కరీంనగర్: కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల పోలీసులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన ఎండీ షమీం(32), ఆమె తల్లి బిపాషా(60) కొంతకాలంగా మహారాష్ట్రకు రైళ్లలో గంజాయి తరలించి అమ్ముతున్నారు. వీరు వరంగల్ జిల్లా మల్లారెడ్డిపల్లికి చెందిన రాజిరెడ్డి, కొప్పుల గ్రామానికి చెందిన నరిగె రాజయ్యల వద్ద నుంచి కిలో రూ.2 వేల చొప్పున కొనుగోలు చేసి, దాన్ని చిన్న కవర్లలో ప్యాక్ చేసి నాగ్పుర్‌కు తరలించి అక్కడ కిలో రూ.10 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
వీరి దందాపై సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం షమీం ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 20 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులతో పాటు వారికి గంజాయి సరఫరా చేస్తున్న రాజిరెడ్డి, రాజయ్యలపై కేసు నమోదు చేశారు. షమీం, బిషాషాలను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న రాజిరెడ్డి, రాజయ్యల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.