ఆయుధాలు కావాలే... | we want Weapons | Sakshi
Sakshi News home page

ఆయుధాలు కావాలే...

Published Mon, Sep 22 2014 1:51 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

we want Weapons

సర్కారుకు ఎక్సైజ్‌శాఖ ప్రతిపాదనలు
ప్రభుత్వానికి డిప్యూటీ కమిషనర్ లేఖ
స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకోవడానికే.. త్వరలోనే పచ్చజెండా..?

 
 నిజామాబాద్ క్రైం:

సంఘ విద్రోహశక్తుల కార్యకలాపాలు ఎక్సైజ్‌శాఖకు సవాల్‌గా మారాయి. స్మగ్లర్ల చర్యలు ఎక్సైజ్ అధికారులను ఆయుధాల కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించేలా చేశాయి. నాటుసారా, గంజాయి సాగు నియంత్రణపై దృష్టిసారించిన ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఆయుధాల కోసం ప్రభుత్వానికి లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది.

తప్పనిసరై...

జిల్లాలో గుడుంబా తయారీ, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ఆయుధాలు తప్పనిసరిగా ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో అక్రమ సారా, గుడుంబా, గంజాయి, కల్తీకల్లును అరికట్టేందుకు, బెల్ట్‌షాపు, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం అమ్మకాలను నిరోదించేందుకు జిల్లా అబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలో అటవీ ప్రాంతాలలో గంజాయి పంట సాగుచేస్తున్నారు. అక్కడి నుంచి మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు రవాణా జరుగుతోంది. దీనిని అరికట్టేందుకు చర్యలకు ఎక్సైజ్ శాఖ ఉపక్రమించబోతోంది.  స్మగ్లర్ల నుంచి ఎదురయ్యే ముప్పునుంచి తప్పించుకునేందుకు ఆయుధాలు అవసరమని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.ఆయుధాల కోసం ఐదేళ్లుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నారు. కాని ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
 
మళ్లీ తెరపైకి ...


తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్‌శాఖను మరింత పటిష్ట పరచాలనే ఉద్దేశంతో ఉంది. అందుకు కావాల్సిన చర్యలను చేపట్టింది. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో ఎక్సైజ్ మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఎక్సైజ్ శాఖకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని, గతంలో ఎక్సైజ్ శాఖకు రివాల్వర్‌లు, మస్కట్ తుపాకులు ఇచ్చిన మాదిరిగానే ఇప్పుడు ఆయుధాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయుధాల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నక్సలైట్ల ప్రభావం పేరిట 1982 నుంచి ఆయుధాలు, వాకి టాకీలను దశల వారీగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం, తిరిగి ఆయుధాలను ఇచ్చే ప్రతిపాదనలను పట్టించుకోలేదు. నక్సలై ట్ల ప్రాబల్యం పెరగడంతో క్రమేపీ ఆయుధాలను తగ్గించారు. అయితే ఇటీవల నాటుసారా, గంజాయి సరఫరా చేసేవారి ఆగడాలు పెరిగిపోతుండటంతో ఆయుధాలు తప్పనిసరని భావించారు.

గంగయ్య హత్యతో...

గతేడాది సెప్టెంబరు 14న ఇందల్‌వాయి ఫారె స్టు రేంజ్ ఆఫీసర్(ఎఫ్‌ఆర్‌ఓ) గంగయ్యను ధర్పల్లి మండలం నల్లవెల్లి శివారులోని అటవీ ప్రాంతంలో భూఆక్రమణదారులు దారుణంగా హత్యచేశారు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి అటవీ శాఖ,ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గంగయ్య వద్ద ఆయుధం ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఈ శాఖ అధికారులు భావించారు. ఈ సంఘటన  ఎక్సైజ్ శాఖలో పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆయుధాల కోసం పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. ఇప్పుడు ప్రభుత్వమే ఆయుధాల విషయం తెరపైకి తీసుకురావటంతో ఈ సారైన తమ చేతికి అందుతాయని అధికారులు భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ప్రస్తుతం నక్సలైట్ల ప్రాబల్యం లేకపోవచ్చుగాని, గంజాయి, నాటుసారా కాచే వారినుంచి ఏదైనా ముప్పు వస్తే ఎదుర్కోడానికి ఆయుధాలు తప్పనిసరని ఆ శాఖ భావిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ప్రతిపాదనలు ఇవి..

ఆయుధాలు కావాలంటూ ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ అరుణ్‌రావు ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు చేశారు. డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండె ంట్ల పర్యవేక్షణలో 10 ఎకై ్సజ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 16 మంది సీఐలు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తుండగా, 25 మంది ఎస్‌ఐలు విధులు నిర్వహిస్తున్నారు. సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులకు రివాల్వర్లు, పిస్టళ్లు, కిందిస్థాయి సిబ్బందికి రైఫిల్స్ కావాలని డిప్యూటీ కమిషనర్ లేఖలో కోరారు. డీసీ ఆయుధాల కోసం కోరిన వాటిలో రైఫిల్స్ 14, రౌండ్స్ 150, రివాల్వర్లు 15, రౌండ్స్ 77 కావాలని ప్రతిపాదించారు.
 
గతంలో...


మద్యపాన నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఎకై ్సజ్ పోలీసులకు ప్రతి స్టేషన్‌కు ఐదు 0.410 మస్కట్ తుపాకులు, 300 బుల్టెట్లను ప్రభుత్వ అందజేసింది. వీటిని వాడుకుంటుండగా అబ్కారీశాఖ 1997లో మద్యపాన నిషేధం ఎత్తివేసింది. ఆ ఆయుధాలకు భద్రత లేదన్న కారణంతో జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ విభాగానికి అప్పగించారు. అయితే ఇటీవల మద్యం మాఫియా ఆగడాలు పెరిగాయి. గుడుంబా, అక్రమ మద్యం తదితర నేరాలను అరికట్టేందుకు అబ్కారీ అధికారులకు ఆయుధాలు అవసరం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయుధాల కోసం డిప్యూటీ కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement