గల్లీ గల్లీలో గంజాయి! | Ganja Drug use is on the rise in Telangana | Sakshi
Sakshi News home page

గల్లీ గల్లీలో గంజాయి!

Published Mon, Aug 5 2024 6:14 AM | Last Updated on Mon, Aug 5 2024 6:14 AM

Ganja Drug use is on the rise in Telangana

రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్య వినియోగం

స్కూళ్లు, కాలేజీలకూ విస్తరించిన మహమ్మారి 

సోషల్‌ మీడియా ద్వారా కూడా విక్రయాలు 

ఎక్కువగా బానిసలు అవుతున్నది యువకులు, విద్యార్థులే..

గత నెలలో పదుల సంఖ్యలో విద్యార్థులను పట్టుకున్న అధికారులు 

గంజాయి మత్తులో హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వైనం

దీని నియంత్రణపై సర్కారు ఫోకస్‌ చేయాలంటున్న సామాజికవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: సింబయోసిస్‌ కాలేజీలో 25 మంది.. గురునానక్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో 15 మంది.. ఉస్మానియా ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు ఆరుగురు.. జోగిపేట జేఎన్టీయూలోని విద్యార్థులు ముగ్గురు.. 

.. ఇదేదో మెడల్స్‌ గెల్చుకున్న వారి జాబితా కాదు.. గంజాయికి అలవాటు పడి గత నెలలో ‘యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (ఏఎన్‌బీ)’అధికారులకు పట్టుబడినవారి జాబితా. ఇంకా ఇలాంటి ఘటనలు మరెన్నో. ధర తక్కువ, లభ్యత ఎక్కువ అన్నట్టుగా గంజాయి విక్రయాలు సాగుతుండటంతో.. యువత, విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. ఈ ఏడాది జనవరి–జూన్‌ మధ్య డ్రగ్స్‌కు సంబంధించి రాష్ట్రంలో 938 కేసులు నమోదుకాగా.. 1,921 మంది అరెస్టయ్యారు. 

ఇందులో 816 కేసులు (86.99 శాతం), 1,649 మంది (85.84 శాతం) గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించినవే కావడం గమనార్హం. కేంద్రం ఆ«దీనంలో పనిచేసే నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ), డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాయంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

వివిధ రూపాల్లో వాడుతూ.. 
రాష్ట్రంలో గంజాయికి అలవాటుపడ్డ వారిలో చాలా మంది నేరుగా వాడుతుండగా.. కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చరస్, హషీష్‌ ఆయిల్, బంగ్‌ తదితర రూపాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైసూ్కల్, జూనియర్‌ కాలేజీ స్థాయిలో తొలుత సిగరెట్‌కు అలవాటు పడుతున్నారు. 

తర్వాత సొంతంగానో, స్నేహితుల ద్వారానో గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి విక్రయదారులు.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా అమ్ముతుండటంతో సులభంగా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గంజాయి నియంత్రణపై మరింత ఫోకస్‌ చేయాలని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఒడిశా నుంచి రాష్ట్రంలోకి.. 
గంజాయి ఎక్కువగా ఒడిశాలో సాగవుతోంది. అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి వస్తోంది. కొన్నిసార్లు ఆంధ్రా–ఒడిశా బోర్డర్‌ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన వాహనాలు, ఆరీ్టసీ/ప్రైవేట్‌ బస్సులతోపాటు రైళ్లల్లోనూ గంజాయి హైదరాబాద్‌కు చేరుతోంది. గాంజాతోపాటు పాట్, హష్, స్టఫ్, స్టాష్‌.. ఇలా పలు ప్రత్యేక పదాలతో దీని విక్రయాలు జరుగుతున్నాయి. 

కొకైన్, హెరాయిన్, ఎల్‌ఏస్‌డీ వంటి డ్రగ్స్‌ ఒక గ్రాముకు లేదా ఒక డోసుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు కావాలి. అదే గంజాయి రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచి్చస్తే 100 గ్రాములు దొరుకుతోంది. పైగా దీన్ని సిగరెట్‌ స్ట్రిప్‌లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు. 

ఇక ధనికవర్గాలకు చెందినవారు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కస్సోల్‌ ప్రాంతం నుంచి వచ్చే ఖరీదైన ప్రత్యేక గంజాయిని వినియోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చే గంజాయిలోనూ శీలావతి, గ్రీన్‌ రకాలకు డిమాండ్, రేటు ఎక్కువగా ఉంటుందని అంటున్నాయి.

ప్రాణాలు తీస్తున్న ‘గంజా’మత్తు!
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన పి.రాజు గంజాయికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే తన ఇంటి సమీపంలో నివసించే ఆరేళ్ల చిన్నారిని తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి పరారయ్యాడు. రాజు కోసం పోలీసుల గాలింపు చేపట్టడంతో.. వరంగల్‌ జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఖమ్మంలోని రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన ఉదయ్‌కుమార్‌ తన అమ్మమ్మ రాంబా యమ్మ దగ్గర ఉంటున్నాడు. పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఉదయ్‌.. డిప్లొమా లో చేరాక గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి కోసం డబ్బులు కావాలని అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఓ రోజు రాత్రి 11.30 గంటలకు హత్య చేశాడు. 

నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన నవీన్‌ గంజాయి మత్తులో ఓ వ్యక్తిపై గొడలితో దాడి చేసి చంపేశాడు. బెయిల్‌ వచ్చాక గంజాయి మత్తులో గ్రామస్తులతో ఘర్షణకు దిగడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. గ్రామంలో మంచి పేరున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీవ్‌ గంజాయికి బానిసగా మారడంతో.. ఆ ప్రభావం కుటుంబానికి చెందినవారందరిపై పడింది. 

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో ఆసిఫాబాద్‌ జిల్లాకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. పక్కన మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్నా బీహార్‌ వలస కూలీ వినోద్‌ మాజ్హి గంజాయి మత్తులో.. ఆ దంపతుల ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేశాడు. 

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని గోపాల్‌రావుపేటకు చెందిన సురేశ్‌ పద్దెనిమిదేళ్ల వయసులోనే గంజాయికి బానిసయ్యాడు. మితిమీరి గంజాయి తీసుకోవడంతో చనిపోయాడు.

వెంటనే బానిసలవుతారు 
మద్యం తాగేవాళ్లు కనీసం ఓ ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్లపాటు తాగుతూ ఉంటేనే.. దానికి బానిసలుగా మారుతారు. అదే గంజాయి విషయంలో కొన్నిరోజుల్లోనే బానిసలవుతారు. గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌కు గురవుతారు. కానీ దీని వినియోగం పెరిగిపోతే.. సైకోసిస్‌ సహా అనేక మానసిక రుగ్మతలు వస్తాయి. కొందరు హింసాత్మకంగా, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కారణంగానే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. 
– ప్రతాప్‌ రాజన్, క్లినికల్‌ సైకాలజిస్ట్‌

803 కిలోల గంజాయి పట్టివేత
రూ.2.81 కోట్ల విలువ ఉంటుందన్న పోలీసులు
శంషాబాద్‌ రూరల్‌: హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒక డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని బాలానగర్‌ ఎస్‌ఓటీ విభాగం, శంషాబాద్‌ పోలీసులు ఆదివారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. 

విశ్వసనీయ సమాచారం మేరకు.. పెద్ద గోల్కొండ శివారులో ఔటర్‌ రింగు రోడ్డుపై మాటువేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఒడిశాకు చెందిన కమిషన్‌ ఏజెంట్‌ సోమనాథ్‌ ఖార, డీసీఎం డ్రైవర్లు హెచ్‌ఎస్‌ విఠల్‌రెడ్డి, సంజీవ్‌కుమార్‌తోపాటు సునీల్‌ ఖోస్లా, జగ సునను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపు సూత్రధారులైన ఏపీలోని అరకు వాసి రాము, మహారాష్ట్ర వాసి సురేశ్‌ మారుతి పాటిల్‌ పరారీలో ఉన్నట్టు వివరించారు. 

తరలింపు ప్లాన్‌ ఇదీ.. 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అరకువాసి రాము గంజాయి సరఫరాదారు.. అతడి వద్ద సోమనాథ ఖార పనిచేస్తున్నాడు. వారు ఇటీవల డీసీఎం యజమాని విఠల్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్‌ పరిసరాల్లో గూడ్స్‌ డెలివరీ కోసం వస్తే తమకు చెప్పాలన్నారు. విఠల్‌రెడ్డికి గత నెల 30న పటాన్‌చెరు నుంచి వైజాగ్‌ సరకు తరలించే ఆర్డర్‌ వచ్చింది. ఆ సరుకును డెలివరీ చేశాక.. ఈ నెల 1న వైజాగ్‌లోని సెజ్‌లో ఉన్న ఓ కంపెనీ నుంచి కెమికల్‌ సాల్వెంట్స్‌ తీసుకుని బయలుదేరారు. మధ్యలో గంజాయి బస్తాలను నింపారు. సోమనాథ్‌ ఖార ముందు ఓ కారులో వెళ్తుండగా.. వెనకాల డీసీఎం వచ్చింది. గంజాయిని హైదరాబాద్‌లోని పటాన్‌చెరు వరకు తీసుకొచ్చి అక్కడ సురేశ్‌పాటిల్‌కు అప్పగిస్తే.. అతను వేరే వాహనంలో గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లేలా ప్లాన్‌ వేసుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement