాధారణంగా రక్తంలోని యూరిక్‌ యాసిడ్‌ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది.

►ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం.

►అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు.

లక్షణాలు :
►తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి.

►చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది.

►మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది.

►ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది.

నివారణ/జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్‌ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్‌ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగా, పేగుల వంటి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి.

చికిత్స : హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్‌టిట్యూషన్‌ చికిత్స ద్వారా గౌట్‌ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది.
డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,
ఎండీ (హోమియో),
స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

యానల్‌ ఫిషర్‌కు చికిత్స ఉందా?

నా వయసు 67 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పారు. ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆపరేషన్‌ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా?

మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మలవిసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది.

మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతోపాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడిప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.

కారణాలు: – దీర్ఘకాలిక మలబద్ధకం – ఎక్కువకాలం విరేచనాలు – వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం – ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం – మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.

లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట – చురుకుగా ఉండలేరు – చిరాకు, కోపం – విరేచనంలో రక్తం పడుతుంటుంది – కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట.

చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమిమోలో మంచిచికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement