CM Jagan Mandates SEB On Eradication Of Illicit Liquor And Cannabis, Details Inside - Sakshi
Sakshi News home page

‘పరివర్తన’ ఫలించేలా

Published Tue, Nov 15 2022 4:16 AM | Last Updated on Tue, Nov 15 2022 9:57 AM

CM Jagan Mandates SEB on eradication of illicit liquor and cannabis - Sakshi

సాక్షి, అమరావతి: గంజాయి సాగు, అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టి కేసుల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్‌ఈబీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉపాధి మార్గాలు చూపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ఎక్సైజ్, అటవీ, గనులు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

అటు ఉక్కుపాదం.. ఇటు ఉపాధితో ఊతం
పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. చేయూత, ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ఆదాయం సమకూరే దిశగా ఉపాధి చూపాలని నిర్దేశించారు. అప్పుడే అక్రమ మద్యం తయారీ లాంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనతోపాటు ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా అర్హులు మిగిలిపోతే తనిఖీ చేసి వారికి కూడా ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు అందించాలని ఆదేశించారు. తద్వారా పట్టాలు అందుకున్న రైతులకు రైతు భరోసా సాయం లభిస్తుందన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వచ్చి అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపులు 
పన్ను చెల్లింపులకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు వివరించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అవగాహన పెంపొందించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందుతాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై..
రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షిస్తూ శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న చోట్ల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలపై విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎలాంటి డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అప్‌గ్రేడ్‌ చేయాలని ఆదేశించారు.

నిర్వహణలో లేని గనులపై దృష్టి
గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా నిర్వహణలో లేని గనులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సూచించారు. సమీక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్‌ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మద్యం అమ్మకాలు తగ్గాయి
గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం జగన్‌ వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించడం, పర్మిట్‌ రూమ్‌ల రద్దు లాంటి పలు చర్యల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని చెప్పారు. దీంతో పాటు మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేందుకు షాక్‌ కొట్టేలా రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పరివర్తన కార్యక్రమం అమలు తీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement