
రాత్రిళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారా? ఉదయాన్నే లేవడానికి బద్దకించి పొద్దు ఎక్కేదాకా ముసుగేసి పడుకుంటున్నారా? అయితే కొంచెం జాగ్రత్త ఈ రెండు పనులూ చేయని వారితో పోలిస్తే మీరు తొందరగా తనువు చాలించేందుకు అవకాశాలు ఎక్కువ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మేల్కొనే వారికి వ్యాధుల సమస్యలూ అధికంగానే ఉంటాయని తాము తొలిసారి అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు సర్రే విశ్వవిద్యాలయం, నార్æ్తవెస్టర్న్ మెడిసిన్‌ల శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 5 లక్షల మంది వివరాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని క్రిస్టన్ నట్సన్ చెప్పారు.
గతంలో జరిగిన కొన్ని అధ్యయనాలు జీవక్రియలకు సంబంధించిన అంశాలపై ఎక్కువగా దృష్టి పెడితే తాము మరణ ప్రమాదం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశామని వివరించారు. రాగల జబ్బులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నా రాత్రిళ్లు మెలకువగా ఉండే వారు ఇతరులతో పోలిస్తే మరణించేందుకు ఉన్న అవకాశాలు పదిశాతం ఎక్కువని అర్థమైందని నట్సన్ చెప్పారు. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి అందరూ దీనిపై దృష్టి పెట్టాలని.. కొందరు ఉద్యోగుల కోసం ఆఫీసు పనివేళలను మార్చే ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. అయితే రాత్రిళ్లు మేలుకునే వారు తమ అలవాట్లను మార్చుకునేందుకు ప్రయత్నించడమూ అవసరమేనని వీలైనంత ఉదయాన్నే వెలుతురు అందేలా ఏర్పాట్లు చేసుకోవడం ఇందుకు ఒక మార్గమని తెలిపారు.