
వెంకటేశ్ (ఫైల్), శ్రీశాంత్ మృతదేహం
ఆమనగల్లు, చేవెళ్ల : తల్లిదండ్రులు మందలించడంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు, ఆమనగల్లులో బుధవారం ఈ ఘటనలు జరిగాయి. ఆమనగల్లులోని గాంధీనగర్ కాలనీకి చెందిన పార్థసారథి కుమారుడు శ్రీశాంత్ స్థానికంగా ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శ్రీశాంత్ హోంవర్క్ చేయలేదని తల్లిదండ్రుల దృష్టికి ఉపాధ్యాయులు తీసుకువెళ్లారు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల భోజన విరామ సమయంలో శ్రీశాంత్ ఇంటికి భోజనం కోసం వెళ్లాడు. ఎంతకీ పాఠశాలకు రాకపోవడంతో పాఠశాల వద్ద దుకాణం నిర్వహిస్తున్న తల్లి వెంటనే ఇంటికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లిచూడగా కుమారుడు ఉరివేసుకుని కనిపించాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన కడ్మురి మల్లయ్య కుమారుడు వెంకటేశ్ (16) చేవెళ్లలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వెంకటేశ్ కళాశాలకు సక్రమంగా వెళ్లడం లేదని తెలియడంతో బుధవారం ఉదయం తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ బహిర్భూమికి వెళ్తున్నానని చెప్పి గ్రామ సమీపంలోకి వెళ్లి ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment