
మన్యమా.. గంజాయి వనమా
పాడేరు : ఖాకీలు దూరని కారడవుల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగవుతోంది. సరిహద్దు ఒడిశా ప్రాంతంతో పాటు జిల్లాలోని పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో గంజాయి పండిస్తున్నారు. ఏటా ఆగస్టు నెలాఖరు నుంచి వీటి కోతలు ముమ్మరంగా సాగుతుంటాయి. అనంతరం ఆరబెట్టిన ఎండు గంజాయిని వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. ఎక్కువగా తమిళనాడు, కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. పెద్ద మొత్తంలో చెన్నై తరలుతున్నట్టు అంచనా. ఏవోబీతో పాటు సరిహద్దు ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల వైపు ఎక్సైజ్, సివిల్ పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. పోలీసు, ఎక్సైజ్ అధికారులు సమాచారం ఉంటేనే దాడులు చేస్తున్నారు.
మిగతా సమాయాల్లో గంజాయి రవాణా అవుతున్నా పట్టుకునే పరిస్థితి లేదు. కూంబింగ్ బృందాలు తిరుగుతున్నా వారి ధ్యాసంతా దళసభ్యులపైనే ఉంటోంది. దీనిని ఆసరాగా చేసుకుని తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల మీదుగా గంజాయి తరలిస్తున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా ఏజెన్సీలో గంజాయి అక్రమ రవాణాదారుల తీరు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది కళ్లుగప్పడానికి వీరు ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మారుమూల, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గత ఏడాది సాగు చేసిన గంజాయి నిల్వలు భారీగా ఉన్నాయి.
తమిళనాడు, కేరళ వ్యాపారులు స్థానికంగా మకాం వేసి, వినూత్న రీతుల్లో గంజాయిని రవాణా చేస్తున్నారు. మినీ వ్యాన్లకు అడుగున అరలు తయారు చేసి దాని నిండుగా గంజాయి ప్యాకెట్లను ఉంచి పైన సాధారణ సరుకుల మాదిరి ఉంచి తరలిస్తున్నారు. జిల్లాలోని పలువురు వ్యాపారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. దీంతో రేయింబవళ్లు పాడేరు, చింతపల్లి ఘాట్‌రోడ్లు, అరకులోయ మీదుగా మైదాన ప్రాంతాలకు కార్లు, వ్యాన్లు, జీపుల్లో రవాణా చేస్తూనే ఉన్నారు. కొత్తకొత్త కార్లు, వాహనాలను ఇందుకు ఉపయోగిస్తున్నారు.
ఇటీవల లంబసింగి, తాజంగి ఘాట్ ప్రాంతాల్లోనూ స్కార్పియో వాహనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఏజెన్సీలోని పర్యాటకం ముసుగులో కూడా గంజాయి వ్యాపారం జోరందుకుంది. మహిళలు సైతం గంజాయి రవాణాలో కీలకంగా మారుతున్నారు. మరోవైపు ఆయిల్ ట్యాంకర్లలోనూ గంజాయి రవాణా చేస్తున్న ముఠా ఏజెన్సీలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల ఆయిల్ ట్యాంకర్లు హుకుంపేట మండలంలోని మత్స్యగుండం వెళ్ళి గంజాయితో దర్జాగా మైదాన ప్రాంతాలకు వెళ్లినట్టు తెలిసింది. ఆయిల్ ట్యాంకర్లపై నిఘా లేక గంజాయి రవాణాకు మంచి రవాణా సాధనంగా మారింది. రాత్రి వేళల్లో గంజాయి వాహనాలు ఏజెన్సీలో అధికంగా సంచరిస్తున్నాయి. డబ్బు ఆశతో అమాయక గిరిజనులు గంజాయి రవాణా ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
తోటల ధ్వంసానికి వ్యూహం
ఏజెన్సీలోని గంజాయి సాగును పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు పోలీసుశాఖ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. మొక్కదశలోనే గంజాయిని తుంచేసే ఆలోచనలో పోలీసు అధికారులు ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుంది. రూరల్ ఎస్పీ కోయప్రవీణ్ ఇప్పటికే ఏజెన్సీ, ఏవోబీ ప్రాంతాల్లో సాగవుతున్న గంజాయి తోటలపై సమగ్ర నివేదికను సేకరించారు. గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా ఏజెన్సీతోపాటు మైదాన ప్రాంతాల్లోని వి.మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, గొలుగొండ, కేడీపేట, రావికమతం, కొత్తకోట, రోలుగుంట పోలీసు స్టేషన్ల పరిధిలో దాడులు ముమ్మరమయ్యాయి.
రోజు వారీ తనిఖీలను విస్తృతం చేశారు. ఎస్పీ కోయ ప్రవీణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏవోబీతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టి గంజాయి తోటల ధ్వంసానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు సహకారం కూడా తీసుకుంటున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండల కేంద్రాల్లో ఉండి పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ గంజాయి సాగును ప్రోత్సహిస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నారు. జి.మాడుగుల మండలం మద్దిగరువు, చింతపల్లి మండలం అన్నవరం, కోరుకొండ వారపుసంతల్లో భారీగా ఎరువుల అమ్మకాలను కూడా అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు.