కర్ణాటక: సమాజంలో ఆదర్శంగా ఉండవలసిన మెడికోలు పెడతోవ పట్టారు. ముగ్గురు వైద్య విద్యార్థులు గంజాయికి బానిసై తమ అద్దె ఇంట్లో ఆ మొక్కల పెంపకం చేపట్టారు. పైగా గంజాయిని విక్రయిస్తూ చివరికి కటకటాల పాలయ్యారు.
ఈ సంఘటన శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి పట్టణానికి చెందిన విఘ్నరాజ్ (28), ధర్మపురి కడగత్తూరుకు చెందిన పాండిదొరై (27), కేరళలోని ఇడుక్కివాసి వినోద్ కుమార్ (27) నిందితులు. వీరు ముగ్గురూ శివమొగ్గ నగరంలోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. విఘ్నరాజ్ గంజాయి మొక్కలను తీసుకుని వచ్చినట్లు తెలిసింది.
గంజాయి విక్రయాలు
శివగంగా లేఔట్‌లో అద్దె ఇంటిలో కుండీలో మొక్కలను పెంచసాగాడు. మొక్కలను ఎండబెట్టి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వినోద్, పాండి దొరైతో కలిసి విక్రయించడం ప్రారంభించారు. ఈ వ్యవహారం తెలియడంతో శివమొగ్గ గ్రామీణ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి 227 గ్రాముల ఎండు గంజాయిని, అలాగే ఇంట్లో 1.5 కేజీల బరువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 10గ్రాముల చరస్, గంజాయి గింజలను, గంజాయి నూనె కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురినీ అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment