
గంజాయితో పట్టుబడిన విద్యార్థులు
ఒకరు విదేశీయుడు, ఇద్దరు అస్సాం, ఒకరు మేఘాలయ
30 ప్యాకెట్లు స్వాధీనం
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ సమీపంలో గల ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి ప్యాకెట్లతో బుధవారం మధ్యాహ్నం పట్టుపడ్డారు. ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 30 ప్యాకెట్ల గంజాయిని (1100 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు విదేశీ విద్యార్థి కాగా ఇద్దరు అస్సాం, ఒకరు మేఘాలయ, మిగతావారు తెలంగాణకు చెందిన వారున్నారు. గురువారం ఏసీపీ మల్లారెడ్డి, సీఐ స్వామి కేసు వివరాలను వెల్లడించారు.
ఇంజనీరింగ్ కళా శాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువు తున్న విద్యార్థులు కళాశాల ఎదుట ఉన్న గ్రీన్ సిటీ వెంచర్ వద్ద ఒక కారులో గంజాయిని సేవిస్తున్నారు. అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు నిలిపివున్న కారు వద్దకు వచ్చి అనుమానంతో ప్రశ్నించారు. తడబడుతూ సమాధానం ఇవ్వడంతో పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద ఐదు ప్యాకెట్ల గంజాయి లభించింది. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి గుట్టురట్టయింది.
వీరికి కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఏపీలోని అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి అంద జేస్తున్నట్టు తేలింది. కళాశాల విద్యార్థులకు 50 గ్రాముల గంజాయి ప్యాకెట్టు రూ.500లకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇబ్రహీంపట్నంలోని విద్యార్థుల గది నుంచి మరో 25 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.