
'పట్టుకుంటే చంపేస్తాం..లేదంటే చస్తాం'
గంజాయికి అలవాటు పడిన ఓ ముఠా... దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.
రాజమండ్రి క్రైం : గంజాయికి అలవాటు పడిన ఓ ముఠా... దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. బ్లేడ్‌బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులపై కూడా దాడికి దిగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం జరిగిన ఘటన వివరాలివీ...గంజాయి సేవించటంతోపాటు విక్రయించే ముఠా ఒకటి స్థానిక గోదావరి రైల్వేస్టేషన్‌ను అడ్డాగా మార్చుకుంది. వీరు దొంగతనాలకు పాల్పడుతూ ప్రయాణికులను బ్లేడ్లతో గాయపరిచి, భయపెడుతున్నారు. అంతా వీరిని బ్లేడ్‌బ్యాచ్ అంటుంటారు.
ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీన ఈ ముఠాకు చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇందుకు కారకులైన వారిని చంపేస్తామంటూ హల్‌చల్ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఈ ముఠా కదలికలపై నిఘా ఉంచారు. అప్రమత్తమైన బ్లేడ్‌బ్యాచ్ మకాంను వీటీ కళాశాల సమీపానికి మార్చుకుంది. విషయం తెలిసిన ఎస్సై సంపత్ బుధవారం సిబ్బందితో కలసి అక్కడికి వెళ్లారు. వారిని పట్టుకునేందుకు యత్నించగా సంపత్‌పై బ్లేడ్ తో దాడికి దిగారు. తమను పట్టుకుంటే చంపేస్తాం...లేదంటే చనిపోతాం..అని బెదిరిస్తూ గ్యాంగ్ సభ్యులు తమని తాము గాయపరుచుకున్నారు. వారిని చుట్టు ముట్టిన పోలీసులు ఐదుగురు నిందితులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.