తీరుమారని సెంట్రల్ జైలు
►ఖైదీల వద్ద దొరుకుతున్న సెల్‌ఫోన్లు
►గంజాయి తెస్తున్న కోర్టు ఖైదీలు
►నియంత్రణ శూన్యం
కోటగుమ్మం (రాజమండ్రి) : సంస్కరణలకు నిలయంగా ఆదర్శంగా ఉండాల్సిన సెంట్రల్ జైలు అంసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొందరు ఇక్కడ నుంచే తమ దందాలు నడుపుతున్నారు. దాంతో సెల్‌ఫోన్ల వినియోగం ఎక్కువైంది. వారికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 21వ తేదీన టవర్ వద్దగల 2ఏ బ్లాక్‌లో ఆల్తాఫ్ హుసేన్ బక్షీ అనే ఖైదీ వద్ద చైనా ఫోన్, రెండు ఛార్జర్లు, ఒక బ్యాటరీ దొరికాయి. రెండు రోజుల అనంతరం జరిగిన తనిఖీల్లో స్నేహా, గౌతమి బ్లాక్‌ల్లో సెల్ ఫోన్‌లు దొరికాయి.
అరకేజీ గంజాయితో దొరికిన ఖైదీ
చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్నపలివెల సత్తిబాబు అనే ఖైదీని ఒక కేసులో విచారణ కోసం ఈ నెల 26న ఆలమూరు కోర్టుకు తీసుకువెళ్లారు. తిరిగి జైల్‌లోకి తీసుకువచ్చేటప్పుడు జైలు గేటు వద్ద సిబ్బంది జరిపిన తనిఖీలలో సత్తిబాబు అండర్ వేర్‌లో పొట్లం కట్టిన అరకేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జైలులో గంజాయి సిగరెట్లకు విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్కొక్క సిగరెట్టు రూ 50, బీడీ రూ 25 చొప్పున అమ్ముతున్నారు. దీంతో కోర్టు విచారణకు వెళ్లిన ఖైదీలు తిరిగి జైలుకు వచ్చే సమయంలో గంజాయిని తీసుకు వస్తున్నారు. ఇలాగే మద్యం బాటిళ్లు కూడా సెంట్రల్ జైలులో దొరకడం సాధారణంగా మారింది.