గంజాయ్
భద్రతో హెచ్చరికలతో దాడులకు బ్రేక్
గంజాయి సాగుదారుల్లో ఉత్సాహం
విరమణ తాత్కాలికమే అంటున్న ఎక్సైజ్ అధికారులు
విశాఖపట్నం: భద్రతా కారణాల దృష్ట్యా ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు వెళ్ల డం సరికాదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించడంతో ఎక్సైజ్ అధికారులు గంజాయి దాడులు విరమించారు. ఏజెన్సీలో భారీగా సాగవుతున్న గంజాయి తోటలను ఎక్సై జ్ శాఖ అధికారులు కొద్ది రోజులుగా ధ్వంసం చేస్తు న్న విషయం తెలిసిందే. వరుసగా దాడులు చేసి వేలాది ఎరకాల్లో తోటలు గుర్తించారు. తోటల పెంపకం దారుల్లో కొందరిపై కేసులు నమోదు చేశారు. మరోవైపు మావోయిస్టుల కార్యకలాపాలు, బాక్సైట్ ఉద్యమాలతో మన్యం లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో ఎక్సైజ్ దాడులు భద్రతా కారణాల దృష్ట్యా సరికాదని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించడంతో దాడులు విరమించారు. ఈ పరిస్థితులు గంజాయి సాగుదారులకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గంజాయిపై వ్యాపారుల మక్కువ : ఏజెన్సీలోని పాడేరు, సీలేరు నదీపరీవాహక ప్రాంతాల్లో గంజాయి తోటల పెంపకం ఎక్కువగా జరుగుతోంది. జీకేవీధి, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టులతో పాటు ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు (ఏవోబీ)లో తోటల పెంపకం అధికంగా ఉంది. గంజాయికి అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ గిరాకీ ఉంది. కిలో రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకూ ధర పలుకుతోంది. దీంతో వ్యాపారులే గిరిజనులకు పెట్టుబడికి డబ్బులు ఇచ్చి గంజాయి సాగు చేయిస్తున్నారు. ఏటా దాదాపు రూ.100 కోట్ల పైగానే టర్నోవర్ ఉన్న గంజాయి వ్యాపారాన్ని వదులుకోవడానికి వ్యాపారులు సిద్ధంగా లేరు. దీంతో తోటల ధ్వంసానికి వెళ్లిన అధికారులపైకి గిరిజనులను దాడులకు ఉసిగొలుపుతున్నారు.
భద్రతకు భయపడి..
గంజాయి తోటలపై దాడులు చేసి ధ్వంసం చేయడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి. సాధారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు గంజాయి రవాణాపైనే ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. తోటలు సాగవుతున్న ప్రాంతాలకు వెళ్లేందుకు సాహసించరు. దీంతో ఏటా తోటలపై జరిగే దాడులు నామమాత్రంగానే ఉంటున్నాయి. గతేడాది 4 తోటలపై దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు. ఈ ఏడాది తొలిసారిగా పాడేరు మండలంలోని గొండెలి పంచాయతీ లింగాపుట్టు, చీడిమెట్ట గ్రామాల పరిసరాల్లో కొన్ని తోటలు ధ్వంసం చేశారు. అది కూడా రహదారికి దగ్గరగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడా ప్రతిఘటన ఎదురవడంతో సీఆర్‌పీఎఫ్ బలగాల రక్షణ తీసుకుని ఎలాగో బయటపడ్డారు.
దాడుల్లో వెలుగుచూసిన ప్రముఖుల పేర్లు!
ఏజెన్సీ 11 మండలాలల్లోని 9 మండలాల్లో, 150 గ్రామాల్లో గంజాయి భారీగా సాగవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం వేలాది ఎకరాల్లో 6వేల టన్నుల గంజాయిని ఏటా పండిస్తున్నారు. కానీ ఎప్పుడూ అమాయక గిరిజనులే పట్టుబడుతుంటారు తప్ప అసలు వాళ్లు తప్పించుకుంటూనే ఉంటారు. అయితే ఈ దాడుల వల్ల ఎక్సైజ్ అధికారులకు కొన్ని వాస్తవాలు తెలిసినట్లు సమాచారం. గంజాయి సాగు, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న కొందరు ప్రముఖుల పేర్లు ఈ దాడుల్లో బయటపడినట్లు తెలిసింది. వారిపై ఎక్సైజ్ అధికారులు నిఘా ఉంచడంతో పాటు పూర్తి వివరాలపై కూపీ లాగే పనిలో ఉన్నారు.
మళ్లీ మొదలెడతాం
గంజాయి తోటలపై దాడులు నిర్వహించి లింగపుట్టులో 7.7 ఎకరాల ప్రైవేటు, చీడిమెట్టలో 23.74 ఎకరాల ప్రభుత్వ భూముల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించాం. తొమ్మిది మందిపై 12 కేసులు నమెదు చేశాం. ఒకరిని అరెస్ట్ చేశాం. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గిరిజనులు ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి సమయంలో దాడులు చేస్తే వారు మరింతగా ఆగ్రహం చెందే అవకాశం ఉందని అక్కడి భద్రతా బలగాలు చెప్పడంతో దాడులు తాత్కాలికంగా నిలిపివేశాం. త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తాం. -సి.వివేకానందరెడ్డి,
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, విశాఖపట్నం