జోరుగా గంజాయి దందా
Published Tue, Feb 28 2017 9:12 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
► కృష్ణపట్టెలో మిర్చి తోటల్లో సాగు
► ఆంధ్రా ప్రాంతంతోపాటు మిర్యాలగూడ, దేవరకొండలోవిక్రయాలు
► మత్తుతో చిత్తవుతున్న యువత
మిర్యాలగూడ :
మిర్యాలగూడ డివిజన్‌లో గంజాయి దందా జోరుగా సాగుతోంది. డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె ఏరియాలో మిర్చి తోటలతో పాటు గట్ల మధ్యలో గుట్టు చప్పుడుకాకుండా సాగు చేస్తున్నారు. గంజాయి మొక్కలు పెంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా గంజాయి మత్తుతో యువత చిత్తవుతోంది. డివిజన్ పరిధిలోని కృష్ణపట్టె మండలాలైన దామరచర్ల, అడవిదేవులపల్లి, పెద్దవూర, తిర్మలగిరి సాగర్ ప్రాంతాల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. సాధారణంగా మొక్కలు తెలిసిన వ్యక్తులు మాత్రమే దానిని గుర్తించే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులు గుర్తించే అవకాశం లేకపోవడం వల్ల మిర్చి తోటలు, బంతి పూల తోటలో, గట్ల మధ్యలో పెంచుతున్నారు. ఏపుగా పెరిగిన గంజాయి మొక్కలు ఎండబెట్టి పొడిచేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు
గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న రైతులు ఆంధ్రాప్రాంతంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, మల్లేపల్లిలో విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం. ఎండబెట్టిన గంజాయి పొడిని సాధారణ వ్యక్తుల మాదిరిగానే పొట్లాలు కట్టుకొని వచ్చి మిర్యాలగూడలోని రైల్వేస్టేషన్ సమీపంలో విక్రయాలు చేపడుతున్నారు. ఒక్క గంజాయి మొక్క 10 వేల రూపాయల నుంచి సుమారుగా 50 వేల రూపాయల వరకు ఆదాయం తెచ్చిపెడుతుంది. ఖర్చు లేకుండా ఆదాయం వస్తున్నందున గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్నారు.
ఇటీవల వెలుగుచూసిన సంఘటనలివే
గంజాయి మొక్కలు పెంచుతూ పోలీసులకు చిక్కడంతో కేసులు నమోదు చేశారు. డివిజన్ పరిధిలో ఎక్కువగా దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లోనే గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుపడ్డారు. ఇటీవల అడవిదేవులపల్లి మండలం ముల్కచర్ల పంచాయతీ పరిధిలోని కుర్రతండాలో గంజాయి మొక్కలు పెంచుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దాడులు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అదే విధంగా గతంలో దామరచర్ల మండలం నర్సాపురం పరిధిలో మిర్చి తోటల్లో పెంచుతున్న గంజాయి మొక్కలను రెండు పర్యాయాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సమాచారం ఇస్తే పట్టుకుంటాం
గతంలో గంజాయి విక్రయాలు ఎక్కవగా ఉండేది. ప్రస్తుతం తగ్గింది. మిర్యాలగూడలో విక్రయాలు చేపడుతున్నట్లు సమాచారం లేదు. ఒక వేళ ఇక్కడ గంజాయి విక్రయాలు చేపడుతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. అదే విధంగా కృష్ణపట్టె ఏరియాలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం వచ్చినా దాడులు నిర్వహిస్తాం. – రాంగోపాల్‌రావు, డీఎస్పీ, మిర్యాలగూడ
Advertisement
Advertisement