కోర్టు ఆదేశాల మేరకు తుక్కాపురంలో కాల్చేసిన రైల్వే పోలీసులు
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం రూ.4 కోట్ల విలువైన 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఈ గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని దశల వారీగా తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలోని బాయిలర్‌లో వేసి దహనం చేశారు. సికింద్రాబాద్ అర్బన్ పరిధిలో రూ.1,44,75,000 విలువ చేసే 579 కిలోల గంజాయి, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో రూ.24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయి, ఖాజీపేట డివిజన్‌లో రూ.2.24 లక్షల విలువ చేసే 896.70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ వివరించారు.
ఆస్తులు జప్తు చేస్తాం
ఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి గంజాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులతో రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులు పెడితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆమె వెంట రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావేద్ అలీ, టి.కృపాకర్, ఇన్‌స్పెక్టర్లు, జీఆర్‌పీ పోలీసులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment