హుక్కా.. లేదు లెక్క!
బార్లను మించిపోతున్న ‘సెంటర్లు’ మైనర్లపైనే గురి
నిబంధనలు గాలికొదిలి ‘పొగాకు, గంజాయి సరఫరా?
సరైన ‘సెక్షన్లు’ లేకపోవడంతో పోలీసులకు తలనొప్పులు
సిటీబ్యూరో: నగరంలోని హుక్కా సెంటర్లు బార్లు, పబ్బులను మించిపోతున్నాయి. వినోదం ముసుగులో అనుమతులు తీసుకుంటున్న ఈ సెంటర్లు మాయమాటలతో యువతకు వల వేస్తూ వారి జీవితాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఇక్కడ వివిధ ఫ్లేవర్ల పేరుతో పొగాకు, గంజాయి తదితరాలను వినియోగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వీటన్నింటికీ మించి ఈ సెంటర్లలోకి మైనర్లను విచ్చలవిడిగా అనుమతిస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న పశ్చిమ మండల పోలీసులు శనివారం అర్దరాత్రి వరుసదాడులు చేశారు. కమిషనరేట్ పరిధిలో హుక్కా సెంటర్లు వందల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. బిలియడ్స్ తరహా ఆటలు నిర్వహిస్తామంటూ రిక్రియేషన్ సెంటర్ల పేరుతో అనుమతులు తీసుకుంటున్న ఈ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. కేవలం యాపిల్, మింట్, పాన్ మసాలా, చాకో, బెర్రీస్ ఇలాం టి రకాలైన ఫ్లేర్లను మాత్రమే హుక్కాల్లో వినియోగిస్తామంటున్న నిర్వాహకులు వినియోగదారులు అవసరా న్ని బట్టి ‘మెనూ’ మారుస్తున్నారు. పొగాకుతో పాటు గంజాయి, మాదకద్రవ్యాలు సైతం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలను సైతం తుంగలో తొక్కి మైనర్లు, యువతులను అనుమతిస్తూ వారినీ బానిసలుగా మారుస్తున్నారు. ఈ మత్తుకు అలవాటు పడినయువత రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు.
బానిసల్లో మైనర్లే ఎక్కువ ...
చట్ట ప్రకారం హుక్కా పీల్చడం తప్పుకాదనే విషయాన్ని అడ్డం పెట్టుకుని నగరంలోని హుక్కా సెంటర్లు చేస్తున్న ఉల్లంఘనలు అన్నీ ఇన్నీ కావు. హుక్కాకు బానిసవుతున్న వారిలో సగానికి సగం మైనర్లే ఉంటున్నారు. మేజర్లు మద్యం కోసం బార్లు, పబ్బులకు వెళ్తుండగా ఆ అవకాశం లేని మైనర్లు హుక్కా దారి పడుతున్నారు. ఈ హుక్కా పైపుల్లో పొగాకు వాడకూడదని నిబంధనలు చెప్తున్నా ఫ్లేవర్ల కంటే నికోటిన్ కూడిన వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. హుక్కా ద్వారా వచ్చే పొగ నీటిలో శుద్ధి అవుతూ పైపు ద్వారా నోటిలోకి వస్తుందని, దీని వల్ల నికోటిన్ వంటిని శరీరంలోకి చేరవని, ఎలాంటి హానీ ఉండదనీ మాయమాటలు చెప్తూ సెంటర్ల నిర్వాహకులు యువతను ఆకర్షిస్తున్నారు. ఈ మాటలు నమ్మి మైనర్లు ఆయా సెంటర్ల మెట్లు ఎక్కుతున్నారు. సిటిరెట్ కన్నా హుక్కా ప్రమాదకరమైందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని పీల్చడం ద్వారా పొగ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుందంటున్నారు. అధికమొత్తంలో కార్బన్‌మోనాక్సైడ్ శరీరంలోకి చేరుతుందని, సిగరెట్ కన్నా ఎన్నో రెట్లు ఇది హానికమని చెప్తున్నారు. ఒకే హుక్కా గొట్టాన్ని అనేక మంది వాడటం, పూర్తిస్థాయిలో శుభ్రం చేయకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్స్‌తో పాటు నోటి సంబంధ వ్యాధులు వస్తామని హెచ్చరిస్తున్నారు.
ఏ చట్టం కింద కేసు పెట్టాలి..?
హుక్కా సెంటర్ల ఉల్లంఘనలు, కల్పిస్తున్న అదనపు సౌకర్యాల విషయం తెలిసిన పోలీసు అధికారులు ఇటీవల దాడులు ముమ్మరం చేశారు. వెస్ట్‌జోన్ పోలీసులు శనివారం రాత్రి హుక్కా సెంటర్ల మీద వరుస దాడులు చేశారు. వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా... ఎక్సైజ్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పశ్చిమ మండల అధికారులు శనివారం చేసిన దాడుల్లో అనేక సెంటర్ల నుంచి నమూనాలు సేకరించారు. ఇతర వరకు బాగానే ఉన్నా... నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులు, అక్కడకు వస్తున్న మైనర్లపై ఏ చట్టం కింద, ఏ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలన్నది అంతు చిక్కట్లేదు. సదరు సెంటర్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తుంటే ఆ చట్టం కింద కేసులు పెట్టచ్చు. అయితే మైనర్లను అనుమతిస్తున్నారనో, మరో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనో తేలితే ఎలాంటి కేసులు పెట్టాలి? ఏ చర్యలు తీసుకోవాలి అనే విషయంపై స్పష్టత లేక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీసీలోని సెక్షన్ 188తో (ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడం) పాటు సీఆర్పీసీ, సీపీ యాక్ట్‌ల్లోని సెక్షన్లతో సరిపెట్టాల్సి వస్తోంది. ఇవేవీ కఠిన శిక్షలు, చర్యలకు ఉపకరించే కాకపోవడం గమనార్హం.