తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు రూ.30 లక్షల విలువైన 41 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మారేడుమిల్లి (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు రూ.30 లక్షల విలువైన 41 బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓఎస్‌డీ వై.రవిప్రకాష్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల ఒకటవ తేదీన మారేడుమిల్లి సీఐ డి. గోవిందరావు ఆదేశాల మేరకు మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు బి. రమేష్‌బాబు, శేషుకుమార్ సిబ్బందితో మారేడుమిల్లి -గుర్తేడు వెళ్లే కల్వర్టులు తనిఖీ చేస్తుండగా మద్దులూరు సమీపంలో లోయలో దాచిన 41 బస్తాల గంజాయిని కనుగొని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో దర్యాప్తు చేయగా ఒడిశా, విశాఖ జిల్లా అటవీ ప్రాంతాల నుంచి తెచ్చిన గంజాయిని ఓ వాహనంలో మైదాన ప్రాంతానికి తరలిస్తుండగా మద్దులూరు వద్ద వాహనం చెడిపోయింది.
దాంతో స్మగ్లర్లు గంజాయిని కొందరి సాయంతో లోయలో దాచారు. చివరికి అది పోలీసుల కంటబడ్డ విషయం తెలుసుకున్న స్మగర్లు అప్పటికే వాహనం మరమ్మతులు పూర్తికావడంతో పరారయ్యారు. గంజాయిని తరలించడానికి సహకరించిన మద్దులూరు, మారేడుమిల్లి గ్రామాలకు చెందిన వీర వెంకట సత్యనారాయణ, అల్లూరి రాజేష్‌బాబు, రాజు, హరిబాబు అనే కూలీలను అరెస్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల, మహారాష్ట్రలకు చెందిన నలుగురు ప్రధాన నిందితులు పరారయ్యూరు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, రౌడీషీట్ మాదిరిగానే గంజాయి రవాణా చేసే వారిపై గంజాయి షీట్ నమోదు చేస్తామని ఓఎస్‌డీ చెప్పారు.