నేర నిరూపణలో విఫలమవుతున్న టీజీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ
ఈ ఏడాదిలో 226 కేసులకుగాను 39 కేసుల్లోనే శిక్షలు ఖరారు
ఎక్సైజ్ కేసుల్లో గత పదేళ్లలో 0.85 శాతానికి మించని కన్విక్షన్ రేట్
ఎట్టకేలకు దర్యాప్తు అధికారులకు శిక్షణపై దృష్టిపెట్టిన అధికారులు
శాస్త్రీయ ఆధారాల్లేక వీగిపోతున్న డ్రగ్స్ కేసులు
సాక్షి, హైదరాబాద్: గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వ పెద్దలు పదేపదే సూచిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. మత్తుపదార్థాలను కట్టడి చేస్తున్నామంటూ అధికారులు భారీగా ప్రచారం చేస్తుండగా కేసుల దర్యాప్తు పేల వంగా సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా వరకు వీగిపోవడమే అందుకు నిదర్శనం. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు నమోదైన 226 కేసులకుగాను కేవలం 39 కేసుల్లోనే శిక్షలు ఖరారయ్యాయి. అంటే ఆయా కేసుల్లో నేర నిరూపణ 17 శాతంగానే ఉంది. ఇక ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద గత పదేళ్లలో నమోదు చేసిన కేసుల్లో నేర నిరూపణ అత్యంత తక్కువగా 0.85 శాతంగా ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.
ఆధారాల సేకరణలో లోపాలే శాపాలై..
ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసుల నమోదు, మత్తుపదార్థాల స్వాధీనం, కోర్టుకు ఆధారాల సమర్పణ తదితర అంశాల్లో దర్యాప్తు అధికారులు చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్లే ఎక్కువగా కేసులు వీగిపోతున్నాయి. చాలా వరకు ఎన్‌డీపీఎస్ కేసులు కనీసం విచారణ దశకు కూడా రాకుండానే సాంకేతిక కారణాలతో కోర్టులు కొట్టేస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. గంజాయి, డ్రగ్స్ సరఫరా సమాచారం అందాక దర్యాప్తు అధికారులు తన పై అధికారికి సమాచారం ఇవ్వడంతోపాటు వారి నుంచి లిఖితపూర్వకంగా ఆదేశాలు తీసుకోవాలి.
ఆ తర్వాత తనిఖీ చేసేందుకు వెళ్లే సమయంలో ఇద్దరు పంచ్ విట్‌నెస్‌లను వెంట తీసుకెళ్లాలి. అందులో కనీసం ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉండాలి. ఆ తర్వాత ఎవరి వద్ద తనిఖీ చేయడానికి వెళ్లారో ఆ వ్యక్తికి సదరు అధికారులు ఆప్షన్ ఫాం ఇవ్వాల్సి ఉంటుంది. దాని ప్రకారం..దర్యాప్తు అధికారులను అవతలి వ్యక్తులు తనిఖీ చేయవచ్చు (అధికారులే మత్తుపదార్థాలను తెచ్చి పెట్టారన్న సందేహాలకు తావు లేకుండా). ఆపై తనిఖీలను అధికారులు ప్రారంభించాలి.
నూతన చట్టాల ప్రకారం ఈ వ్యవహారాన్ని వీడియో తీయాలి. సాంకేతిక అంశాల్లో జాగ్రత్తలు తీసుకోకపోయినా.. కొన్నిసార్లు పంచ్ విట్నెస్‌లు అందుబాటులో లేక అందుబాటులో ఉన్న వారితోనే పంచనామా చేయడం.. వారు సాక్ష్యం చెప్పడంలో తడబడటం వంటి కారణాలతో కేసులు నిలబడట్లేదు. సోదాల్లో దొరికిన మత్తుపదార్థాల నమూనాల సేకరణ, వాటికి సంఖ్య కేటాయింపు సైతం ఈ కేసుల్లో కీలకంకాగా అందులోనూ దర్యాప్తు అధికారులకు అవగాహన లేక కేసులు నిలబడట్లేదు.
శిక్షలు పెంచేలా శిక్షణపై దృష్టి..
ఈ నేపథ్యంలో ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తు పక్కాగా జరిగేలా చూడటంతోపాటు ఆధారాల సేకరణపై టీజీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు శిక్షణా తరగతుల నిర్వహణపై దృష్టిపెట్టారు. టీజీఏఎన్‌బీ ఆధ్వర్యంలో పోలీ స్, ఎక్సైజ్, ప్రాసిక్యూషన్, రైల్వే శాఖ అధికారులకు సైతం ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 22,654 సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు టీజీఏఎన్‌బీ అధికారులుతెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment