గంజాయిని చూపిస్తున్న డీసీపీ సుదర్శన్‌గౌడ్
సాక్షి, పెద్దపల్లి : ఓ యువకుడు డిప్లొమా ఫైనల్ ఇయర్.. మరొకరు ఇంటర్.. ఇంకొకరు ఇంటర్ పూర్తిచేసి డిగ్రీలో చేరాడు. ఈ ముగ్గురు కలిసి గంజాయి దందా చేస్తూ గురువారం పెద్దపల్లి పోలీసులకు చిక్కారు. గోదావరిఖనికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి చేస్తున్న దందా చూసి పోలీస్ అధికారులు నివ్వెరపోయారు. డీసీపీ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కోండం ప్రదీప్‌రెడ్డి(19), బత్తుల శివకుమార్(19), మరో మైనర్.. ముగ్గురు కలిసి కొంతకాలంగా గంజాయి కొనుగోలు చేసి తోటి స్నేహితులకు విక్రయిస్తున్నారు.
ఈ విషయం కనిపెట్టిన పెద్దపల్లి ఎస్సై ఉపేందర్‌రావు పెద్దకల్వల స్టేజీ వద్ద ముగ్గురు యువకులను సోదా చేయగా మూడు పాలిథిన్ కవర్లలో 750గ్రా. గంజాయి లభించింది. ముగ్గురు విద్యార్థులే కావడంతో ఎవరికీ అనుమానం కలగలేదని, కొంతకాలంగా వారు చేస్తున్న దందా పోలీసుల దృష్టికి రావడంతో నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు. గోదావరిఖనితో పాటు ఇతర ప్రాంతాల్లో ఆ ముగ్గురి నుంచి గంజాయి కొనుగోళ్లు చేసినవారితో పాటు వ్యాపారానికి సంబంధాలు ఉన్నవారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ వెంకటరమణారెడ్డి, సీఐ నరేందర్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు.
పిల్లలను కాపాడుకోవాల్సింది తల్లిదండ్రులే..
కళాశాలలకు వెళ్తున్న పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం తల్లిదండ్రులు గమనించకపోతే చేజారిపోయే ప్రమాదముందని డీసీపీ సుదర్శన్‌గౌడ్ హెచ్చరించారు. పిల్లలు మాదకద్రవ్యాలకు అలవాటుపడుతున్నారని, దీంతో వారి జీవితం పూర్తిగా దుర్భరమవుతుందన్నారు. సకాలంలో ఇంటికి వస్తున్నారా లేదా అనేది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందన్నారు.
సింగరేణి కోల్‌బెల్టు ప్రాంతంలో ఇలాంటి దారి తప్పిన పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని ఆందోళన చెందారు. మాదకద్రవ్యాల కేసులో అరెస్టైన వారికి కోర్టు 20ఏళ్ల జైలుశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు. గంజాయి అమ్మకం వ్యాపారంలో పోలీసులకు చిక్కినవారిపై పిడీయాక్టు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులే పిల్లలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment