నైజీరియన్ గ్యాంగ్‌ను పట్టుకున్న యాంటీ నార్కోటిక్స్ టీమ్
పాజిటివ్ వచ్చిన ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
199 గ్రాముల కొకైన్ స్వాదీనం
ఇద్దరు సూత్రధారుల పరారీ
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ), సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ), రాజేంద్రనగర్ పోలీసులు చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్‌లో ఐదుగురు డ్రగ్ పెడ్లర్స్ చిక్కారు. వీరి విచారణలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు, టాలీవుడ్ నటుడు అమన్ ప్రీత్ సింగ్ సహా 13 మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి.
వీరిలో అమన్ సహా ఐదుగురిని పరీక్షించగా, వారు డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. దీంతో ఈ ఐదుగురినీ నిందితులుగా చేర్చి అరెస్టు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌లో కొందరు స్థానికులూ ఉన్నారని, పరారీలో ఉన్న ఇద్దరు ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
విదేశాల నుంచి తెప్పించి...
నైజీరియాకు చెందిన డివైన్ ఎబుక సుజీ, ఫ్రాంక్లిన్‌లు బిజినెస్, స్టడీ వీసాలపై హైదరాబాద్‌కు వచ్చారు. కొన్నాళ్లు నగరంలోని పారామౌంట్‌కాలనీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల నుంచి కొకైన్ సహా వివిధ రకాలైన డ్రగ్స్ ఖరీదు చేస్తున్న వీళ్లు తమ ఏజెంట్ల ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నారు. నైజీరియా నుంచి వచ్చి బెంగళూరులో హోమ్ సర్వీస్ పని చేస్తున్న అనోహ బ్లెస్సింగ్ వీరికి ప్రధాన ఏజెంట్‌గా ఉంది.
ఈమె హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, ముంబై, గోవాల్లో ఉన్న పెడ్లర్స్, సెల్లర్స్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసింది. ఏడాదిన్నర కాలంలో 20 సార్లు నగరానికి మాదకద్రవ్యాలు తెచ్చింది. డ్రగ్స్‌ను హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని, విమానాలు, రైళ్లలో తిరుగుతూ సప్లై చేస్తుంటుంది. ఈ డ్రగ్స్‌ను నిజాం కాలేజీ విద్యార్ధిగా ఉన్న నైజీరియన్ అజీజ్ నోహీమ్ అడెషోలా, బెంగళూరులో ఉంటూ ఓ కంపెనీకి లీడ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న విశాఖ వాసి అల్లం సత్య వెంకట గౌతమ్, అమలాపురం నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న కారు డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్, బండ్లగూడకు చెందిన ఈవెంట్స్ కొరియోగ్రాఫర్ మహ్మద్ మెహబూబ్ షరీఫ్‌లకు పంపిణీ చేస్తోంది. వీళ్లు తమ వినియోగదారులకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
గ్రాముకు రూ.500 కమీషన్
2018 నుంచి ఈ దందాలో ఉన్న అనోహ ఆఫ్రికా నుంచి జోయినా గోమెస్ పేరుతో నకిలీ పాస్‌పోర్టు తీసుకుని వినియోగిస్తోంది. తరచూ బెంగళూరు–హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న గౌతమ్... అనోహ ద్వారా అందుకున్న డ్రగ్స్‌ను పెడ్లర్స్‌కు సరఫరా చేస్తున్నాడు. ఒక్కో గ్రాముకు రూ.500 చొప్పున కమీషన్ తీసుకుంటూ డెలివరీ ఇస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు నైజీరియన్లు ఇతడి బ్యాంకు ఖాతాలోకి రూ.13.24 లక్షల కమీషన్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇతడు ఐదు నెలల క్రితమే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు.
ఆమె బ్యాంకు ఖాతాలోకీ రూ.2.5 లక్షల కమీషన్ డిపాజిట్ చేయించాడు. ఇతడు గత ఏడు నెలల్లో 2.6 కేజీల కొకైన్ క్రయవిక్రయాలు చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వరుణ్ కుమార్‌కు తన వినియోగదారుడైన మధు ద్వారా గౌతమ్‌తో పరిచయం ఏర్పడింది. అలా ఈ దందాలోకి వచ్చిన ఇతడు నైజీరియన్ల నుంచి గ్రాము రూ.8 వేలకు ఖరీదు చేసి, రూ.12 వేలకు విక్రయిస్తున్నాడు. ఇలా ఆరు నెలల కాలంలో రూ.7 లక్షల వరకు ఆర్జించాడు.
నగరంలో 13 మంది...
వీరి దందాపై టీజీఏఎన్‌బీ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం హైదర్షాకోట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. అక్కడ ఎబుక, ఫ్రాంక్లిన్ మినహా మిగిలిన ఐదుగురూ చిక్కారు. వీరి నుంచి 199 గ్రాముల కొకైన్, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. ఈ పెడ్లర్స్ విచారణలో 13 మంది నగరవాసులు తమ నుంచి తరచూ డ్రగ్స్ ఖరీదు చేసి వినియోగిస్తున్నట్లు బయటపెట్టారు.
వీరిలో బంజారాహిల్స్‌కు చెందిన బిల్డర్ అనికేత్ రెడ్డి, కన్‌స్ట్రక్షన్ వ్యాపారి ప్రసాద్, సినీ నటుడు అమన్‌ప్రీత్ సింగ్, మాదాపూర్ వాసి మధుసూదన్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా... కొకైన్ వాడుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరిని అరెస్టు చేసిన అధికారులు పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నారు.
డ్రగ్స్‌పై సమాచారం తెలిస్తే 8712671111కు తెలపాలని కోరారు. ఎబుక, ఫ్రాంక్లిన్ సమాచారం అందిస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కాగా, సూత్రధారులిద్దరూ నైజీరియా పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment