
గంజాయిపై ఉమ్మడి దెబ్బ
ఏజెన్సీలో విస్తృత దాడులకు ఎక్సైజ్, పోలీసుశాఖల శ్రీకారం
తొలి ప్రయత్నం విజయవంతం
గంజాయి సాగుపై ఎట్టకేలకు అధికారులు ఉక్కుపాదం మోపారు. గంజాయి సాగుకు, రవాణాకు ఏజెన్సీ పెట్టింది పేరు. ఏటా కోట్లాది రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలిసినా వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, సిబ్బంది కొరత కారణంగా ఇంతవరకు గంజాయి వ్యాపారులదే పైచేయిగా ఉంది. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా దృష్టి సారించారు. ఎక్సైజ్, పోలీస్, అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీలో శనివారం ఎక్సైజ్, పోలీస్‌ల ఉమ్మడి ఆపరేషన్ సక్సెస్ అయింది. మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నారు.
పాడేరు: విశాఖ ఏజెన్సీ, ఆంధ్రా-ఒడిశా సరి హద్దు ప్రాంతంలో విస్తారంగా సాగవుతు న్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలు శ్రీకారం చుట్టాయి. జీకేవీధి, చిం తపల్లి, జి.మాడుగుల, పాడేరు, పెదబ యలు, ముంచంగిపుట్టు మండలాల్లోని మారుమూల ప్రాంతాలతో పాటు సీలేరు నదీ పరివాహక ప్రాంతం, ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో ఏటా వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. గిరిజనులకు డబ్బు ఆశ చూపి కేరళ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. దీంతో మారుమూల గిరిజనులంతా నీటి నిల్వలు అందుబాటులో ఉన్న రిజర్వు ఫారెస్టు, బంజరు భూముల్లో గంజాయి సాగును ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇక్కడ సాగైన గంజాయిని ఒడిశా, తమిళనాడు, కేరళ, గోవా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లలో గంజాయి వ్యాపారం చేపడుతున్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉపయోగిస్తూ నాణ్యమైన శీలవతి రకం గంజాయిని ఏజెన్సీలో సాగు చేస్తున్నారు. ఏటా అక్టోబరు నెలలో గంజాయి సాగును చేపడుతుండటగా జనవరి, ఫిబ్రవరి నెలలు నాటికి దిగుబడి దశకు చేరుకుంటుంది. ఈ గంజాయి తోటలకు రోజువారీ సంరక్షణ కూడా భారీగానే సొమ్ము ఖర్చు పెడుతుంటారు. ఎరువులు ఉపయోగించడంతోపాటు నీరు సమృద్ధిగా అందిస్తుండటంతో ఒక్కో గంజాయి మొక్క 6 నుంచి 8 అడుగుల మధ్య ఏపుగా పెరుగుతు కిలో బరువు గంజాయి దిగుబడి ఇస్తుంది. నాణ్యమైన గంజాయి ఏజెన్సీలో సాగవుతుండటంతో జాతీయ స్థాయిలో అక్రమ వ్యాపారులంతా ఏజెన్సీలో గంజాయినే కొనుగోలు చేస్తున్నారు. రూ.కోట్లలో వ్యాపారం జరుగుతున్నప్పటికి ఎక్సైజ్, పోలీసు అధికారులు దీని సాగును పూర్తిగా నిర్మూలించ లేకపోతున్నారు. గంజాయి సాగు నిర్మూలనలో అటవీ, రెవెన్యూశాఖలకు కూడా సర్వహక్కులు ఉన్నప్పటికి వారు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో ఇటీవల జిల్లా కలెక్టర్ గంజాయి నిర్మూలనకు బాధ్యత ఉన్న అన్ని శాఖలను సమాయత్త పరిచారు.
ఎక్సైజ్‌శాఖ వద్ద ఆయుధాలు లేకపోవడంతో ఒంటరిగా గంజాయి తోటలను ధ్వంసం చేయలేకపోతున్నారు. గతంలో జి.మాడుగుల మండలం కిల్లంకోట వద్ద గంజాయి తోటలు ధ్వంసానికి వెళ్ళిన ఎక్సైజ్ అధికారులపై అక్కడ స్థానిక గిరిజనులు ఎదురుదాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అప్పటి నుంచి మారుమూల ప్రాంతాల్లో గంజాయి దాడులకు ఎక్సైజ్‌శాఖ దూరంగానే ఉంది. ఎక్సైజ్‌శాఖ పోలీసుశాఖ సహకారాన్ని తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఈ ఏడాది గంజాయి సాగుకు ఈ రెండు శాఖలు సమన్వయంతో గంజాయి తోటలు ధ్వంసానికి శ్రీకారం చుట్టాయి. రెవెన్యూ యంత్రాంగం కూడా గంజాయి తోటల ధ్వంసానికి తప్పనిసరిగా వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. పోలీసు కూంబింగ్ పార్టీలు, సీఆర్‌పీఎఫ్ బలగాలు బందోబస్తు మధ్య ఎక్సైజ్‌శాఖ దాడులకు సిద్ధమైంది. శనివారం తొలిరోజే ఎక్సైజ్, పోలీసుశాఖల ఉమ్మడి దాడులు విజయవంతమయ్యాయి. పాడేరు మండలం మారుమూల బొడ్డాపుట్టు ప్రాంతంలో 22 ఎకరాల విస్తీర్ణంలోని 6 అడుగుల ఎత్తుకు ఎదిగిన గంజాయి తోటలను ఎక్సైజ్, పోలీసు అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ గంజాయి తోటల ధ్వంసంలో పాల్గొన్నారు. ఇకపై అన్ని ప్రాంతాల్లోను గంజాయి తోటల ధ్వంసానికి ఎక్సైజ్, పోలీసుశాఖలు రంగం సిద్ధం చేస్తున్నాయి.