తాడేపల్లి: మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ వెనుక ప్రాంతంలో గంజాయి తాగే యువకులు ఆగడాలు చేస్తూ స్థానికంగా ఉండే మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా వారిని ప్రశ్నిస్తే చేపల వేటకు వెళుతున్నాం మీకెందుకు అంటూ వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు ఫుల్‌గా గంజాయి తాగి బకింగ్‌హామ్ కెనాల్ వద్ద ఉన్న ఓ ఇంటి తలుపు కొట్టగా ఓ మహిళ తలుపు తీసింది.
సదరు యువకుడు మీ ఇంట్లో పడుకుంటాను. నన్ను లోపలికి రానీయండి అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మహిళ సదరు యువకుడ్ని బయటకు తోసి తలుపులు వేసి భర్తకు, పక్కింటి వారికి ఫోన్ చేసింది. వేరే చోట ఉన్న భర్త హడావుడిగా ఇంటికి వచ్చేసరికి గంజాయి మత్తులో ఉన్న యువకుడు ఇంటిముందు నానా రచ్చ చేస్తున్నాడు. పక్కనే నివసించేవారు వచ్చేటప్పటికి తలుపు తీయాలంటూ గట్టిగట్టిగా కొట్టడంతో వారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేసి పడుకోనివ్వరా అంటూ నానా యాగీ చేశాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు వందలాది మంది యువకులు చేపలవేట పేరుతో బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున కూర్చుని మద్యం, గంజాయి తాగి అక్కడకు వచ్చే మహిళలను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతున్న వారిని స్థానికులు ఆపి ప్రశ్నించారు. మాది ప్రకాష్‌నగర్, మేము ఇటు వస్తాం ఏం చేస్తారో చేసుకోండి అంటూ బూతులు తిట్టడంతో ఆ ప్రాంత మహిళలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క మత్స్యకారుడిని తప్ప ఎవరినీ అనుమతించమంటూ మహిళలకు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment