కార్యాలయాలు కిటకిట
రేపటి నుంచి విలువల పెంపు
కక్షిదారుల ఉరుకులు పరుగులు
హడావుడిగా రిజిస్ట్రేషన్లు
విజయవాడ : జిల్లాలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం భూములు, స్థలాల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువలు పెంచనుంది. ఈ క్రమంలో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత కొద్దిరోజులుగా రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో విక్రయాలు జరుపుకొని అగ్రిమెంట్ల మీద ఉన్న ఆస్తులను హడావుడిగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మార్కెట్ విలువలు 20 నుంచి 30 శాతం పెరగనుండటంతో, స్టాంప్ డ్యూటీ భారం కొనుగోలుదారులపై పడుతుందని కక్షిదారులు పెండింగులో ఉన్న లావాదేవీలను అత్యవసరంగా పూర్తి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నెలకంటే జూలైలో అన్ని రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జూన్‌లో 15 వేల 81 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగగా, జూలైలో 20 వేల 764 అంటే దాదాపు ఐదు వేల రిజిస్ట్రేషన్లు అధికంగా జరిగాయి.
జిల్లాలో మూడు డీఆర్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో గత రెండు మాసాలుగా లభించిన ఆదాయం వివరాలిలా ఉన్నాయి. జూన్‌లో విజయవాడ వెస్ట్ డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.25.44 కోట్లు లక్ష్యం కాగా, రూ.16.41 కోట్ల ఆదాయం లభించింది. విజయవాడ తూర్పు డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.22.48 కోట్లు లక్ష్యం నిర్ణయించగా, రూ.12.43 లక్షల ఆదాయం వచ్చింది. మచిలీపట్నం డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.11.52 లక్ష్యం కాగా, రూ.8.27 కోట్ల మేర ఆదాయం లభించింది. జూలైలో విజయవాడ వెస్ట్ డీఆర్ కార్యాలయం పరిధిలో రూ.34.98 కోట్లు టార్గెట్ కాగా, రూ.23.81 కోట్ల మేరకు ఆదాయం లభించింది. విజయవాడ తూర్పు డీఆర్ పరిధిలో రూ.30.91 కోట్ల లక్ష్యం కాగా, రూ.19.73 కోట్ల ఆదాయం వచ్చింది. మచిలీపట్నం డీఆర్ కార్యాలయ పరిధిలో రూ.15.84 కోట్ల లక్ష్యంకాగా, రూ.12.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.