
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు : కుమారుడి పేరిట వచ్చిన కొరియర్ బాక్స్‌లో ఉన్నది గంజాయని తెలిసి షాక్ తిన్నాడో తండ్రి. పిల్లాడి జీవితం పాడవకూడదన్న ఆలోచనతో పోలీసులను ఆశ్రయించి, గంజాయి పంపిన వ్యక్తిని కటకటాల వెనక్కు నెట్టించాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరు, సదాశివనగర్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యాపారవేత్తకు 9వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల క్రితం అతడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పిల్లాడి పేరిట ఓ కొరియర్ వచ్చింది. దాన్ని అతడి తండ్రి తీసుకుని తెరిచి చూశాడు. దాంట్లో గోధుమ రంగులో ఉన్న పొడి కనిపించింది. అనుమానం వచ్చిన ఆ వ్యాపార వేత్త వెంటనే స్నేహితుడికి ఫోన్ చేశాడు. అనంతరం సదరు స్నేహితుడికి ఆ పొడిని ఫొటో తీసి వాట్సాప్‌లో పంపాడు. ( కన్నింగ్ కపుల్: పూజారులే టార్గెట్ )
ఆ వ్యక్తి దాన్ని గంజాయి పొడిగా గుర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన వ్యాపారవేత్త వెంటనే సదాశివనగర్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ పార్శిల్ ఎమ్‌జీ రోడ్‌నుంచి వచ్చిందని గుర్తించారు. ఆ వ్యాపార వేత్త కొరియర్ ఆఫీసుకు వెళ్లి కొరియర్ పంపిన వ్యక్తి వివరాలు అడగగా వారు నిరాకరించారు. దీంతో ఈ నెల 21న అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, పార్శిల్ పంపిన ధీరజ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment