మంచు కుటుంబ వివాదంలో వీరి పాత్రే కీలకం
నియంత్రించే వ్యవస్థలు లేకపోవడంతోనే ఇలా..
పస్రా యాక్ట్ నిబంధనలు పట్టని నిర్వాహకులు
ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 115 (2), లాఠీలు, కర్రలు వినియోగించి దాడి చేస్తే 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జల్‌పల్లిలోని ‘మంచు టౌన్’ కేంద్రంగా ఇటీవల జరిగిన భారీ హంగామాకు ఓ రకంగా బౌన్సర్లే కారణమయ్యారు. కేవలం ఈ ఒక్క ఉదంతంలోనే కాదు... దాదాపు ప్రతి చోటా ‘పెద్దల’ వెనక బౌన్సర్లు కామన్ అయ్యారు. ఇటీవల కాలంలో కొందరు లేడీ బౌన్సర్లు కూడా తెరపైకి వస్తున్నారు. తమ వారి రక్షణ పేరుతో వీళ్లు చేసే హడావుడి, దౌర్జన్యాలు వీధి రౌడీలకు తీసిపోకుండా ఉంటున్నాయి. అత్యధిక బౌన్సర్లు జిమ్‌ల ద్వారా రిక్రూట్ అవుతుండటంతో 2005 నాటి ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ (రెగ్యులరేషన్) యాక్ట్‌లోని (పస్రా) నిబంధనలు వీరికి పట్టట్లేదు.
తమకు అనుకూలంగా మార్చుకుని..
ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, ప్రీమియర్ షోలు, ప్రారం¿ోత్సవాలతో సహా సినీ తారలతో ముడిపడి ఉన్న కార్యక్రమాలు, సభలు, సమావేశాలతో పాటు భారీ సంస్థల ఈవెంట్లకు నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి టికెట్లు లేకుండా చేసే కార్యక్రమాలను పోలీసు విభాగమే భద్రత ఏర్పాటు చేస్తుంది. టికెట్లు విక్రయించే కార్యక్రమాలతో పాటు మరికొన్నింటికి నిరీ్ణత మొత్తం వసూలు చేస్తుంది. దీనికి తోడు పోలీసు విభాగంలో ఉన్న సిబ్బంది కొరత నేపథ్యంలో ఆయా సందర్భాల్లో అధికారులు అవసమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలంటూ షరతు విధిస్తుంది. ఈ మాటను అడ్డం పెట్టుకుని బౌన్సర్లు, సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత అంగరక్షకుల పేరుతో వీళ్లు చేసే జులుం అంతా ఇంతా కాదు. భద్రత పేరుతో ఈ గార్డులు బలప్రయోగం చేస్తుంటారు. చట్టప్రకారం ఇది నేరమే అంటున్న పోలీసులు బాధితులు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఫిర్యాదు చేస్తే కేసులు..
భద్రత కల్పించడానికి, ప్రజలకు అదుపులో పెట్టడానికి బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను యాజమాన్యాలు, వ్యక్తులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా విధుల్లోకి వస్తున్న గార్డులు అనేక సందర్భాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కార్యక్రమాలకు హాజరైన, తమ యజమాని ఆదేశాల మేరకు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కోసారి ఏకంగా లాఠీలు చేతపట్టుకుని ఆహూతులపై విరుచుకుపడుతున్నారు. వీఐపీలకు ఉండే పలుకుబడిని దృష్టిలో పెట్టుకునే సామాన్యులు వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్నారు. కేవలం అక్కడక్కడ మాత్రమే నిరసన గళం విప్పుతున్నారు. కాగా.. దురుసుగా ప్రవర్తించే అధికారం ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు లేదని పోలీసులు అంటున్నా... ఫిర్యాదు చేస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేస్తున్నారు.
బార్లతో మొదలై..
బౌన్సర్... ఈ పేరు పబ్స్, బార్స్‌కు తరచు వెళ్లే వారికి సుపరిచితమే. ఈ సంస్కృతి సైతం ముంబైలోని డాన్స్ బార్లలో ప్రారంభమైంది. మితిమీరి ప్రవర్తించే వారిని, హద్దు మీరి మద్యం తాగి గొడవలు చేసేవారిని కట్టడి చేయడానికి శాశ్వత ప్రాతిపదికన యాజమాన్యాలు వీరిని నియమించుకుంటాయి. కండలు తిరిగిన శరీరం, కళ్లల్లో చురుకుతనం, చిరునవ్వు కూడా కనిపించని ముఖం, నల్లటి యూనిఫాం (సాధారణంగా షర్టు, టీషర్టు మాత్రమే నల్లవి ధరిస్తారు)లతో వీరు దర్శనం ఇస్తుంటారు. ఆపై వీరిని రెస్టారెంట్లు, మాల్స్ యాజమాన్యాలు సైతం ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాయి.
ఆపై సెక్యూరిటీ గార్డులుగా మారిన ఈ బౌన్సర్లు ప్రముఖుల రాక, భారీ స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు తదితర సందర్భాల్లో రక్షణ కోసం రంగంలోకి దిగడం ప్రారంభించారు. ఇప్పుడైతే అనేక మంది వీఐపీల వెంటే ఉండటం ప్రారంభమైంది. దేహ దారుఢ్యంతో పాటు కాస్త చురుకుదనం, సమయస్ఫూర్తి మాత్రమే ప్రధాన అర్హతలు కావడంతో జిమ్స్‌తో టచ్‌లో ఉండే అనేక మంది యువకులు తాత్కాలిక బౌన్సర్లుగా ఉండటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలోనే కొందరు శాశ్వత ప్రాతిపదికన సెక్యూరిటీ గార్డులుగానూ పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment