గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను ఎక్సైజ్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు...తంజావూరుకు చెందిన ఉమ, మధురైకు చెందిన పొన్నమ్మ కొంతకాలంగా గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి నెల్లూరులో విక్రయిస్తున్నారు. శనివారం నగరంలో తనిఖీలు చేపట్టిన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎం వీరాస్వామి స్టోన్‌హౌస్‌పేట వంతెన వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమ, పొన్నమ్మను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా, రూ.1.50లక్షలు విలువ చేసే 23 కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. దీంతో గంజాయిని స్వాధీ నం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు రాఘవయ్య, అనిత, రమణయ్య, హెడ్‌కానిస్టేబుల్ సాయినాథ్, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, ఎస్ రాఘవయ్య, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.