ఈ నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 220 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
రేపటినుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లావ్యాప్తంగా 220 పరీక్ష కేంద్రాలు
సెంటర్ సమీపంలో 144 సెక్షన్ అమలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈ నెల 12 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 220 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందు లో 96 కేంద్రాలు గ్రామీణ ప్రాంతంలో, 124 కేంద్రాలు పట్టణ ప్రాంతం లో ఉన్నాయి. పరీక్షలకు హాజరయ్యే వారిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 99,392 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 1,01,357 మంది ఉన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.
విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష సమయానికి అరగంట ముందే కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష సమయం నుంచి పదిహేను నిమిషాల తర్వాత కేంద్రంలోకి అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టిక్కెట్లు పంపిణీ చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకుడు ప్రతాప్ వెల్లడించారు.