మనం తిన్న ఆహారం శుభ్రంగా జీర్ణమైన తరువాత వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వచ్చేయాలి. లేదంటే అనేక అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయి. అడపాదడపా మలబద్దకం చాలా సాధారణమే అయినప్పటికీ, దీర్ఘకాలిక మలబద్దకం అనేక రోగాల పెట్టు. దీనిని పట్టించుకోకుండా, చికిత్స చేయకుండా వదిలేస్తే, అది చివరికి హెమోరాయిడ్స్ లేదా పైల్స్ లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు దీన్ని సరైన సమయంలో నివారించకపోతే రక్తపోటు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు తప్పవు.
గతంలో 60 ఏళ్లు పైబడిన 5.4 లక్షలమంది ఆసుపత్రి రోగులపై జరిపిన ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, మలబద్దకం లేని రోగులతో పోలిస్తే మలబ‍్దకం ఉన్నవారికి అధిక రక్తపోటు, గుండెపోటు. స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. అదేవిధంగా, 9 లక్షల మంది వ్యక్తులపై చేసిన డానిష్ అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో మలబద్దకం ఉంటే ఈ ముప్పు ఉంటుందా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ మోనాష్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల నేతృత్వంలో జరిగిన ఇటీవలి అంతర్జాతీయ అధ్యయనం సాధారణ జనాభాలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉందని తేల్చింది.
మలబద్దకం రకాలు, కారణాలు
అందరూ మలబద్దకాన్ని చిన్నపాటి సమస్యగా భావిస్తారు. దానిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇది అనేక ప్రధాన వ్యాధులకు హెచ్చరిక. పురుషులతో పోలిస్తే, మహిళల్లోనే ఈ సమస్య ఎక్కువట. మలబద్దకానికి అనేక కారణాలున్నాయి. అలాగే దీన్ని ప్రైమరీ, సెకండరీ అని రెండు గ్రూపులుగా వర్గీకరిస్తారు. మలబద్దకం సమయంలో ప్రేగు కదలికల్లో ఒత్తిడి కడుపుపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో బీపీ, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. రక్తపోటు పెరిగితే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది.
సాధారణంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి కావల్సిన నీటిని తీసుకోకపోవడం మలబద్ధకానికి దారి తీస్తుంది. మలబద్దకంతో ఉన్నప్పుడు, సాధారణంగా ప్రేగుల్లో గ్యాస్ పేరుకుపోతుంది. ఇది పొత్తి కడుపులో ఒత్తిడి పెంచి ఛాతీ దాకా విస్తరిస్తుంది. దీంతో నొప్పి, మంట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఇది హృదయనాళ వ్యవస్థపై భారాన్ని పెంచి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు చాలా అరుదుగానే అయినప్పటికీ ఊపిరి పీల్చుకోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. బలవంతంగా మల విసర్జనకు ప్రయత్నించడంతో చాలామందిలో రక్తం స్రావం కనిపిస్తుంది. ఇది ఎనిమీయాకు కారణమవుతుంది.
ఎపుడు అప్రమత్తం కావాలి?
జీవన శైలిమార్పులతోపాటు, వైద్యుల సలహాపై తీసుకొనే కొన్ని రకాల మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. అయితే మలబద్దకంతోపాటు ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం ఒకటీ రెండు రోజులకు మించి ఉంటే తీవ్రమైన సమస్యగా పరిగణించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆందోళన, దవడ, మెడ లేదా వెనుక భాగంలో నొప్పి లేదా అసౌకర్యం, చేతులు భుజాలలో నొప్పి లేదా అసౌకర్యం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
మలబద్దకం-నివారణ
ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్తపడాలి.
ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , చిక్కుళ్ళు తీసుకోవాలి.
పుష్కలంగా నీరు తాగాలి.
ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి తేలికపాటి వ్యాయాయం, వాకింగ్ లాంటివి చేయాలి.
పరగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం, కొన్నిరకాల యోగాసనాల వల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment