
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షలకు అనుమతించబోమని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసే ఈ నిబంధనను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టును అభ్యర్థించారు. భోజన విరామ సమయంలో పిల్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. బుధవారం విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం స్పష్టం చేసింది.
విద్యార్థులు కొద్ది నిమిషాలు ఆలస్యంగా పరీక్షకు హాజరైతే పరీక్షలు రాసేందుకు అనుమతించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసే ఈ నిబంధనను రద్దు చేయాలని, సమయ పాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలేగానీ, ఇలాంటి షరతు విధించి ఏడాది చదువును పణంగా పెట్టేలా చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment