న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు, బోనస్ ఇష్యూలు, బైబ్యాక్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు సమీక్షించనుంది. ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల కాలంలో భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. దాంతో కేంద్ర ఆర్థికశాఖ ఆయా సంస్థల వద్ద పోగవుతున్న లాభాల నిర్వహణకు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంది.
గతంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల బ్యాలన్స్ షీట్లు భారీగా పెరిగాయి. దాంతోపాటు కంపెనీల మార్కెట్ విలువ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మూలధన పునర్‌వ్యవస్థీకరణ మార్గదర్శకాల సమీక్షపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. సవరించిన మార్గదర్శకాలు ఈ నెలలోనే విడుదల అవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏటా వాటి పన్ను చెల్లింపుల అనంతరం సమకూరే లాభాల్లో 30 శాతం లేదా తమ నెట్‌వర్త్ (నికర విలువ)లో 5 శాతాన్ని డివిడెండ్ కింద చెల్లించాలి. నికర విలువ కనీసం రూ.2,000 కోట్లు, నగదు/ బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,000 కోట్లు ఉన్న కంపెనీలు బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. సంస్థల మూలధనం కంటే మిగులు నిల్వలు 10 రెట్లు చేరితే బోనస్ షేర్లను జారీ చేయాలి. షేరు ముఖ విలువ కంటే మార్కెట్ ధర లేదా పుస్తక విలువ 50 రెట్లు చేరితే స్టాక్ విభజన చేపట్టాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?
మార్కెట్ విలువలో గణనీయమైన వృద్ధి
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.58 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారీగా నగదు నిల్వలు కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్‌లు చెల్లించాల్సి ఉంటుందని.. దీంతో ఈ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment