
గుప్పుమన్న గంజాయి...
- జిల్లాలో వేర్వేరు చోట్ల 332 కిలోల పట్టివేత
- ఏడుగురి అరెస్టు
విశాఖ మన్యంలో గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలించుకుపోవడానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే కాదు ఉత్తరభారతంలోని హర్యానా వంటి రాష్ట్రాలకు చెందినవారూ విఫలయత్నం చేశారు. నిఘా కన్నుగప్పి గుట్టుగా సాగుతున్న ఈ మత్తు వ్యవహారంపై అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం నుంచే చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టారు. ఫలితంగా జిల్లాలో పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడింది. దీన్ని తరలిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
నర్సీపట్నం టౌన్: సుమారు రూ. 15 లక్షల విలులైన 252 కిలోల గంజాయిని సోమవారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ జగన్‌మోహన్‌రావు కథనం ప్రకారం... అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం ఉదయం చింతపల్లి రోడ్డులోని ఏటిగైరంపేట చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఒక సుమో వాహనంలో గంజాయి బయటపడింది.
ఈ గంజాయిని తరలిస్తున్న హైదరాబాద్‌కు చెందిన షేక్ కమాల్ (32), పగడాల ప్రకాశ్ (40)లను అదుపులోకి తీసుకొని ఎక్సైజ్ పోలీసులు విచారించారు. లంబసింగి ప్రాంతంలో ఈ సరకు కొనుగోలుచేసి, హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. దీంతో వారిద్దర్నీ అరెస్టు చేశారు. ఈ గంజాయి విక్రయదారుల వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని జగన్‌మోహన్‌రావు తెలిపారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. సోమవారం తనిఖీల్లో ఎస్సై శ్రీనివాసరెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు.
అరకు రూరల్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళ సహా ముగ్గుర్ని అరకులోయ పోలీసులు పట్టుకున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతానికి చెందిన బల్‌కర్‌సింగ్ (39), రాజ్‌కుమార్ (45)లతో పాటు హర్‌ప్రీత్ (33) అనే మహిళ డుంబ్రిగుడ మండలం చాపరాయి వద్ద 22 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. దాన్ని ఆర్టీసీ బస్సులో తీసుకొస్తూ సోమవారం అరకులోయ నాలుగు రోడ్ల కూడలిలో దిగారు. అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సీహెచ్ సోమయ్య వారిని ప్రశ్నించారు. దీంతో హర్‌ప్రీత్ అక్కడి నుంచి పరుగుతీయడంతో ఆటోవాలా సహాయం ఆమెను పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. పోలీసులు వారిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు.
చోడవరం టౌన్ : చోడవరంలో సుమారు రూ. 1.80 లక్షల విలువైన 36 కిలోల గంజాయి దొరికింది. చోడవరంలో సోమవారం ఎస్సై ఎ.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు ఒక ఆటోను పక్కగా నిలిపేసి జారుకున్నారు. పోలీసులు దాన్ని పరిశీలించగా, ఇంజిన్, బోనెట్‌లో 36 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
జి.మాడుగుల: చింతపల్లి మండలం కుడుములసారి గ్రామానికి చెందిన కొర్రా రాజారావు రూ. 25 వేల విలువైన 12 కిలోల గంజాయిని విశాఖపట్నానికి తీసుకెళ్లేందుకు సోమవారం సాయంత్రం జి.మాడుగుల బస్టాండ్‌కు రాగా, పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, కేసు నమో దు చేసినట్లు జి.మాడుగుల పీఎస్ ఎస్సై శేఖరం తెలిపారు.
అనకాపల్లి రూరల్: గంజాయిని తరలిస్తున్న అనకాపల్లి మండలంలోని కె.ఎన్.ఆర్.పేటకు చెందిన పూడి బాజ్జీ అనే వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి ఎస్సై కోటేశ్వరావు తెలిపారు. నిందితుడు బాబ్జీ వద్ద పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.