నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మళ్లీ పెచ్చుమీరుతున్నాయి. మత్తులో చిన్నపాటి వివాదానికే పరస్పరం దాడులు
మళ్లీ తెరపైకి ఆగడాలు
గంజాయి మత్తులో దందాలు
భయపెట్టి డబ్బు వసూలు చేయటమే లక్ష్యం
రైల్వేస్టేషన్ కేంద్రంగా కార్యకలాపాలు
చిట్టినగర్ ఘటనతో ఉలిక్కిపడ్డ నగరం
టాస్క్‌ఫోర్స్ పోలీసుల దృష్టి
విజయవాడ : నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మళ్లీ పెచ్చుమీరుతున్నాయి. మత్తులో చిన్నపాటి వివాదానికే పరస్పరం దాడులు చేసుకోవటం, డబ్బు వసూళ్లలో తేడాలు వచ్చి ఒక బ్యాచ్ సభ్యులపై మరో బ్యాచ్ సభ్యులు దాడులకు దిగటం నగరంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం చిట్టినగర్ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలు పరస్పరం బ్లేడ్‌లతో దాడులు చేసుకోవటంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. దీంతో నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బ్లేడ్ బ్యాచ్ ముఠాలపై సీరియస్‌గా వ్యవహరించి రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరిచి ఉక్కుపాదం మోపారు. మళ్లీ ఏడాది కాలం నుంచి దీనిపై దృష్టి సారించకపోవటంతో బ్యాచ్‌ల ఆగడాలు శృతిమించాయి.
పారిపోయి వచ్చి.. పెడదోవ పట్టి..
ఇంటి నుంచి పారిపోయి నగరానికి వచ్చి పెడదోవ పడుతున్న అనేక మంది యువకులు కాలక్రమంలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోని అనేక ప్రాంతాల నుంచి ఇళ్లలో అలిగి వచ్చిన చిన్నారులు, అనాథలుగా ఉన్న కొందరు యువత రైల్వేస్టేషన్, బస్టాండ్ కేంద్రంగా ఉండి కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో గంజాయి, వైట్‌నర్ మత్తుకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించటానికి యాచనతో మొదలుపెట్టి బ్లేడ్ చూపి ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసే స్థాయికి చేరారు.
పన్నెండేళ్ల క్రితమే బీజం...
కచ్చితంగా విజయవాడ నగరంలో 12 ఏళ్ల కిత్రం బ్లేడ్ బ్యాచ్ సంస్కృతికి బీజం పడింది. రెండేళ్లలోనే 64 మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నగరంలో తయారయ్యారు. వీరు నాలుగు ముఠాలుగా ఏర్పడి బెదిరించి డబ్బులు వసూలు చేయటం, ఇవ్వని వారిపై బ్లేడ్‌లతో దాడి చేసి గాయపర్చటం మొదలుపెట్టారు. ముఖ్యంగా విజయవాడ రైల్వేస్టేషన్, బస్టాండ్, వన్‌టౌన్ సెంటర్, సీతమ్మ పాదాలు, బెంజ్‌సర్కిల్, కృష్ణలంక, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో వీరి ఆగడాలు కొన్నేళ్లపాటు కొనసాగాయి.
చిట్టినగర్‌లో ఏడాదిగా...
గత ఏడాది కాలం నుంచి చిట్టినగర్‌లో వీరి దందా మొదలైంది. కేఎల్ రావు నగర్‌కు చెందిన బ్యాచ్ సభ్యుడు అంజిబాబు అలియాస్ అంజికి, మరో ముఠా సభ్యుడు ప్రసాద్‌కు మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో వారి మధ్య బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కాళేశ్వరరావు మార్కెట్‌లో ప్రసాద్ వెంట ఉండే గణేష్‌తో గొడవపడి గాయపర్చాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఈ బ్యాచ్‌లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మైనర్లే అధికం
బ్లేడ్ బ్యాచ్ ముఠాలో దాదాపు అందరూ 20 ఏళ్లలోపు యువకులే. బుధవారం నాటి ఘటనలో దాడి చేసింది.. గాయపడింది కూడా 18 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఎనిమిదేళ్ల క్రితం వరకు నగరంలో 64 మంది ఉండగా.. వారిలో కొందరు మరణించారు. మిగిలినవారిలో 20 మంది వరకు వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్నారు. పోలీసులు సుమారు 20 మందిపై పెండింగ్ కేసులు, సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు కూడా తెరిచారు. ఏడాదిన్నర కిత్రం వరకు బ్లేడ్ బ్యాచ్‌పై సీరియస్‌గా పనిచేసిన టాస్క్‌ఫోర్స్ ప్రస్తుతం పట్టించుకోవటం లేదు. క్రికెట్ బెట్టింగ్‌లు, పేకాట స్థావరాలు, వ్యభిచార ముఠాల అరెస్ట్, ఇతర కేసుల్లో బిజీగా మారి దీనిని పూర్తిగా విస్మరిస్తోంది. దీంతో చాపకింద నీరులా బ్యాచ్ ఆగడాలు కొనసాగుతునే ఉన్నాయి. మార్కెట్‌లో దాడి ఘటనతో ఇవి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్‌లో వెస్ట్ బుకింగ్ కౌంటర్ నుంచి డీఆర్‌ఎం కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఈ ముఠా సభ్యులు అధికంగా సంచరిస్తూ తరచూ ఏదో ఒక గొడవ చేసి పరస్పర దాడులకు దిగుతూనే ఉన్నారు. పోలీసులు సీరియస్‌గా స్పందిచకపోతే రాజధాని నగరంలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలు మరింతగా పుట్టుకొచ్చే ప్రమాదముంది.